Exams: పరీక్షల సమయం.. ఫోన్‌కు ఇచ్చేద్దాం విరామం!

అసలే ఇది పరీక్షల కాలం.. ఈ సమయంలో మొబైల్‌ ఫోన్లకు కాస్త విరామం ఇస్తే కలిగే ప్రయోజనాలివే..

Published : 02 Mar 2024 11:14 IST

Exams| అసలే ఇది పరీక్షల కాలం. పిల్లలు ఎంత శ్రద్ధగా చదువుతున్నా.. మధ్యమధ్యలో ఫోను పట్టుకోకుండా ఉండలేరు. ఏదో డౌట్‌ ఉందనో, మెటీరియల్‌ కావాలనో, ఫ్రెండ్స్‌ ఎలా చదువుతున్నారో తెలుసుకోవాలనో అలా ఫోన్‌ తీయడం.. తీరా దాంతోనే కాలక్షేపం చేయడంతో తెలీకుండానే సమయం వృథా అయిపోతుంటుంది. మరి ఇలా అయితే మంచి మార్కులెలా వస్తాయి? పరీక్షల సమయంలో ఫోన్‌ వాడకం తగ్గించి చదవడం ద్వారా కలిగే లాభాలివే..

ప్రస్తుతం సోషల్‌ మీడియా వాడని విద్యార్థులు లేరనే చెప్పొచ్చు. నేటి జీవనశైలికి మొబైల్‌ను పూర్తిగా వాడకుండా ఉండటం సాధ్యం కాదు. అలాగని పరీక్షల వంటి ముఖ్యమైన సమయాల్లో గంటల తరబడి వాటిని ఉపయోగించడం సరికాదు. వివిధ పరీక్షల్లో మంచి ర్యాంకులు సాధించిన టాపర్లు, గొప్ప గొప్ప ప్లేయర్లు... కీలకమైన సమయాల్లో ఫోనును అస్సలు ఉపయోగించరు. వారి ఫోకస్‌ మొత్తం పూర్తిగా ఆ టాస్క్‌పైనే పెడతారు. విద్యార్థులు కూడా ప్రస్తుతం పరీక్షలపైనే పూర్తిగా ఫోకస్‌ పెడితే మంచి మార్కులు/స్కోర్‌ సాధించే అవకాశం ఉంటుంది. 

  • ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, వాట్సప్‌... ఇలా ఫోన్‌లో కొన్ని యాప్స్‌కు మనం బాగా అలవాటు పడిపోయాం. ఈ సమయంలో వాటిని అతి తక్కువగా మాత్రమే వినియోగించాలి. అవసరమైతే కొద్దిరోజులపాటు పూర్తిగా అన్‌ఇన్‌స్టాల్‌ చేసేసినా, అకౌంట్స్‌ ఇన్‌యాక్టివ్‌ చేసినా ఇబ్బంది లేదు.
  • కొందరు విద్యార్థులు పూర్తిగా ఫోన్‌ వాడను అని నిర్ణయించుకుని, అలా ఉండలేక ఒత్తిడికి గురవుతుంటారు. తల్లిదండ్రులు కూడా ఫోన్‌ తీస్తే తిట్టడం వంటివి చేస్తూ ఉంటారు, అది సరికాదు. ఇన్నాళ్లుగా అలవాటు పడినదానికి హఠాత్తుగా దూరంగా ఉండాలంటే ఎవరికైనా కష్టమే. పరీక్షల సమయంలో అలాంటి అదనపు ఒత్తిడి ఉండకూడదు. ఇప్పటికి పరిమితిలో వాడేలా సాధన చేయడమే ఉత్తమం.
  •  చాలాసేపు చదువుకున్నాం కదా.. కాసేపు రిలాక్స్‌ అవుదాం అని ఫోన్‌ తీసే విద్యార్థులు చాలామంది ఉంటారు. అయితే అది సరైన పద్ధతి కాదు. అప్పటివరకూ కళ్లపై పడిన ఒత్తిడి చాలదా, మళ్లీ ఫోన్‌ ఎందుకు? ఇంట్లో వాళ్లతో సరదాగా మాట్లాడటం, కాసేపు అలా బయట నడవటం వల్ల శరీరం, మెదడుకు విశ్రాంతి దొరుకుతుంది. తిరిగి బాగా చదువుకునేందుకు ఉత్సాహం కలుగుతుంది.

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని