AP DSC: ఏపీలో టెట్‌ ఫలితాలు, డీఎస్సీ పరీక్షలు వాయిదా

ఉపాధ్యాయ నియామక పరీక్ష(డీఎస్సీ)ను షెడ్యూల్‌ ప్రకారం నిర్వహిస్తారా? వాయిదా వేస్తారా? అనే సందిగ్ధతకు ఈసీ తెరదించింది.

Updated : 30 Mar 2024 19:36 IST

అమరావతి: ఉపాధ్యాయ నియామక పరీక్ష(డీఎస్సీ)ను (AP DSC Exam) షెడ్యూల్‌ ప్రకారం నిర్వహిస్తారా? వాయిదా వేస్తారా? అనే సందిగ్ధతకు ఈసీ తెరదించింది. ఎన్నికల కోడ్‌ ముగిసే వరకు టెట్‌ ఫలితాలు, డీఎస్సీ పరీక్షలు వాయిదా వేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్‌ కుమార్‌ మీనా ఆదేశించారు.

హైకోర్టు ఆదేశాల మేరకు ఇప్పటికే డీఎస్సీ షెడ్యూల్‌ను మార్చిన పాఠశాల విద్యాశాఖ అధికారులు.. మార్చి 30 నుంచి ఏప్రిల్‌ 30 వరకు నిర్వహిస్తామని ఇటీవల ప్రకటించారు. పరీక్ష కేంద్రాల ఎంపికకు ఈ నెల 20 నుంచి ఐచ్ఛికాలు నమోదు చేసుకోవాలని, 25 నుంచి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచించారు. కానీ, ఇంతవరకు వెబ్‌సైట్‌లో పరీక్ష కేంద్రాల ఎంపికకే అవకాశం ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో శనివారం సీఈవో ప్రకటనతో అభ్యర్థుల ఉత్కంఠకు తెరపడింది. మరోవైపు ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌) ఫలితాలను మార్చి 14నే విడుదల చేయాల్సి ఉండగా ఇంతవరకు విడుదల చేయలేదు. (ap tet results 2024) ఈసీ నిర్ణయం మేరకు కోడ్‌ ముగిసే వరకు టెట్‌ ఫలితాల కోసం ఎదురు చూడాల్సిందే.

దాదాపు ఐదేళ్ల పాటు కాలయాపన చేసిన వైకాపా సర్కార్‌ కేవలం ఎన్నికలకు కొన్ని నెలల ముందు హడావుడిగా టెట్‌, డీఎస్సీ నోటిఫికేషన్లు ఇవ్వడంతో అభ్యర్థులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ప్రిపేర్‌ కావడానికి కూడా తగిన సమయం కూడా ఇవ్వకుండా తొలుత డీఎస్సీ షెడ్యూల్‌ రూపొందించగా.. ప్రభుత్వ తీరును తీవ్రంగా ఆక్షేపిస్తూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో రీషెడ్యూల్‌ చేసిన విషయం తెలిసిందే. ఉపాధ్యాయ ఉద్యోగ నియామకాలను రాజకీయ లబ్ది కోసం వాడుకోవాలన్న ఏకైక లక్ష్యంతోనే కేవలం ఎన్నికలకు ముందు హడావుడిగా ప్రణాళిక లేని రీతిలో నోటిఫికేషన్లు ఇవ్వడంతో తాము ఇలాంటి గందరగోళానికి గురికావాల్సి వచ్చిందంటూ పలువురు అభ్యర్థులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని