TS CPGET: తెలంగాణ సీపీగెట్‌ నోటిఫికేషన్‌ వచ్చేసింది.. పరీక్షలు ఎప్పట్నుంచంటే?

TS CPGET 2024 Notification| తెలంగాణలోని పలు యూనివర్సిటీల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే సీపీగెట్‌ పరీక్షకు నోటిఫికేషన్‌ విడుదలైంది.

Published : 15 May 2024 22:54 IST

హైదరాబాద్‌: తెలంగాణలోని యూనివర్సిటీల్లో సంప్రదాయ పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే పీజీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (సీపీగెట్‌)కు నోటిఫికేషన్‌ విడుదలైంది. అర్హులైన విద్యార్థులు ఈ నెల 18 నుంచి జూన్‌ 17 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చు. రూ.500 ఆలస్య రుసుంతో జూన్‌ 25 వరకు; రూ.2వేల ఆలస్య రుసుంతో జూన్‌ 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని టీఎస్‌ సీపీగెట్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్ ఐ.పాండురంగారెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. సీపీగెట్‌ ప్రవేశ పరీక్షలను ప్రాథమికంగా జులై 5 నుంచి నిర్వహించేందుకు అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ పరీక్షను ఉస్మానియా విశ్వవిద్యాలయం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

సీపీగెట్‌ పరీక్ష ద్వారా రాష్ట్రంలోని ఉస్మానియా, కాకతీయ, శాతవాహన, తెలంగాణ, మహాత్మాగాంధీ, పాలమూరు, తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం, జేఎన్‌టీయూహెచ్‌ యూనివర్సిటీల్లో పీజీ, ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. ఈ మేరకు బుధవారం మధ్యాహ్నం ఈ నోటిఫికేషన్‌ను ఉన్నత విద్యామండలి కార్యాలయంలో తెలంగాణ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ లింబాద్రి, తదితర ఉన్నతాధికారులు విడుదల చేశారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని