Stress Relief Apps: పరీక్షల ఒత్తిడిని తగ్గించే యాప్‌లు ఇవిగో!

పరీక్షల ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగించేందుకు అందుబాటులో ఉన్న కొన్ని యాప్‌లు ఇవే..

Updated : 29 Feb 2024 17:26 IST

Stress Relief Apps | విద్యార్థి లోకానికి ఇది పరీక్షా కాలం. వార్షిక పరీక్షలు ఒకవైపు, ఉద్యోగ పోటీ పరీక్షలు మరోవైపు.. ప్రిపరేషన్‌లో విద్యార్థులు తీరిక లేకుండా ఉన్నారు. ఈక్రమంలో ఎదురయ్యే ఆందోళన, ఒత్తిడుల నుంచి వారికి కాసేపు ఉపశమనం ఇచ్చే కొన్ని మొబైల్‌ యాప్‌లు ఇవే.. 

బ్రీత్‌2రిలాక్స్‌

ఈ ఉచిత యాప్‌ను కళాశాల విద్యార్థుల కోసం ప్రత్యేకంగా రూపొందించారు. డౌన్‌లోడ్‌ చేసుకుని.. అందులో సూచించినట్లు శ్వాస సంబంధ వ్యాయామాలు చేయాలి. దీర్ఘంగా శ్వాస తీసుకుని వదిలినప్పుడు గుండె కొట్టుకునే వేగాన్ని కొలుస్తారు. ప్రతీ సెషన్‌లో ఫలితాలను భద్రపరిచే రికార్డును నిర్వహిస్తారు. దీనిద్వారా శ్వాస వ్యాయామాల పనితీరును పరీక్షించుకోవచ్చు.

మైండ్‌షిఫ్ట్‌

దీన్ని ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. కొన్నిరకాల భయాలు, ఆపదలు రాబోతున్నాయని ముందుగానే ఊహించుకుని ఒత్తిడికి గురికావడం, ఎదుటివాళ్లు ఏమనుకుంటారోనని భయపడటం వీటన్నింటికీ దీంట్లో పరిష్కారాలను సూచించారు. ఆలోచనలను రికార్డు చేయడం ద్వారా ఒత్తిడికి గురిచేసే అంశాలను గుర్తించే వెసులుబాటు ఉంది. ఈ యాప్‌లో ఆడియో రికార్డింగ్‌ల లైబ్రరీ కూడా అందుబాటులో ఉంటుంది.

సాన్‌వెల్లో

మానసిక ఆరోగ్య మార్గాలూ, ధ్యానానికి సంబంధించిన మార్గదర్శకాలనూ ఇందులో పొందుపరిచారు. ఒత్తిడిని తగ్గించుకుని, విశ్వాసాన్ని పెంచుకునే చిట్కాలూ అందుబాటులో ఉంటాయి. గుండె కొట్టుకునే వేగాన్ని రికార్డు చేసే మానిటర్‌ ఉంటుంది. ఈ యాప్‌ను ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. కొన్ని ప్రత్యేక ఫీచర్లకు మాత్రం నామమాత్రపు ఫీజు చెల్లించాలి.

సెల్ఫ్‌హెల్ప్‌ ఫర్‌ యాంగ్జైటీ మేనేజ్‌మెంట్‌

ఈ అప్లికేషన్‌ను యూనివర్సిటీ ఆఫ్‌ వెస్ట్‌ ఆఫ్‌ ఇంగ్లండ్‌కు చెందిన పరిశోధకులు రూపొందించారు. దీన్ని గూగుల్‌, ఆపిల్‌ ప్లేస్టోర్‌ల నుంచి ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఇది ఒత్తిడిని తగ్గించుకునే మార్గాలను తెలియజేస్తుంది. దీంట్లో అందుబాటులో ఉండే జర్నల్‌లో రోజు మొత్తంలో ఒత్తిడి స్థాయిలను రికార్డు చేసుకోవచ్చు. దీనిద్వారా ఏయే సందర్భాల్లో ఎక్కువగా ఆందోళనకు గురవుతున్నారో సులువుగా తెలుసుకోవచ్చు.

వర్రీ వాచ్‌

ఈ యాప్‌ను కళాశాల విద్యార్థుల మానసిక ఆరోగ్యం కోసం రూపొందించారు. తక్కువ ఫీజుతో యాప్‌ స్టోర్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. రోజు మొత్తంలో ఒత్తిడికి గురైన సందర్భాలను, అనుభవాలను ఇందులో రాసుకోవచ్చు. వీటి ద్వారా ఒత్తిడికి అసలు కారణాలను గుర్తిస్తారు. ఈ యాప్‌ మరో ప్రత్యేకత ఏమిటంటే.. ఇది ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లో కూడా పనిచేస్తుంది.

హ్యాపీఫై 

దీంట్లో కొన్ని గేమ్స్‌, యాక్టివిటీస్‌ ఉంటాయి. స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్స్‌, డెస్క్‌టాప్స్‌, ల్యాప్‌టాప్స్‌, కంప్యూటర్‌ వేదికగా దీన్ని ఉపయోగించుకోవచ్చు. యాప్‌లోని వివిధ ఆటల ద్వారా వినియోగదార్లు పొందిన ఆనందాన్ని కొలుస్తారు. నాలుగు వారాలపాటు వీటిని ఆడిన తర్వాత 80 శాతం మందిలో మూడ్‌ మెరుగైనట్టు గుర్తించారు. దీన్ని వాడటానికి ముందు కొన్ని సంక్షిప్త సర్వే ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలి. సబ్‌స్క్రైబ్‌ చేసుకుని ఈ యాప్‌ సేవలను ఉపయోగించుకోవచ్చు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని