TGSRTC ITI Admissions: టీజీఎస్‌ఆర్టీసీ ఐటీఐ కళాశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

హైదరాబాద్‌, వరంగల్‌లో  టీజీఎస్‌ఆర్టీసీ ఐటీఐ కళాశాలల్లో ప్రవేశాలకు విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

Updated : 27 May 2024 19:26 IST

హైదరాబాద్‌: వరంగల్‌, హైదరాబాద్‌ విద్యార్థులకు టీజీఎస్‌ఆర్‌టీసీ సువర్ణావకాశం అందిస్తోంది. ఈ రెండు నగరాల్లోని టీజీఎస్‌ఆర్టీసీ ఐటీఐ కళాశాలల్లో వివిధ ట్రేడ్‌లలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఆసక్తి కలిగినవారు జూన్ 10 లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. మోటార్‌ మెకానిక్‌ వెహికిల్‌ (రెండేళ్లు), మెకానిక్‌ డీజిల్‌ (ఏడాది), వెల్డర్‌ (ఏడాది), పెయింటర్‌ (రెండేళ్లు) ట్రేడ్‌లలో ప్రవేశాలు కల్పించనున్నారు. మోటార్‌ మెకానిక్‌ వెహికల్‌, డీజిల్‌ మెకానిక్‌ ట్రేడ్‌లకు పదో తరగతి అర్హత కాగా.. మిగతావాటికి ఎనిమిదో తరగతిని విద్యార్హతగా నిర్ణయించారు. పరిమిత సంఖ్యలో సీట్లు ఉండటంతో ఆసక్తి కలిగిన అభ్యర్థులు త్వరగా దరఖాస్తు చేసుకోవాలని టీజీఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ సూచించారు.

స్వయంఉపాధి రంగంలో స్థిరపడాలనుకునేవారికి ఐటీఐ కోర్సులు వరం లాంటివి. నిరుద్యోగ యువతకు చక్కటి శిక్షణ, బంగారు భవిష్యత్‌ అందించడంతో పాటు తక్కువ వ్యవధిలో నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ఈ ఐటీఐ కళాశాలలను సంస్థ ఏర్పాటు చేసింది. నిపుణులైన అధ్యాపకులతో పాటు అపార అనుభవం ఉన్న ఆర్టీసీ అధికారులతో తరగతులను నిర్వహిస్తోంది. ఈ ట్రేడ్‌లలో ప్రవేశం పొందిన విద్యార్థులకు కోరుకున్న టీజీఎస్‌ఆర్టీసీ డిపోల్లో అప్రెంటిస్‌షిప్‌ సౌకర్యం కల్పిస్తున్నారు. ఐటీఐ కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులు హైదరాబాద్‌ ఐటీఐ కళాశాల ఫోన్‌ నంబర్లు 9100664452, 040-23450033, వరంగల్‌ ఐటీఐ కళాశాల ఫోన్‌ నంబర్లు 9849425319, 8008136611 ను సంప్రదించగలరు. పూర్తి వివరాలను https://iti.telangana.gov.in వెబ్‌సైట్‌లోనూ పొందొచ్చు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని