Telangana DSC: తెలంగాణ డీఎస్సీ నోటిఫికేషన్‌ రద్దు

గతేడాది ఇచ్చిన తెలంగాణ డీఎస్సీ నోటిఫికేషన్‌ రద్దయింది.

Updated : 28 Feb 2024 21:47 IST

Telangana DSC Notificaton: హైదరాబాద్‌: తెలంగాణలో ఉపాధ్యాయ నియామకాలకు గతేడాది ఇచ్చిన డీఎస్సీ నోటిఫికేషన్‌ను ప్రభుత్వం రద్దు చేసింది. గత సెప్టెంబర్‌లో 5,089 టీచర్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఒకట్రెండు రోజుల్లోనే దాదాపు 11వేలకు పైగా పోస్టులతో మెగా డీఎస్సీకి నోటిఫికేషన్‌ జారీ చేయనున్న వేళ 2023లో ఇచ్చిన నోటిఫికేషన్‌ను రద్దు చేస్తూ పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ ఆదేశాలు జారీ చేశారు. గత డీఎస్సీ నోటిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మళ్లీ కొత్తగా అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. 

రాష్ట్రంలో మొత్తం 5,089 ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి గతేడాది సెప్టెంబర్‌ 20 నుంచి అక్టోబర్‌ 21వరకు దరఖాస్తులు స్వీకరించిన విషయం తెలిసిందే. నవంబరు 20 నుంచి 30 వరకు టీచర్స్‌ రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌(టీఆర్‌టీ) పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. అదే సమయంలో నవంబర్‌ 30న ఎన్నికల పోలింగ్‌ నేపథ్యంలో టీఆర్‌టీ పరీక్షలను వాయిదా వేశారు. కొత్త తేదీలను త్వరలోనే ప్రకటించనున్నట్టు పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ అప్పట్లోనే చెప్పినప్పటికీ.. ఆ తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పడటం, త్వరలోనే మరికొన్ని పోస్టులను కలిపి మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదలకు ఏర్పాట్లు చేస్తున్న నేపథ్యంలో పాత నోటిఫికేషన్‌ను రద్దు చేశారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని