Aditya Srivastava: కార్పొరేట్‌ ఉద్యోగం వదిలి.. ‘సివిల్స్‌’ టాపర్‌గా నిలిచి.. శ్రీవాస్తవ జర్నీ ఇదీ!

లఖ్‌నవూకు చెందిన ఆదిత్య శ్రీవాస్తవ సివిల్స్‌ ఫలితాల్లో టాపర్‌గా మెరిశారు. మూడో ప్రయత్నంలో ఈ ఘనత సాధించారు.

Updated : 16 Apr 2024 18:53 IST

Aditya Srivastava | ఇంటర్నెట్ డెస్క్‌: సివిల్‌ సర్వీస్‌ సాధించడం అంటే అంత తేలికైన విషయం కాదు. లక్షల మంది పోటీపడితే ప్రిలిమ్స్‌, మెయిన్స్‌ దాటుకొని కొలువు సాధించేది మాత్రం కేవలం వందల్లోనే ఉంటారు. ఏళ్లపాటు కష్టపడితే కొందరికే దేశానికి సేవ చేసే భాగ్యం దక్కేది. అందులోనూ టాప్‌ ర్యాంకర్‌గా నిలవడమంటే సామాన్య విషయం కాదు. అలాంటిది, లఖ్‌నవూకు చెందిన ఆదిత్య శ్రీవాస్తవ (Aditya Srivastava) యూపీఎస్సీ ఫలితాల్లో (UPSC Resultls) టాప్‌-1 ర్యాంకుతో సత్తా చాటారు. కార్పొరేట్‌ కొలువు వదిలి.. తొలి ప్రయత్నంలో విఫలమై.. మూడో ప్రయత్నంలో ఏకంగా ఆలిండియా ఫస్ట్‌ ర్యాంకర్‌గా నిలిచారు.

లఖ్‌నవూకు చెందిన ఆదిత్య శ్రీవాస్తవ ఐఐటీ కాన్పూర్‌లో ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌లో డిగ్రీ పూర్తి చేశారు. ప్రపంచంలోనే పేరొందిన ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంక్ గోల్డ్‌మన్‌ శాక్స్‌లో కొలువు సాధించారు. 2019లో బెంగళూరులో ఉద్యోగ జీవితం మొదలుపెట్టారు. కార్పొరేట్‌ ఉద్యోగం, రూ.లక్షల్లో జీతం ఉన్నప్పటికీ 15 నెలలకే ఆ ఉద్యోగానికి రాజీనామా చేశారు. లఖ్‌నవూ చేరి యూపీఎస్సీకి సన్నద్ధమయ్యారు. ఐఐటీ-జేఈఈ వంటి కఠినమైన పరీక్షను దాటిన కొన్నేళ్ల తర్వాత.. మరో కఠిన సవాల్‌ను స్వీకరించి అలుపెరగని కృషి చేశారు.

యూపీఎస్సీ సివిల్స్‌ తుది ఫలితాలు వచ్చేశాయ్‌.. తెలుగు అమ్మాయికి మూడో ర్యాంకు

సంప్రదాయ కోచింగ్‌ పద్ధతులు కాకుండా.. తనదైన సొంత ప్రణాళికతో ముందుకెళ్లారు శ్రీవాస్తవ. ముఖ్యంగా పాత క్వశ్చన్‌ పేపర్లపై ఎక్కువగా ఆధారపడేవారు. మాక్‌ టెస్టులు, కోచింగ్‌ సంస్థల ఇంటర్వ్యూలకు హాజరయ్యేవారు. అయితే, 2021లో తొలి ప్రయత్నంలో ఆదిత్య శ్రీవాస్తవకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఆ ఏడాది కనీసం ప్రిలిమ్స్‌ దశను కూడా దాటలేకపోయారు. తప్పులు సరిదిద్దుకుని మళ్లీ తన ప్రయాణాన్ని మొదలుపెట్టారు.

తన కష్టానికి 2022లో తొలిసారి ఫలితం లభించింది. ఆ ఏడాది యూపీఎస్సీ ఫలితాల్లో 236వ ర్యాంక్‌ సాధించిన ఆయన ఐపీఎస్‌కు ఎంపికయ్యారు. ఐఏఎస్‌ కావాలన్న పట్టుదలతో మూడోసారి 2023లో సివిల్స్‌ రాసి జాతీయస్థాయిలో మొదటి ర్యాంకుతో భళా అనిపించారు. పాత క్వశ్చన్‌ పేపర్లను అనాలసిస్‌ చేసి.. పరీక్ష సిలబస్‌ను అంచనా వేయడం వల్లే ఈ విజయం సాధ్యమైందని శ్రీవాస్తవ అన్నారు. హార్డ్‌వర్క్‌, స్మార్ట్‌వర్క్‌ మధ్య తేడా గుర్తించి వ్యూహాత్మకంగా ముందుకెళ్లడం వల్లే తనకు ఈ విజయం దక్కిందని చెప్పుకొచ్చారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని