పిడికెడు జాలీలు

చూడటానికి పిడికెడంత కూడా ఉండవు గానీ మూత్రపిండాలు (కిడ్నీలు) మహా.....

Published : 13 Mar 2018 01:45 IST

పిడికెడు జాలీలు

చూడటానికి పిడికెడంత కూడా ఉండవు గానీ మూత్రపిండాలు (కిడ్నీలు) మహా గట్టివి. రక్తంలోని వ్యర్థాలను, విషతుల్యాలను, అధికంగా ఉన్న నీటిని ఎప్పటికప్పుడు వడకట్టి.. మూత్రం రూపంలో బయటకు పంపేస్తుంటాయి. ఒంట్లో నీరు, లవణాల సమతుల్యత దెబ్బతినకుండా, రక్తపోటు నియంత్రణలో ఉండేలానూ చూస్తాయి. కిడ్నీల వడపోత సామర్థ్యం తగ్గితే ఒంట్లోని జీవక్రియలన్నీ అస్తవ్యస్తమవుతాయి. కాబట్టి ఇవి దెబ్బతినకుండా చూసుకోవటం ఎంతైనా అవసరం.
రోజూ వాడేవే అయినా...
వయసు పెరుగుతున్నకొద్దీ కిడ్నీల వడపోత సామర్థ్యం తగ్గుతూ వస్తుంది. 30 ఏళ్లు దాటిన తర్వాత కిడ్నీ పనితీరు ఏటా 10% మేరకు పడిపోతుంది. మనం రోజూ వాడుకునే ఆహార పదార్థాలు కూడా కిడ్నీజబ్బు ముప్పును పెంచొచ్చు.
1. ఉప్పు: దీనిలోని సోడియం రక్తపోటును పెంచుతుంది. ఇది కిడ్నీలను దెబ్బతీసి కిడ్నీ వైఫల్యానికి దారితీస్తుంది.
2. చక్కెర: దీన్ని మితిమీరి తీసుకుంటే గుండె, కిడ్నీజబ్బుల ముప్పు పెరిగేలా చేసే యూరిక్‌ ఆమ్లం ఉత్పత్తి పెరుగుతుంది.
3. కూల్‌డ్రింకులు: రోజుకు 2 కన్నా ఎక్కువ కూల్‌డ్రింకులు తాగేవారికి మూత్రంలో సుద్ద పోయే ముప్పు ఎక్కువ. ఇదీ కిడ్నీజబ్బు ముప్పును పెంచుతుంది.
4. మాంసాహార ప్రోటీన్లు: వీటితో కిడ్నీల మీద భారం ఎక్కువగా పడుతుంది.
5. నొప్పి మందులు: ఎన్‌ఎస్‌ఏఐడీ రకం నొప్పిమందులను అనవసరంగా, తరచుగా, దీర్ఘకాలంగా, పెద్దమొత్తంలో వాడితే కిడ్నీలకు హానికరంగా పరిణమిస్తుంది.
6. మద్యం: అతిగా మద్యం తాగితే కిడ్నీల్లో యూరిక్‌ ఆమ్లం పోగుపడుతుంది. దీంతో నెఫ్రాన్‌లోని వడపోత మార్గాల్లో అడ్డంకి తలెత్తి కిడ్నీ వైఫల్యం, కిడ్నీజబ్బులకు దారితీస్తుంది.

వీటిని విస్మరించొద్దు
* రాత్రిపూట ఎక్కువసార్లు మూత్రం రావటం
* మూత్రం పోస్తున్నప్పుడు నొప్పి, ఇబ్బంది
* మూత్రంలో రక్తం, సుద్ద పడటం
* పాదాలు, కాళ్ల వాపులు
* ముఖం ఉబ్బరించటం
* ఆకలి తగ్గటం
* ఆయాసం
* నిస్సత్తువ, రక్తహీనత
* వాంతి, వికారం
* ఎముకల నొప్పులు, బాధలు

నివారణే శ్రీరామరక్ష
కిడ్నీలు దెబ్బతిన్నాక బాధపడే కన్నా అలాంటి పరిస్థితి రాకుండా నివారించుకోవటమే ఉత్తమం.
* తగినంత నీరు తాగటం
* మధుమేహం, అధిక రక్తపోటు సమస్యలను నియంత్రణలో ఉంచుకోవటం
* రోజు మొత్తమ్మీద ఉప్పు 5-6 గ్రాములు (చెంచా) మించకుండా చూసుకోవటం
* బరువు అదుపులో ఉంచుకోవటం
* రోజూ కనీసం అరగంట సేపు వ్యాయామం చేయటం
* సిగరెట్లు, బీడీలు, చుట్టల వంటివి తాగకపోవటం
* కిడ్నీజబ్బు ముప్పు ఎక్కువగా గలవారు ఏడాదికోసరి పరీక్షలు చేయించుకోవటం


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని