Unemployment: ఐఐటీల్లోనూ ఉద్యోగ సంక్షోభం.. 38%మందికి దక్కని కొలువులు!

దేశంలోని ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలైన ఐఐటీల్లోనూ క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌ క్రమంగా తగ్గుతున్నాయి. 

Published : 23 May 2024 16:07 IST

ఖరగ్‌పూర్‌: మన దేశంలో ఐఐటీలకు ఉన్న క్రేజ్‌ అంతా ఇంతా కాదు. ఈ ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో చదివితే చాలు..  మంచి కంపెనీల్లో ఉద్యోగాలు, రూ.లక్షల్లో వేతన ప్యాకేజీల్లాంటి మాటల్నే తరచూ వింటూ ఉంటాం. కానీ, ప్రస్తుతం నిరుద్యోగం పెరగడంతో అందుకు భిన్నమైన పరిస్థితులు వెలుగుచూస్తున్నాయి. మన దేశంలోని ఐఐటీల్లో విద్యనభ్యసించిన విద్యార్థుల్లో ఈ ఏడాది దాదాపు 38శాతం మందికి క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌ దక్కకపోవడం గమనార్హం. ఐఐటీ కాన్పూర్‌ పూర్వ విద్యార్థి ధీరజ్‌సింగ్‌ సమాచార హక్కు చట్టం (RTI) ద్వారా సేకరించిన సమాచారంలో పలు ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి.

ఈ ఏడాది మొత్తం 23 ఐఐటీ క్యాంపస్‌ల్లో దాదాపు 8వేల మంది (38శాతం) ఐఐటీయన్లకు ప్లేస్‌మెంట్స్‌ దక్కలేదని తేలింది. 2024లో 21,500 మంది విద్యార్థులు ప్లేస్‌మెంట్స్‌ కోసం నమోదు చేసుకోగా.. కేవలం 13,400 మంది మాత్రమే ప్లేస్‌మెంట్స్‌ సాధించారని.. మిగతా వారు (38శాతం) ఇంకా కొలువుల కోసం అన్వేషిస్తున్నట్లు వెల్లడైంది.  రెండేళ్ల క్రితం నాటితో పోలిస్తే ఈ పరిస్థితి దాదాపు రెట్టింపు అయినట్లు ఈ గణాంకాలు సూచిస్తున్నాయి. పాత తొమ్మిది ఐఐటీల్లో  ఈ ఏడాది 16,400 మంది విద్యార్థులు ప్లేస్‌మెంట్ కోసం నమోదు చేసుకోగా.. వారిలో 6,050 (37%) మందికి ఇంకా ఉద్యోగాలు దక్కలేదు. కొత్త 14 ఐఐటీల్లో అయితే ఈ పరిస్థితి మరింత క్షీణించింది. 5,100 మంది ప్లేస్‌మెంట్స్‌ కోసం నమోదు చేసుకోగా.. ఇంకా 2,040 మందికి కొలువులు రాలేదని తేలింది. గతేడాది కాన్పూర్‌ ఐఐటీ, ఖరగ్‌పుర్‌ ఐఐటీల్లో 33శాతం మంది విద్యార్థులకు ప్లేస్‌మెంట్స్‌ దక్కలేదని ధీరజ్‌సింగ్‌ తన లింక్డిన్‌ పోస్ట్‌లో పేర్కొన్నారు.  ఉద్యోగ నియామకాల్లో సంక్షోభ పరిస్థితుల కారణంగా ఇంకా ఉద్యోగాలు రాని విద్యార్థులు ఒత్తిడి, ఆందోళన, నిస్సహాయతతో ఉన్నారని ఆయన తెలిపారు.

ఐటీ దిల్లీలో గత ఐదేళ్లలో 22శాతం మంది విద్యార్థులకు ప్లేస్‌మెంట్లు దక్కకపోగా.. 2024కు వచ్చేసరికి 40శాతం మందికి అదే పరిస్థితి ఎదురైంది. 2022 నుంచి 2024 వరకు పాత తొమ్మిది ఐఐటీల్లో  నమోదు చేసుకున్న విద్యార్థుల సంఖ్య 1.2 రెట్లు పెరగ్గా.. ఉద్యోగాలు సాధించనివారి సంఖ్య 2.1 రెట్లు పెరిగింది. అలాగే, నూతన ఐఐటీల్లో నమోదిత విద్యార్థుల సంఖ్య 1.3 రెట్లు పెరిగింది. కానీ ప్లేస్‌మెంట్స్‌ దక్కని విద్యార్థుల సంఖ్య కూడా 3.8 రెట్లు పెరిగింది. ఈ సంక్షోభం విద్యార్థుల మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతోంది. ఈ ఏడాది ఆరుగురు ఐఐటీ విద్యార్థులు ఆత్మహత్య చేసుకోగా.. అనేకమంది తీవ్రమైన ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలు ఎదుర్కొంటున్నట్లు పలు నివేదికలు పేర్కొంటున్నాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు