Civils Toppers Marks: ‘సివిల్స్‌’ టాపర్లకు వచ్చిన మార్కులెన్నో తెలుసా? UPSC పరీక్షల మార్కుల షీట్‌లు విడుదల

యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ) నిర్వహించిన సివిల్‌ సర్వీసెస్‌ పరీక్ష‌-2023 ఫలితాల్లో తొలి 10 మంది టాపర్లు సాధించిన మార్కులు ఇవే..

Published : 20 Apr 2024 00:09 IST

దిల్లీ: సివిల్‌ సర్వీస్‌ పరీక్ష.. లక్షలాది మంది కల. దీన్ని సాకారం చేసుకోవడమంటే అంత ఆషామాషీ కాదు. లక్షల మంది  ప్రిలిమ్స్‌ రాస్తే.. చివరకు ఎంపికయ్యేది వందల్లోనే. దీన్ని సాధించాలంటే ఎంతో కృషి, పట్టుదలతో పాటు కఠోర శ్రమ, కచ్చితమైన ప్రణాళిక అవసరం. ఇటీవల విడుదలైన యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (UPSC) సివిల్‌ సర్వీసెస్‌ పరీక్ష‌-2023 ఫలితాల్లో (UPSC Civils 2023 Result) అభ్యర్థులు సాధించిన మార్కుల వివరాలు తాజాగా వెల్లడయ్యాయి. యూపీకి చెందిన ఆదిత్య శ్రీవాస్తవ (Aditya Srivastava) తొలి ర్యాంకు సాధించగా, ఒడిశాకు చెందిన అనిమేశ్‌ ప్రధాన్‌(Animesh Pradhan) రెండు, పాలమూరుకు చెందిన దోనూరు అనన్యరెడ్డి (Donuru Ananya Reddy) జాతీయస్థాయిలో మూడో ర్యాంకుతో మెరిశారు. అయితే, సివిల్స్‌ పరీక్ష ఎంత కఠినంగా ఉంటుందో టాపర్లు సాధించిన ఈ మార్కులను చూస్తే అర్థం చేసుకోవచ్చు. 

UPSC ప్రిలిమ్స్‌, మెయిన్స్‌, ఇతర పరీక్షల మార్కుల షీట్ల కోసం క్లిక్‌ చేయండి

తొలి 10మంది టాపర్లు సాధించిన మార్కులివే..

సివిల్స్‌ మెయిన్‌, ఇంటర్వ్యూలకు కలిపి మొత్తంగా 2025 మార్కులు ఉంటాయి. దీంట్లో మెయిన్‌/రాతపరీక్షకు 1750 మార్కులు, ఇంటర్వ్యూకి 275 మార్కులు చొప్పున కేటాయిస్తారు. అయితే, 2023 సివిల్స్‌ పరీక్షలో తొలి ర్యాంకు సాధించిన  ఆదిత్య శ్రీవాస్తవ మొత్తంగా 1099 మార్కులు (రాత పరీక్షలో 899, ఇంటర్వ్యూలో 200) సాధించినట్లు యూపీఎస్సీ వెల్లడించింది. అలాగే, రెండో ర్యాంకర్‌ అనిమేశ్‌ ప్రధాన్‌ 1067 మార్కులు సాధించారని (892, 175), తొలి ప్రయత్నంలోనే మూడో ర్యాంకులో మెరిసిన తెలుగు బిడ్డ దోనూరు అనన్య రెడ్డి (ఈడబ్ల్యూఎస్‌ కోటా) 1065 మార్కులు (875, 190) వచ్చాయి. నాలుగో ర్యాంకు సాధించిన పీకే సిద్ధార్థ్‌ రామ్‌కుమార్‌కు 1059 మార్కులు (874, 185) రాగా, ఐదో ర్యాంకర్‌ రుహానీ 1049 మార్కులు (856, 193), సృష్టి దబాస్‌ 1048 మార్కులు (862, 186), అన్‌మోల్‌ రాఠోర్‌ 1045 (839, 206), ఆసీస్‌కుమార్‌ 1045 (866, 179), నౌషీన్‌ (1045 (863, 182), ఐశ్వర్యం ప్రజాపతి (ఓబీసీ కోటా) 1044 (890, 154) చొప్పున మార్కులు సాధించినట్లు పేర్కొంది.

ఈ మూడు దశలు దాటుకొని..

అఖిల భారత అత్యున్నత సర్వీసులైన ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఐఎఫ్‌ఎస్‌ తదితర కొలువులకు ఎంపిక కోసం యూపీఎస్సీ ఏటా మూడు దశల్లో సివిల్స్‌ పరీక్ష నిర్వహిస్తుంటుంది. ప్రిలిమినరీ, మెయిన్‌, ఇంటర్వ్యూ.. ఇలా మూడు దశలు ఉంటాయి. సివిల్‌ సర్వీసెస్‌ ప్రిలిమినరీ పరీక్ష-2023 గతేడాది మే 28న జరిగింది. మొత్తంగా 10,16,850 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. వీరిలో 5,92,141 మంది పరీక్ష రాశారు. వీరిలో 14,624 మంది మెయిన్స్‌ రాయగా.. చివరకు 2,855 మంది మాత్రమే ఇంటర్వ్యూలకు ఎంపికయ్యారు. వారిలో సక్సెస్‌ అయ్యింది కేవలం 1016 మంది మాత్రమే. వీరిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన నలుగురు వందలోపు ర్యాంకులు, 11 మంది 200లోపు ర్యాంకులతో సత్తా చాటారు. 2 రాష్ట్రాల నుంచి విజేతలుగా నిలిచినవారిలో మధ్యతరగతి కుటుంబాలకు చెందినవారే ఎక్కువగా ఉన్నారు. ఎన్ని కష్టాలు ఎదురైనా మొక్కవోని దీక్షతో సివిల్స్‌లో విజేతలుగా సత్తా చాటిన దాదాపు 60మంది తెలుగు తేజాలు సాధించిన మార్కులను ఈ కింది పీడీఎఫ్‌లో చూడొచ్చు. 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని