గర్భసంచిలో ఈ గడ్డలేంటి?

గర్భసంచిలో గడ్డలు అనగానే చాలామంది క్యాన్సర్‌ కణితులేమోనని భయపడిపోతుంటారు. నిజానికి గర్బ ´సంచిలో తలెత్తే గడ్డల్లో ఫైబ్రాయిడ్‌ గడ్డలే అధికం....

Published : 09 May 2017 01:34 IST

గర్భసంచిలో ఈ గడ్డలేంటి?

గర్భసంచిలో గడ్డలు అనగానే చాలామంది క్యాన్సర్‌ కణితులేమోనని భయపడిపోతుంటారు. నిజానికి గర్బ ´సంచిలో తలెత్తే గడ్డల్లో ఫైబ్రాయిడ్‌ గడ్డలే అధికం. వీటికి క్యాన్సర్‌తో సంబంధమేమీ లేదు. ఇవి క్యాన్సర్‌గా మారే అవకాశమూ లేదనే చెప్పుకోవచ్చు.
ర్భసంచిలో గడ్డల సమస్య పిల్లలు పుట్టే వయసులో (15-45 ఏళ్లలో) ఉన్న స్త్రీలలో ఎక్కువగా కనబడుతుంటుంది. ఈ గడ్డలు చిన్న బఠాణీ గింజంత సైజు దగ్గర్నుంచి పెద్ద పుచ్చకాయంత సైజు వరకూ పెరగొచ్చు. ఈ కణితులు గర్భసంచి గోడల కణాల నుంచే పుట్టుకొచ్చి, అక్కడే గడ్డల్లా ఏర్పడుతుంటాయి. ఇవి గర్భసంచి లోపల, మీద.. ఎక్కడైనా ఏర్పడొచ్చు. ఒకే సమయంలో ఒకటి కన్నా ఎక్కువ గడ్డలు కూడా ఉండొచ్చు. ఫైబ్రాయిడ్లు చిన్నగా ఉన్నప్పుడు పైకి ఎలాంటి లక్షణాలూ కనబడవు. అందువల్ల ఎంతోమందికి ఇవి ఉన్న సంగతే తెలియదు. వైద్యులు పొత్తికడుపును పరీక్షిస్తున్నప్పుడో, గర్భం ధరించినపుడు అల్ట్రాసౌండ్‌ పరీక్ష చేస్తున్నప్పుడో యాదృచ్ఛికంగా బయటపడుతుంటాయి.

ఎందుకొస్తాయి?
గర్భసంచిలో కణితులు ఎందుకు ఏర్పడతాయో కచ్చితంగా తెలియదు. కొంతవరకు జన్యుపరంగా వచ్చే అవకాశముంది. ఈస్ట్రోజెన్‌ హార్మోను వీటిని ప్రభావితం చేస్తుందన్నది మాత్రం సుస్పష్టమైంది. ఇవి కొందరిలో వేగంగా మరికొందరిలో నెమ్మదిగా పెరగొచ్చు. కొన్ని ఎప్పుడూ ఒకే సైజులో ఉండొచ్చు, కొన్ని వాటంతటవే కుంచించుకుపోవచ్చు. నెలసరి నిలిచిపోయిన తర్వాత సహజంగానే ఈస్ట్రోజెన్‌ ఉత్పత్తి తగ్గుతుంది కాబట్టి ఫైబ్రాయిడ్లు కూడా చిన్నగా అవుతాయి. కొన్నైతే రాళ్లలా గట్టిపడిపోతాయి కూడా.

అధిక రుతుస్రావం.. నొప్పి..
సాధారణంగా ఫైబ్రాయిడ్లు ప్రమాదకరమైనవి కావు. కానీ సైజు బాగా పెరిగి, పక్కభాగాలను నొక్కుతుంటే రకరకాల బాధలు మొదలవుతాయి. ప్రధానంగా నెలసరి సమయంలో రుతుస్రావం ఎక్కువగా, ఎక్కువరోజులు అవుతుంటుంది. నెలసరి కూడా త్వరత్వరగా వస్తుంటుంది. రుతుస్రావం ఎక్కువగా కావటం వల్ల రక్తహీనత తలెత్తొచ్చు. రుతుస్రావమయ్యే సమయంలో పొత్తికడుపులో తీవ్రమైన బాధ, నొప్పి ఉండొచ్చు. ఫైబ్రాయిడ్లు మరీ పెద్దవైతే గర్భాశయం గుంజినట్టయ్యి.. నడుంనొప్పి, పొత్తికడుపులో రాయిపెట్టినట్టు బరువుగా ఉండొచ్చు. కణితులు ఫలోపియన్‌ ట్యూబులను నొక్కితే సంతానం కలగటంలో ఇబ్బంది తలెత్తొచ్చు. కొందరిలో గర్భం నిలవకపోనూవచ్చు. గడ్డలు మూత్రకోశానికి అడ్డువస్తే మూత్ర సమస్యలు, పురీషనాళానికి అడ్డొస్తే మలబద్ధకం వంటివీ బయలుదేరతాయి.

చికిత్స ఏంటి?
ఫైబ్రాయిడ్లు ఉన్నా బాధలేవీ లేకపోతే ఎలాంటి చికిత్స అవసరం లేదు. ఏడాదికి ఒకసారి స్కానింగు చేసి గడ్డలు ఎలా ఉన్నాయన్నది చూసుకుంటే చాలు. బాధలు ఎక్కువగా ఉంటే మాత్రం.. గడ్డలు ఏర్పడిన చోటు, బాధల తీవ్రత, మహిళల వయసును బట్టి చికిత్స చేస్తారు. నెలసరి నిలిచిపోవటానికి దగ్గర్లో ఉన్నవారికి తాత్కాలికంగా మందులు ఇచ్చి పరిశీలిస్తారు. ఫైబ్రాయిడ్లకు ఈస్ట్రోజెన్‌ హార్మోన్‌ ఉత్పత్తిని తగ్గించే మందులు బాగా ఉపయోగపడతాయి. ఇవి తాత్కాలికంగా ముట్లుడిగిపోయేలా చేస్తూ.. కణితుల సైజు తగ్గటానికి తోడ్పడతాయి. అయితే ఈ మందులతో వేడి ఆవిర్ల వంటి దుష్ప్రభావాలు తలెత్తొచ్చు. అందువల్ల వీటిని 3-6 నెలల కన్నా ఎక్కువకాలం వాడటం మంచిది కాదు. దీర్ఘకాలం వేసుకుంటే ఎముక క్షీణతకూ దారితీయొచ్చు. కొందరికి ప్రొజెస్టిరాన్‌ను విడుదల చేసే ఐయూడీని లోపల అమరుస్తారు. ఇది రుతుస్రావం అధికంగా కావటాన్ని తగ్గిస్తుంది. కొందరికి గర్భనిరోధక మాత్రలు కూడా ఇస్తుంటారు. అవసరమైతే ఆపరేషన్‌ చేయాల్సి రావొచ్చు. సంతానం కలగనివారికి కేవలం కణితులనే తొలగించి, గర్భసంచిని అలాగే ఉంచేందుకు ప్రయత్నిస్తారు. పిల్లలు పుట్టిన తర్వాత గడ్డలు ఏర్పడితే గర్భసంచిని తీసేయొచ్చేమో పరిశీలిస్తారు. ప్రస్తుతం అబ్లేషన్‌ ప్రక్రియతో కణితికి రక్తాన్ని సరఫరా చేసే నాళాన్ని మూసేసే పద్ధతి కూడా అందుబాటులో ఉంది. దీంతో గడ్డ క్రమేపీ చిన్నదై, మాయమవుతుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని