Balvatika Admissions: కేంద్రీయ విద్యాలయ ‘బాలవాటిక’ల్లో ప్రీ-ప్రైమరీలో ప్రవేశాలకు ప్రకటన

ఎంపిక చేసిన కేంద్రీయ విద్యాలయాల్లోని బాలవాటిక కింద ప్రీప్రైమరీ తరగతుల్లో చిన్నారుల ప్రవేశానికి ఏప్రిల్‌ 1 నుంచి దరఖాస్తులు మొదలు కానున్నాయి.

Updated : 29 Mar 2024 16:32 IST

Balvatika Admissions| ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన కేంద్రీయ విద్యాలయాల్లో బాలవాటిక I/II/IIIల్లో ప్రీ ప్రైమరీ (1వ తరగతి కంటే  ముందు) తరగతుల్లో ప్రవేశాలకు ప్రకటన విడుదలైంది. మార్చి 31 నాటికి మూడేళ్లు పైబడి ఆరేళ్ల లోపు వయసు కలిగిన చిన్నారులకు ఈ ప్రవేశాలు కల్పించనున్నట్లు కేంద్రీయ విద్యాలయ సంఘటన్‌(KVS) తెలిపింది. కేవీల్లో ఒకటో తరగతి ప్రవేశాలకు షెడ్యూల్‌తో పాటు బాలవాటికల్లోనూ ప్రవేశాలకు ప్రత్యేకంగా ప్రకటన విడుదల చేసింది. రిజిస్ట్రేషన్లు, ప్రవేశాల ప్రక్రియ ఆఫ్‌లైన్‌లో జరగనుందది. చిన్నారులను కేవీ బాలవాటికల్లో ప్రీ ప్రైమరీ తరగతుల్లో చేర్పించేందుకు ఏప్రిల్‌ 1 నుంచి 15 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు.

మీ పిల్లల్ని కేవీల్లో ఒకటో తరగతిలో చేర్పిస్తారా? ప్రవేశాలకు షెడ్యూల్‌ వచ్చేసింది..

  • ఎంపిక చేసిన 50 కేవీల్లో బాలవాటిక-1లో, 445 కేవీల్లో బాలవాటిక-3 తరగతులు నిర్వహిస్తున్నారు. బాలవాటిక -2, 3ల్లో ప్రవేశాలను సీట్ల ఖాళీలను బట్టి భర్తీ చేస్తారు. 
  • బాలవాటిక-1లో అడ్మిషన్‌ కోసం చిన్నారి వయసు మార్చి 31, 2024 నాటికి మూడేళ్లు పూర్తయి నాలుగేళ్లు మించకుండా ఉండాలి. ఏప్రిల్‌ 1న పుట్టిన వారికి కూడా అవకాశం కల్పిస్తారు.  బాలవాటిక -2లో చేర్పించేందుకు నాలుగేళ్లు పూర్తయి.. ఐదేళ్లు మించరాదు. బాలవాటిక- 3లో ప్రవేశాలకు ఐదేళ్లు నిండి.. ఆరేళ్లు మించొద్దు. 
  • ప్రత్యేకావసరాలు కలిగిన చిన్నారులైతే ఈ నిబంధనల్లో రెండేళ్ల వయోసడలింపు ఇచ్చారు. 
  • రిజిస్ట్రేషన్‌ చేసుకున్న విద్యార్థులకు సంబంధించి ఎంపికైన/వెయిటింగ్‌లో ఉన్న వారి తొలి ప్రొవిజినల్‌ జాబితాను ఏప్రిల్‌ 19న ప్రకటిస్తారు. ఖాళీలను బట్టి రెండో ప్రొవిజినల్‌ జాబితాను ఏప్రిల్‌ 29న, మూడో ప్రొవిజినల్‌ జాబితాను మే 5న ప్రకటిస్తారు. మే 22 నుంచి 27 మధ్య అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతుంది.
  • బాలవాటికల్లో అడ్మిషన్లకు తుది గడువు జూన్‌ 29. ఎంపికైన, వెయిటింగ్‌ లిస్ట్‌లో ఉన్న చిన్నారుల జాబితాలను కేంద్రీయ విద్యాలయ వెబ్‌సైట్‌లో చూడొచ్చు. అలాగే, ఆయా పాఠశాలల నోటీస్‌ బోర్డులోనూ ఉంచుతారు. దేశవ్యాప్తంగా బాలవాటికలు ఉన్న 495 కేంద్రీయ విద్యాలయాల పూర్తి జాబితాను ఈ కింది పీడీఎఫ్‌లో చూడొచ్చు. 

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని