NEET UG 2024: ‘నీట్‌’లో మెరిసేందుకు ఆ పుస్తకాలే కీలకం.. కొన్ని చిట్కాలివే!

నీట్‌ యూజీ పరీక్షకు దరఖాస్తుల ప్రక్రియ ఏప్రిల్‌ 10తో ముగియనుంది. ఈ ప్రతిష్టాత్మక పరీక్షకు సిద్ధమవుతున్న విద్యార్థులు ఎలా చదివితే మెరుగైన ర్యాంకు సాధించవచ్చో తెలిపే కొన్ని సూచనలు ఇవే..

Published : 10 Apr 2024 16:26 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌:  దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్‌ (యూజీ) (NEET UG 2024) పరీక్షకు గడువు సమీపిస్తోంది. లక్షలాది మంది విద్యార్థులు పోటీపడుతోన్న ఈ పరీక్ష మే 5న జరగనుంది. గతేడాదితో పోలిస్తే ఈసారి ‘నీట్‌’కు రికార్డు స్థాయిలో దరఖాస్తులు వెల్లువెత్తాయి. ఎంతో కఠినంగా ఉండే ఈ పరీక్షకు సన్నద్ధతలో భాగంగా విద్యార్థులు ఎప్పటినుంచో శ్రమిస్తున్నారు.  లాంగ్‌ టర్మ్‌ కోచింగ్‌లు, అదనపు తరగతులు, హోమ్‌ ట్యూషన్‌లు.. ఇలా ఎవరికి సాధ్యమైన పద్ధతుల్లో వారు ప్రిపేరేషన్‌ కొనసాగిస్తున్నారు. అయితే, నీట్‌ (యూజీ) పరీక్ష ప్రిపరేషన్‌లో ఎన్‌సీఈఆర్‌టీ(NCERT) పాఠ్యపుస్తకాలు ఎంతో కీలకమని.. ఆ పుస్తకాలను చదివితే చాలా ప్రయోజనం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.  11, 12వ తరగతులకు సంబంధించిన ఎన్‌సీఈఆర్‌టీ పాఠ్యపుస్తకాల్లోని కాన్సెప్టులే నీట్‌ యూజీ సిలబస్‌లో దాదాపు 80 నుంచి 85శాతం ఉంటాయని పేర్కొంటున్నారు. అందువల్ల విద్యార్థులు పాఠ్యపుస్తకాలను క్షుణ్ణంగా అధ్యయనం చేయడం ఎంతో అవసరమని సూచిస్తున్నారు. ఆ పుస్తకాలను చదివేందుకు కొన్ని టిప్స్‌ ఇవే..

  • ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలను ఏదో మొక్కుబడిగా కాకుండా ప్రతీ టాపిక్‌ను విశ్లేషణాత్మకంగా చదవాలి. రేఖా చిత్రాలు, మైండ్‌ మ్యాప్‌లతో కాన్సెప్టులను అనుసంధానం చేస్తూ ప్రిపరేషన్‌ కొనసాగిస్తే బాగా గుర్తుండిపోతాయి. చదివిన వాటిని మీ సొంత మాటల్లో పాయింట్లుగా రాసుకోవడం అలవరుచుకుంటే ఆ టాపిక్స్‌ గుర్తుండటంతో పాటు అవగాహన స్థాయి మెరుగవుతుంది.
  • ఈ పుస్తకాల్లో సమస్యల పరిష్కారం (solved problems) లేదా అదనపు నోట్సుతో కూడిన ఉదాహరణలు అనేకం ఉంటాయి. ఈ సెక్షన్లను ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయొద్దు. నీట్‌ పరీక్షకు అవి ఎంతో కీలకంగా మారుతాయి. మనం బయటి వనరుల నుంచి సేకరించాలనుకొనే అంశాలకు సంబంధించి ఎంతో లోతైన వివరణలు అందులో ఉంటాయి. 
  • ఒక కాన్సెప్టును నేర్చుకున్న తర్వాత నీట్‌ పరీక్షలో అడిగిన వాస్తవిక ప్రశ్నలకు దాన్ని వర్తింపజేసేలా కసరత్తు చేయండి.  NCERT కంటెంట్‌పై ప్రత్యేకంగా దృష్టిసారించే గత పరీక్ష పేపర్లు, మాక్‌ టెస్ట్‌లను గమనించండి. వాటిలో మీరు చేసిన తప్పుల్ని విశ్లేషించుకోండి. లోతైన అవగాహన కోసం ఆ కాన్సెప్టులను మరోసారి తిరిగి చూసేలా ప్రణాళిక వేసుకోండి. 
  • ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాల్లో సమాచారంతో కూడిన డయాగ్రమ్స్‌, బొమ్మలు చాలా ఉంటాయి. వాటిని క్షుణ్ణంగా పరిశీలించండి. వాటిలో పేర్కొన్న సమాచారాన్ని అర్థం చేసుకొని మీ గ్రహణ శక్తిని పరీక్షించుకొనేందుకు వాటిని మీరే సొంతంగా గీసేందుకు ప్రయత్నించడం ద్వారా ఫలితం ఉంటుంది.

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని