Mechanical engineering: మెకానికల్‌ చేస్తే ఏ అవకాశాలు?

Eenadu icon
By Features Desk Published : 13 Aug 2025 03:09 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

మెకానికల్‌ ఇంజినీరింగ్‌ మొదటి ఏడాది చదువుతున్నా. అందరూ కంప్యూటర్‌ సైన్స్‌ చదవమంటున్నారు. నాకు మెకానికల్‌ అంటేనే ఆసక్తి. దీనితో ఉద్యోగావకాశాలు ఎలా ఉంటాయి?

ఆనంద్‌

ప్రస్తుత ఉద్యోగ మార్కెట్‌లో కంప్యూటర్‌ సైన్స్‌ చదివినవారికే ఉద్యోగావకాశాలుంటాయి అనేది అపోహ మాత్రమే. నిజానికి కంప్యూటర్‌ సైన్స్, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, ఏఐ, డేటా సైన్స్, మెషిన్‌ లెర్నింగ్‌ చదివినవారందరికీ మంచి ఉద్యోగాలు దొరకడం లేదు. ఈ మధ్యకాలంలో సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్‌ లాంటి కోర్‌ బ్రాంచీల్లో చేరే విద్యార్థుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కోర్‌ బ్రాంచీల్లో బీటెక్‌ పూర్తి చేసినవారికి ఎప్పటికీ డిమాండ్‌ ఉంటుంది. అయితే మారుతున్న సాంకేతిక పరిణామాలకు అనుగుణంగా నూతన నైపుణ్యాలను పొందడం తప్పనిసరి.

మెకానికల్‌ ఇంజినీరింగ్‌ చదివినవారికి ప్రైవేటు రంగంలో ఆటోమొబైల్, ఏరోస్పేస్, హెవీ మెషినరీ, సిమెంట్, స్టీల్‌ పరిశ్రమల్లో ప్రొడక్షన్, క్వాలిటీ కంట్రోల్, డిజైన్‌ విభాగాల్లో అవకాశాలుంటాయి. క్యాడ్, క్యామ్‌ లాంటి సాఫ్ట్‌వేరుల్లో ప్రావీణ్యం ఉంటే డిజైన్, ఆర్‌ అండ్‌ డీ… రంగాల్లో చేరవచ్చు. పవర్‌ ప్లాంట్లు, రెన్యూవబుల్‌ ఎనర్జీ ప్రాజెక్టుల్లో కూడా మంచి అవకాశాలున్నాయి. ప్రభుత్వ రంగ సంస్థలైన బీహెచ్‌ఈఎల్, గెయిల్, ఎన్టీపీసీ, ఐఓసీఎల్, హెచ్‌పీసీఎల్, హెచ్‌ఏఎల్, డీఆర్‌డీఓ, ఇస్రోల్లో కొలువులు పొందవచ్చు. ఆసక్తి ఉంటే డిగ్రీ అర్హత ఉన్న స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్, యూపీఎస్సీ, రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్, రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డులు, బ్యాంకింగ్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డులు నిర్వహించే పోటీ పరీక్షలకు కూడా సిద్ధం అవ్వవచ్చు. ఎంటెక్, ఎంఎస్, ఎంబీఏ లాంటి ఉన్నత చదువులు చదివి బోధన, పరిశోధన, మేనేజ్‌మెంట్‌ రంగాలకు వెళ్ళవచ్చు. జర్మనీ, జపాన్‌ లాంటి దేశాల్లో మెకానికల్‌ ఇంజినీర్లకు మంచి అవకాశాలు లభిస్తున్నాయి.

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ప్లాన్‌

ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళితే మెకానికల్‌ ఇంజనీరింగ్‌లో మంచి కెరియర్‌ నిర్మించుకోవచ్చు. దీనికోసం స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ప్లాన్‌ను అనుసరించడం మేలు. 

  • మొదటి సంవత్సరంలో ఆటో క్యాడ్, సాలిడ్‌ వర్క్స్, ఫ్యూజన్‌ 360 వంటి టూల్స్‌లో ప్రాథమిక అంశాలు నేర్చుకొంటూ, మ్యాథ్స్, ఫిజిక్స్‌లపై మంచి పట్టు సాధించాలి. 
  • రెండో సంవత్సరంలో డిజైన్‌ టూల్స్‌లో నైపుణ్యం పెంపొందించుకోవాలి. సీఎన్‌సీ మెషిన్లు, త్రీడీ ప్రింటింగ్‌ అవగాహనతో మినీ ప్రాజెక్టులు చేయాలి. 
  • మూడో సంవత్సరంలో సిమ్యులేషన్‌ టూల్స్‌ నేర్చుకోవాలి. మెయింటెనెన్స్, క్వాలిటీ కంట్రోల్‌ పద్ధతులు తెలుసుకోవాలి. ప్రముఖ సంస్థల్లో ఇంటర్న్‌షిప్‌ చేసే ప్రయత్నం చేయాలి. 
  • నాలుగో సంవత్సరంలో పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా ప్రాజెక్టులు పూర్తి చేయాలి. ప్లేస్‌మెంట్‌కు అవసరమైన ఆప్టిట్యూడ్, టెక్నికల్‌ ప్రిపరేషన్‌ చేయాలి. ఎన్‌పీటెల్, స్వయం, కోర్స్‌ ఎరా, యుడెమి లాంటి ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్స్‌ ద్వారా థర్మల్‌ ఇంజినీరింగ్, రోబోటిక్స్, ఇండస్ట్రీ 4.0, ఐఓటీ లాంటి అంశాలపై సర్టిఫికేషన్లు పొందాలి. అదనంగా ఇండస్ట్రీ విజిట్లు, వర్క్‌షాప్‌లు, హాకథాన్స్‌లో పాల్గొనాలి. లింక్డ్‌ఇన్‌ లాంటి ప్రొఫెషనల్‌ నెట్‌వర్కుల్లో చురుగ్గా ఉండాలి. సస్టెయినబుల్‌ ఎనర్జీ, ఆటోమేషన్‌ లాంటి భవిష్యత్తు రంగాల్లో నైపుణ్యం పెంపొందించుకోవాలి.

ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌  


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు