NTA: చీటింగ్‌ చేస్తే.. కఠిన చర్యలు తప్పవ్‌: జేఈఈ మెయిన్‌ అభ్యర్థులకు ఎన్‌టీఏ హెచ్చరిక

జేఈఈ మెయిన్‌ సెషన్‌ 2 పరీక్షల నేపథ్యంలో అభ్యర్థులకు ఎన్‌టీఏ హెచ్చరికలు జారీ చేసింది.

Published : 04 Apr 2024 19:03 IST

దిల్లీ: దేశవ్యాప్తంగా జేఈఈ మెయిన్‌ (సెషన్‌ 2) పరీక్షలు మొదలయ్యాయి. ఏప్రిల్‌ 4 నుంచి 12వ తేదీ వరకు వివిధ తేదీల్లో జరిగే ఈ పరీక్షలు రాసే అభ్యర్థులకు ఎన్‌టీఏ హెచ్చరికలు జారీ చేసింది. పరీక్ష రాసే సమయంలో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.  పరీక్ష డేటా అనాలసిస్‌ పూర్తయిన తర్వాత కూడా చర్యలు తప్పవని హెచ్చరించింది. అభ్యర్థుల రిమోట్‌ బయోమెట్రిక్‌ను సరిపోల్చేందుకు ఏఐని వినియోగిస్తున్నామని.. జనవరిలో జరిగిన జేఈఈ మెయిన్‌ సెషన్‌-1కు సంబంధించి పరీక్ష అనంతర డేటా విశ్లేషణలో అక్రమాలకు పాల్పడినట్లు నాలుగు కేసుల్ని గుర్తించినట్లు పేర్కొంది.  ఈ ఏడాది జనవరిలో జరిగిన పరీక్షలకు 12.57లక్షల మంది అభ్యర్థులు రిజిస్టర్‌ చేసుకోగా.. 75శాతం మంది మాత్రమే హాజరైన విషయం తెలిసిందే.

తాజాగా నిర్వహిస్తున్న పరీక్షలపై ఎన్‌టీఏ డైరెక్టర్‌ జనరల్‌ సుబోధ్‌కుమార్‌ సింగ్‌ ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ..  పరీక్షల్లో అక్రమాలను నియంత్రించి సజావుగా జరిగేలా పలు దశల్లో వెరిఫికేషన్‌,  బయోమెట్రిక్ అథెంటికేషన్‌, ఈ-కైవేసీ, అభ్యర్థులను క్షుణ్ణంగా తనిఖీ చేయడంతో పాటు ఇన్వెజిలేషన్‌ సిబ్బంది, ఇతర సిబ్బందిని నియమించినట్లు తెలిపారు. ఒకవేళ అభ్యర్థులు ఎవరైనా బయో-బ్రేక్‌/టాయిలెట్‌ కోసం వెళ్లినా మళ్లీ వారు తనిఖీలు, బయోమెట్రిక్‌ చేయించుకోవాల్సి ఉంటుందని స్పష్టంచేశారు. పరీక్ష స్ఫూర్తిని దెబ్బతీసేలా ఎలాంటి ప్రయత్నం చేసినా ఆయా అభ్యర్థులను ఈ ఏడాది మాత్రమే కాకుండా భవిష్యత్తులోనూ పరీక్ష రాయకుండా డీబార్‌ చేసే అవకాశం ఉంటుందన్నారు. అంతేకాకుండా క్రిమినల్‌ చర్యలూ ఉంటాయని హెచ్చరించారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని