పీసీబీల్లో 50% పైగా ఉద్యోగ ఖాళీలు.. ఏపీలో ఎన్నంటే?

దేశవ్యాప్తంగా వివిధ కాలుష్య నియంత్రణ మండలిల్లో 50శాతానికి పైగా ఉద్యోగ ఖాళీలు ఉన్నట్లు సీపీసీబీ వెల్లడించింది.

Published : 11 Apr 2024 16:53 IST

దిల్లీ: దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో కాలుష్య నియంత్రణ బోర్డులు (పీసీబీ), కమిటీల్లో 50శాతానికి పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు(CPCB) జాతీయ గ్రీన్‌ ట్రైబ్యునల్‌కు సమర్పించిన ఓ నివేదికలో ఈ డేటాను వెల్లడించింది. దీని ప్రకారం.. 28 రాష్ట్రాల కాలుష్య మండలి నియంత్రణ బోర్డులు, ఎనిమిది కాలుష్య నియంత్రణ కమిటీల్లో మొత్తంగా 12,016 పోస్టులు మంజూరుకాగా.. వాటిలో 6,075 (50.56 శాతం) ఖాళీగా ఉన్నట్లు నివేదిక పేర్కొంది. బిహార్‌లో అత్యధికంగా 249 పోస్టులకు గాను 209 (84శాతం) ఖాళీలు ఉండగా.. ఝార్ఖండ్‌లో 271 పోస్టులకు గాను 198 (73శాతం) ఖాళీగా ఉన్నాయి.

ఇంటర్‌తో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. 3,712 పోస్టులకు దరఖాస్తులు షురూ!

మరోవైపు, ఏటా శీతాకాలంలో వాయు కాలుష్య స్థాయిలు పెరిగి డేంజర్‌ బెల్స్‌ మోగించే దిల్లీలో 344 పోస్టులకు గాను 153 (44శాతం) ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. అయితే, అక్కడ 111 మంది ఒప్పంద ఉద్యోగులను నియమించుకున్నారు. ఇకపోతే, 13 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో 58 నుంచి 84 శాతం మేర ఖాళీలు ఉన్నట్లు నివేదిక వివరించింది. ఇందులో ఏపీలో 69శాతం ఖాళీలు ఉండగా.. బిహార్‌లో 84శాతం, గుజరాత్‌లో 62శాతం, హరియాణాలో 63శాతం, ఝార్ఖండ్‌ 73శాతం, కర్ణాటక 60శాతం, మధ్యప్రదేశ్‌ 63శాతం, మణిపుర్‌ 62శాతం, ఒడిశా 58శాతం, రాజస్థాన్‌ 59శాతం, ఉత్తరాఖండ్‌ 61శాతం, దాద్రా నగర్‌ హవేలీ, దమన్‌దీవ్‌ 83శాతం, లద్దాఖ్‌ 69శాతం చొప్పున ఖాళీలు ఉండటం గమనార్హం.

హరియాణా, ఝార్ఖండ్‌, తమిళనాడు, ఉత్తర్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌తో పాటు 16 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు 1,091 మంది సిబ్బందిని ఒప్పంద ప్రాతిపదికన నియమించుకున్నారని సీపీసీబీ నివేదిక వెల్లడించింది. దేశవ్యాప్తంగా 190 పర్యావరణ ప్రయోగశాలలు ఉండగా.. వీటిలో 31 కేంద్రస్థాయిలో, 159 జోనల్‌/రీజనల్‌/జిల్లా స్థాయిల్లో ఉన్నాయి. ఈ లేబొరేటరీల్లో మొత్తంగా 2,965 పోస్టులకు గాను 54శాతం ఖాళీగా ఉన్నాయి. అయితే, 16 రాష్ట్రాల కాలుష్య నియంత్రణ బోర్డులు, కమిటీలు 449 మంది సైంటిఫిక్‌ సిబ్బందిని ఒప్పంద ప్రాతిపదికన నియమించుకొని పని నడిపిస్తున్నాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని