SBI Fellowship: పల్లెల్లో మార్పు కోసం ‘యూత్‌ ఫర్‌ ఇండియా’ ఫెలోషిప్‌.. స్టైఫండ్‌ ఎంతంటే?

గ్రామాల్లో అభివృద్ధి కోసం ఎస్‌బీఐ చేపట్టిన యూత్‌ ఫర్‌ ఇండియా ఫెలోషిప్‌కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఆసక్తి కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలివే..

Updated : 19 Mar 2024 14:28 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశానికి పట్టు కొమ్మలైన గ్రామాల్లో మార్పు కోసం కృషిచేయాలనుకొనే యువతకు భారతీయ స్టేట్‌ బ్యాంక్‌ (SBI) సువర్ణావకాశం కల్పిస్తోంది. ‘యూత్‌ ఫర్‌ ఇండియా’ (YouthforIndia) పేరిట వారికి ఫెలోషిప్‌లను అందిస్తోంది.  దేశంలోని గ్రామాల స్థితిగతులు, అక్కడి ప్రజలు ఎదుర్కొనే సమస్యలపై పలు ఎన్జీవోలతో కలిసి యువతతో అధ్యయనం చేయిస్తూ.. వారికి ఆర్థిక చేయూతనందిస్తోంది. గ్రామాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించాలనే ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఫెలోషిప్‌లకు ఆన్‌లైన్‌లో https://youthforindia.org/  ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. యూత్‌ ఫర్‌ఇండియా ఫెలోషిప్‌ ముఖ్యాంశాలివే..

ఫెలోషిప్‌ వ్యవధి, అర్హతలేంటి?

ఈ ఫెలోషిప్‌ వ్యవధి 13 నెలలు. దరఖాస్తు చేయాలనుకునే విద్యార్థులు ఏదైనా డిగ్రీలో (2023 అక్టోబర్‌ నాటికి) ఉత్తీర్ణులై ఉండాలి. వయసు 21 - 32 ఏళ్ల లోపు ఉండాలి. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలతో మమేకం కావాలనుకొనే వారికి ప్రాధాన్యం. ముఖ్యంగా ఫెలోషిప్ సమయంలో పల్లెల్లో పర్యటించాల్సి ఉంటుంది.

ఎంపిక విధానం?

యూత్ ఫర్ ఇండియా ఫెలోషిప్ ప్రోగ్రాంకు ఎంపిక విధానం దశల వారీగా ఉంటుంది. రిజిస్ట్రేషన్‌ అండ్‌ ఆన్‌లైన్‌ అసెస్‌మెంట్, పర్సనల్‌  ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. తొలుత అభ్యర్థులు తమ వివరాలతో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రెండో దశలో సెలక్షన్ బోర్డు అడిగే అంశాలపై ఆన్‌లైన్ అసెస్‌మెంట్ అందించాల్సి ఉంటుంది. ఇందులో గ్రామీణాభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలు, అభ్యర్థి సూచనలను అడుగుతారు. అనంతరం సెలక్షన్ బోర్డుతో పర్సనల్‌ ఇంటర్వ్యూ ఉంటుంది. వీటి ఆధారంగానే తుది ఎంపిక ఉంటుంది. అనంతరం ఆఫర్‌ లెటర్‌తో పాటు ప్రోగ్రామ్‌ వివరాలు, ఫెలోషిప్‌లో నిబంధనలతో కూడిన వివరాలను అందజేస్తారు. అంతకముందు ఓరియంటేషన్‌ కార్యక్రమం కూడా కల్పిస్తారు. 

  • స్టైఫండ్‌: ఎంపికైన వారికి వసతి కోసం నెలకు రూ.15,000 స్టైపెండ్ చొప్పున ఇస్తారు. స్థానికంగా ప్రయాణ ఖర్చులకు రూ.1000; ప్రాజెక్టు సంబంధిత ఖర్చుల కోసం నెలకు మరో రూ.1000 చొప్పున చెల్లిస్తారు. అలాగే, ఫెలోషిప్‌ను విజయవంతంగా పూర్తి చేసిన వారికి ఇతర అలవెన్సుల రూపంలో రూ.70,000 అందజేస్తారు.
  • ఎంపికైన వారికి తమ ఇంటి నుంచి బయల్దేరడం మొదలు ప్రాజెక్టు చేసే ప్రదేశానికి చేరుకొనే వరకు ప్రయాణానికి 3ఏసీ రైలు ఛార్జీల ఖర్చులు, శిక్షణా కార్యక్రమాల కోసం ప్రయాణాలకు అవసరమైన ఖర్చుల్ని సైతం చెల్లిస్తారు. 
  • వైద్య, వ్యక్తిగత ప్రమాద బీమా సౌకర్యం కూడా ఉంటుంది. 
  • గ్రామీణాభివృద్ధి కోసం ఎస్‌బీఐ యూత్ ఫర్ ఇండియాతో కలిసి పనిచేసే ఎన్జీఓలు ఈ ఫెలోషిప్‌నకు ఎంపికైన వారికి దిశానిర్దేశం చేస్తాయి. క్షేత్రస్థాయిలో తమకు అప్పగించిన పనిని అభ్యర్థులు అర్థం చేసుకోడానికి ఎన్జీవో కేంద్రాలు సహకరిస్తాయి. అనంతరం ప్రోగ్రాం లక్ష్యానికి అనుగుణంగా వీరు కృషి చేయాల్సి ఉంటుంది. 
  • 2011 మార్చి 1న మొదలైన ఫెలోషిప్‌ను ఇప్పటివరకు 27 బ్యాచ్‌లు విజయవంతంగా పూర్తి చేసుకున్నాయి. ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా 20 రాష్ట్రాల్లో 250కి పైగా గ్రామాల్లో 580మందికి పైగా ఫెలోలు మార్పు కోసం కృషిచేశారు. వీరిలో ఇప్పటికే 70శాతం మంది అభివృద్ధి రంగంలో చురుగ్గా వ్యవహరిస్తున్నారని ఎస్‌బీఐ ఫౌండేషన్‌ తెలిపింది.

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని