AP DSC Exams: ఏపీలో డీఎస్సీ పరీక్షలు ఉన్నట్లా? లేనట్లా?.. అయోమయంలో అభ్యర్థులు!

ఏపీలో డీఎస్సీ పరీక్షలు శనివారం నుంచే మొదలు కావాల్సి ఉన్నప్పటికీ ఇంతవరకు అధికారుల నుంచి ఎలాంటి సమాచారం రాకపోవడంతో అభ్యర్థులు తీవ్ర అయోమయంలో ఉన్నారు.

Updated : 29 Mar 2024 20:49 IST

AP DSC 2024 Exams | ఇంటర్నెట్‌ డెస్క్‌: ఏపీలో ఉపాధ్యాయ నియామక పరీక్ష (AP DSC Exams)పై గందరగోళం నెలకొంది. షెడ్యూల్‌ ప్రకారం.. రేపట్నుంచే (శనివారం-మార్చి 30) పరీక్షలు జరగాల్సి ఉన్నప్పటికీ ఇంతవరకు దీనిపై అభ్యర్థులకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. దీంతో వారి పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. లక్షల మంది అభ్యర్థులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నప్పటికీ.. అటు ఈసీ నుంచి గానీ, ఇటు విద్యాశాఖ అధికారుల నుంచి గానీ ఎలాంటి స్పందన రాకపోవడం విమర్శలకు తావిస్తోంది. వాస్తవానికి విద్యాశాఖ ఇచ్చిన షెడ్యూల్‌ ప్రకారం.. మార్చి 30 నుంచి ఏప్రిల్‌ 30వరకు డీఎస్సీ పరీక్షలు జరగాల్సి ఉంది. అయినా ఇంతవరకు డీఎస్సీ అభ్యర్థులకు సెంటర్ల ఎంపికకు ఆప్షన్లు నమోదుకు అవకాశం ఇవ్వలేదు.. హాల్‌టికెట్లు అందుబాటులోకి తేలేదు. అయితే, మార్చి 14న విడుదల కావాల్సిన టెట్‌ ఫలితాలూ (AP TET Results) విడుదల చేయకుండా నిలుపుదల చేశారు. ఈలోగా సార్వత్రిక ఎన్నికలకు షెడ్యూల్‌ రావడంతో ఈసీ నుంచి అనుమతి వస్తేనే విడుదల చేస్తామని అధికారులు ఇటీవల టెట్‌ వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో డీఎస్సీ పరీక్షలు వాయిదా పడినట్లేనని అర్థమవుతోంది. ఒకవేళ ఈసీ అనుమతిచ్చినా ఇప్పటికిప్పుడు డీఎస్సీ నిర్వహణ ఎట్టిపరిస్థితుల్లోనూ సాధ్యం కాదు. అందువల్ల ఈ పరీక్షల్ని మరోసారి రీషెడ్యూల్‌ చేసే అవకాశాలే కనిపిస్తున్నాయి.

ఎన్నికల తర్వాతేనా?

షెడ్యూల్‌ ప్రకారమైతే.. డీఎస్సీ పరీక్షకు సెంటర్ల ఎంపిక మార్చి 20 నుంచి, హాల్‌టికెట్లు 25 నుంచి అందుబాటులోకి రావాలి. కానీ ఇంతవరకు ఆ ఊసేలేదు. ఒకవేళ ఈసీ నుంచి అనుమతి వస్తే రీషెడ్యూల్‌ చేస్తారని.. లేదంటే ఎన్నికల తర్వాతే ఈ పరీక్షలు జరుగుతాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఒకవైపు ఏపీపీఎస్సీ నిర్వహించాల్సిన డిప్యూటీ ఎడ్యుకేషనల్‌ ఆఫీసర్‌ వంటి ఉద్యోగ నియామక పరీక్షలు వాయిదా పడుతున్న నేపథ్యంలో డీఎస్సీ పరీక్షలు ఎన్నికల లోపు నిర్వహించే అవకాశాలు లేవంటున్నారు మరికొందరు. ఎన్నికల కోసం ఒకట్రెండు పరీక్షలను ఏపీపీఎస్సీ వాయిదా వేస్తుంటే.. దాదాపు నెల రోజుల పాటు జరిగే డీఎస్సీ పరీక్షలు నిర్వహించే పరిస్థితి ఉంటుందా? అని పలువురు అభ్యర్థులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. 

దాదాపు ఐదేళ్ల పాటు కాలయాపన చేసిన వైకాపా సర్కార్‌ కేవలం ఎన్నికలకు కొన్ని నెలల ముందు హడావుడిగా టెట్‌, డీఎస్సీ నోటిఫికేషన్లు ఇవ్వడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని పలువురు అభ్యర్థులు పేర్కొంటున్నారు. ప్రిపేర్‌ కావడానికి కూడా తగిన సమయం కూడా ఇవ్వకుండా తొలుత డీఎస్సీ షెడ్యూల్‌ రూపొందించగా.. ప్రభుత్వ తీరును తీవ్రంగా ఆక్షేపిస్తూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో రీషెడ్యూల్‌ చేసిన విషయం తెలిసిందే. ఉపాధ్యాయ ఉద్యోగ నియామకాలను రాజకీయ లబ్ది కోసం వాడుకోవాలన్న ఏకైక లక్ష్యంతోనే కేవలం ఎన్నికలకు ముందు హడావుడిగా ప్రణాళిక లేని రీతిలో నోటిఫికేషన్లు ఇవ్వడంతో తాము ఇలాంటి గందరగోళానికి గురికావాల్సి వచ్చిందంటూ పలువురు అభ్యర్థులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు