Summer Vacation: వేసవి సెలవులు గుర్తుండిపోయేలా.. కొత్తగా ఇలా చేసేద్దామా?

ఈ వేసవి సెలవుల సమయాన్ని వినోదం, విజ్ఞానం మేళవింపుతో ఎప్పటికీ గుర్తుండిపోయేలా కొత్తగా ఏం చేయొచ్చో ఆలోచించండి.

Published : 24 Apr 2024 10:09 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇన్నాళ్లూ పుస్తకాలు, పరీక్షలతో కుస్తీపడుతూ అలసిపోయారు కదా.. మరి ఇప్పుడు వేసవి సెలవులు వచ్చేశాయ్‌. ఈ సరదా సమయంలో ఏం చేద్దామనుకొంటున్నారు? రొటీన్‌గా సినిమాలు చూడటం, క్రికెట్‌ ఆడటంతోనే సరిపెడితే బోర్‌ కదా.. అందుకే ఈసారి సెలవుల్లో ఇంకా కొత్తగా ఏం చేయొచ్చో ఆలోచించండి. ఎంతో విలువైన ఈ సమయాన్ని వినోదం, విజ్ఞానం మేళవించేలా కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడంతో పాటు ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఇలా ట్రై చేసి చూడండి!

  • రోజూ ఓ మంచి పుస్తకం చదవండి. సెలవుల్లోనూ చదువేనా అనుకోవద్దు. మనం బయట తెలుసుకోవాల్సిన విషయాలు అనంతం. వివిధ రంగాల్లో అనుభవజ్ఞులు, నిపుణులు వాటిని సొంత మాటల్లో పుస్తక రూపంలో మనకు అందిస్తూ ఉంటారు. ఒక మంచి పుస్తకం ఇచ్చే జ్ఞానం, రేకెత్తించే ఆలోచన.. మనలో పునరుత్తేజానికి తోడ్పడుతుంది. విద్యార్థి వ్యక్తిత్వాన్ని నిర్మించుకోవడంలో ఒక్కో పుస్తకం ఒక్కో ఇటుకలా ఉపయోగపడుతుంది.
  • ఏదైనా కొత్త భాష నేర్చుకోవడంపై దృష్టిపెట్టండి. సంగీత వాద్యం సాధన చేయండి. నచ్చిన ఆటలు ఆడటం, క్రాఫ్ట్స్‌ చేయడం, మొక్కలు పెంచడం, ఇంటిని పూర్తిగా శుభ్రం చేయడం - అలంకరించడం.. ఇలా బోలెడన్ని పనులు ఉంటాయి. ఇందులో మీకు నచ్చినదేంటో ఎంచుకోండి.
  • సాహస యాత్రలకు వెళ్లండి. ఇవి రోజువారీ జీవితానికి భిన్నంగా ఉండటమే కాకుండా సరికొత్త అనుభూతినిస్తాయి. క్లిష్టమైన పరిస్థితులనూ, వివిధ మనస్తత్వాలు కలిగిన వ్యక్తులను ఎలా ఎదుర్కోవచ్చో నేర్పుతాయి. ట్రెక్కింగ్‌, రాఫ్టింగ్‌, పారాగ్లైడింగ్‌, స్కూబా డ్రైవింగ్‌, క్యాంపింగ్‌.. ఇలా చాలారకాలు అందుబాటులో ఉన్నాయి. వీటిని ప్రోత్సహించేందుకు కొన్నిచోట్ల సంస్థలు, సొసైటీలూ ఉన్నాయి. 
  • వ్యాయామం.. శరీరాన్నీ, మనసునూ రీఛార్జ్‌ చేసే చక్కటి సాధనం. యోగా, ఏరోబిక్స్‌, సైక్లింగ్‌, స్విమ్మింగ్‌.. ఇలా మీకు నచ్చినదాన్ని నేర్చుకునే ప్రయత్నం చేయండి. కుదిరితే జిమ్‌లో చేరడం ద్వారా ఆరోగ్యంపై శ్రద్ధ వహించడానికే కాక, మెరుగైన శరీర సౌష్టవానికీ ఉపయోగపడుతుంది.
  • ఈ పోటీ ప్రపంచంలో ఎప్పుడూ పరిగెడుతూ ఉంటేనే జాబ్‌ మార్కెట్లో మనకంటూ ఓ ప్రత్యేకత ఉంటుంది. వేసవిలో ఖాళీ సమయాన్ని సరదాగా గడుపుతూనే కొత్త నైపుణ్యాలు నేర్చుకుంటే మీ బయోడేటాలో చేర్చుకోవచ్చు. గ్రాఫిక్‌ డిజైనింగ్‌, వెబ్‌ డిజైనింగ్‌, మల్టీమీడియా, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌, కోడింగ్‌, డిజిటల్‌ మార్కెటింగ్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ వంటి అంశాలను నేర్చుకోవడంపై దృష్టిసారిస్తే మీరు ఎంతో ప్రత్యేకంగా నిలుస్తారు.
  • బంధుమిత్రుల్ని ఓసారి వెళ్లి కలవండి. నలుగురితో నడవడాన్ని మించిన ప్రయాణం ఏం ఉంటుంది చెప్పండి? అందుకే గతంలో సెలవులంటే చాలు... అమ్మమ్మ, తాతయ్యల ఊళ్లకు పరుగులు పెట్టేవారు. కానీ ఇప్పుడు కాలం మారింది... దూరం పెరిగింది... ఇలా ఇళ్లకు వెళ్లడం తగ్గిపోయింది. ఈసారి సరదాగా వెళ్లి రండి. అనుబంధాలు పెంచుకోవడంలో ఈ ఆత్మీయ కలయికలు ఎంతో కీలక పాత్ర పోషిస్తాయి.
  • స్వల్పకాల వ్యవధి గల ఏదైనా కోర్సులో చేరండి. ఏ అంశం మీదనైనా సరే కనీస అవగాహన ఏర్పడేందుకు ఈ సర్టిఫికెట్‌ కోర్సులు ఉపయోగపడతాయి. ఇప్పుడు ఆన్‌లైన్‌లో సైబర్‌ సెక్యూరిటీ, డేటా సైన్స్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ - మెషిన్‌ లెర్నింగ్‌, ప్రోగ్రామింగ్‌, ఎథికల్‌ హ్యాకింగ్‌, పిక్సల్‌ ఆర్ట్‌, బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌, డిజైనింగ్‌, ఫొటోగ్రఫీ.. ఇలా ఎన్నోరకాల కోర్సులు ఉన్నాయి. మీకు నచ్చినదాన్ని ఎంపిక చేసుకోండి.
  • వంట ప్రతీఒక్కరికీ అవసరమైన కనీస నైపుణ్యం. ఎప్పుడూ అమ్మ వండి పెట్టడమేనా.. సరదాగా మీరూ గరిట తిప్పండి. ముందు సులువుగా అయిపోయే వంటకాలతో ప్రారంభించి... ఆపైన కూరలు, పిండి వంటల్లాంటివి  ప్రయత్నించవచ్చు.
  • ఇతరులకు సాయం చేయడం కచ్చితంగా నేర్చుకోవాల్సిన విషయం మాత్రమే కాదు, మనసుకు సంతోషాన్నిచ్చే అంశం కూడా. మన చుట్టూ ఎన్నో స్వచ్ఛందసంస్థలు ఉన్నాయి. పేదలు, వ్యాధిగ్రస్థులు, అనాథలు, వృద్ధులు... ఇలాంటి వారికోసం పనిచేసే సంస్థల్లో వాలంటీర్లుగా చేరడం ద్వారా సమాజాన్ని మరో కోణంలో చూసే అవకాశం దక్కుతుంది.
  • సాధారణ రోజుల్లో ఎవరి పనుల్లో వారు బిజీబిజీగా ఉంటారు. అమ్మానాన్నతో కలిసి భోంచేసే సందర్భాలు చాలా తక్కువ. ఈ సెలవుల్లో కనీసం రెండు పూటలైనా అంతా కలిసి భోజనం చేస్తూ సరదాగా గడిపేలా ప్రణాళిక వేసుకోండి.

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని