నోటా విజేతగా నిలిస్తే?.. సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు

సార్వత్రిక ఎన్నికల వేళ సుప్రీంకోర్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎన్నికల్లో అభ్యర్థుల కన్నా నోటాకు అధికంగా ఓట్లు వస్తే ఏం చేయాలనే విషయమై చర్చకు తావిచ్చేలా ప్రజా ప్రయోజన వ్యాజ్యం ఒకటి దాఖలైంది.

Published : 27 Apr 2024 06:10 IST

ఎన్నిక రద్దు చేసి... మళ్లీ పోలింగ్‌ నిర్వహించాలి
సుప్రీంకోర్టులో పిటిషన్‌... ఈసీకి నోటీసు జారీ

దిల్లీ: సార్వత్రిక ఎన్నికల వేళ సుప్రీంకోర్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎన్నికల్లో అభ్యర్థుల కన్నా నోటాకు అధికంగా ఓట్లు వస్తే ఏం చేయాలనే విషయమై చర్చకు తావిచ్చేలా ప్రజా ప్రయోజన వ్యాజ్యం ఒకటి దాఖలైంది. పోటీలో నిలిచిన అభ్యర్థులు అందరినీ తిరస్కరిస్తూ నోటాకు ఓట్లు వేస్తే.. సదరు నియోజకవర్గం ఫలితాన్ని రద్దు చేసి కొత్తగా పోలింగ్‌ నిర్వహించాలని రచయిత, స్ఫూర్తిదాయక ఉపన్యాసకుడు శివ్‌ ఖేడా తన పిటిషన్‌లో కోరారు. దీనిని పరిశీలించిన సుప్రీంకోర్టు ధర్మాసనం..ఈ అంశంపై ఎన్నికల సంఘాని(ఈసీ)కి నోటీసు జారీ చేసింది. పిల్‌ ద్వారా లేవనెత్తిన అంశాలపై విచారణ జరిపేందుకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌, జస్టిస్‌ జె.బి.పార్దీవాలా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్ర ధర్మాసనం అంగీకరించింది.

నోటా కంటే తక్కువ ఓట్లు పొందిన అభ్యర్థులు తదుపరి ఐదేళ్లు ఏ ఎన్నికలోనూ పోటీ చేయకుండా నిబంధనలు రూపొందించాలని పిటిషనర్‌ కోరారు. నోటాను ‘కల్పిత అభ్యర్థి’గా తెలియజేస్తూ విస్తృత ప్రచారం కల్పించాలన్నారు. ఈ అంశాలకు సంబంధించి తగిన నిబంధనలను రూపొందించేలా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఇటీవల సూరత్‌ లోక్‌సభ స్థానంలో పోలింగ్‌ జరగకుండానే ఓ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికైన తీరును ప్రస్తావించారు. పిటిషనర్‌ ప్రస్తావించిన విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు ధర్మాసనం..ఈసీకి నోటీసు పంపించింది. పిటిషన్‌లోని అంశాలపై ఎన్నికల సంఘం ఏం చెబుతుందో చూద్దామని పేర్కొంది.

పీపుల్స్‌ యూనియన్‌ ఫర్‌ సివిల్‌ లిబర్టీస్‌ (పీయూసీఎల్‌) వేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై సుప్రీంకోర్టు 2013లో వెలువరించిన తీర్పు మేరకు ఈవీఎంలలో నోటా అవకాశం కల్పించారు. ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల్లో ఎవ్వరూ నచ్చకపోతే.. ఈ ‘నోటా’ మీట నొక్కే సదుపాయం ఉంది. అయితే, ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం, నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే చట్టపరంగా ఎలాంటి పరిణామాలు ఉండవు. ఇటువంటి సందర్భంలో ఎవరికి ఎక్కువగా ఓట్లు వస్తే ఆ అభ్యర్థినే విజేతగా ప్రకటిస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని