logo

జగనన్న పన్నాగం.. పల్లెలకు పంగనామం..!

‘పల్లెల్లో అందరూ కలిసి ముందడుగు వేయండి. ఒకే మాటపై నిలబడండి. స్థానిక సంస్థల ఎన్నికలు ఏకగ్రీవం చేసుకుంటే ప్రోత్సాహక నిధులు మంజూరు చేస్తాం’ అని వైకాపా ప్రభుత్వం మూడేళ్ల కిందట పంచాయతీ ఎన్నికల సమయంలో ప్రకటించింది.

Updated : 27 Apr 2024 09:45 IST

 హామీని విస్మరించిన వైకాపా ప్రభుత్వం
ఏకగ్రీవ పంచాయతీ నిధులకు ఎదురుచూపులు

‘పల్లెల్లో అందరూ కలిసి ముందడుగు వేయండి. ఒకే మాటపై నిలబడండి. స్థానిక సంస్థల ఎన్నికలు ఏకగ్రీవం చేసుకుంటే ప్రోత్సాహక నిధులు మంజూరు చేస్తాం’ అని వైకాపా ప్రభుత్వం మూడేళ్ల కిందట పంచాయతీ ఎన్నికల సమయంలో ప్రకటించింది. వాటితో మీ గ్రామాలను అభివృద్ధి చేసుకోవచ్చునని సీఎం జగన్‌ పల్లెవాసులను నమ్మించారు. దీంతో పోటాపోటీగా జరగాల్సిన ప్రథమ పౌరుడి ఎన్నిక చాలా చోట్ల ఏకగ్రీవమైంది. అనంతరం ఇచ్చిన హామీని విస్మరించారు. కాలం కరిగిపోతున్నా.. పోరుబాట పట్టినా పైసా విదల్చ లేదు. ఏరు దాటిన తరువాత తెప్ప తగలేసిన చందాన వ్యవహరించి ఆ పంచాయతీల ప్రగతికి గ్రహణం పట్టించారు.

 న్యూస్‌టుడే, శ్రీకాకుళం నగరం, గార, కంచిలి గ్రామీణ, కవిటి గ్రామీణం, మందస, బూర్జ, జి.సిగడాం, కొత్తూరు, పాతపట్నం, లావేరు, పలాస గ్రామీణం


రెండేళ్ల నుంచి ఇంతే..

కవిటి మండలం భైరిపురం గ్రామానికి ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవడంతో రెండేళ్ల నుంచి ఈ బోరుకు సైతం మరమ్మతులు చేసుకోలేకపోతున్నారు. ప్రోత్సాహక నిధులు వస్తే సీసీ కాలువలు ఏర్పాటు చేసుకోవచ్చునని అంతా తీర్మానించుకున్నప్పటికీ.. ప్రభుత్వం నిర్వాకంతో అది సాధ్యపడలేదు.

కలెక్టర్‌తో మొరపెట్టుకున్నా..

కాలువలు, రహదారికి నోచుకోని కొర్ని పంచాయతీలోని యాతపేట

గార మండలం కొర్ని, పూసర్లపాడు పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. ఆ రెండింటికీ రూ.5 లక్షలు చొప్పున ప్రోత్సాహక నిధులు రావాల్సి ఉంది. అవి వస్తే గ్రామాల్లో రహదారులు, తాగునీటి సదుపాయం, విద్యుద్దీకరణ వంటి పనులు చేపట్టవచ్చని ఆశించినప్పటికీ ఫలితం లేకుండాపోయింది. ఈ సమస్యను సర్పంచులు పీస గోవిందరాజులు, అరవల కల్పన గతేడాది అక్టోబరు 18న జరిగిన జిల్లా స్థాయి ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమంలో అప్పటి కలెక్టర్‌ శ్రీకేష్‌ బి.లఠ్కర్‌ దృష్టికి తీసుకువెళ్లారు. అయినప్పటికీ ప్రభుత్వం ఇంతవరకు ఒక్క రూపాయి ఇవ్వలేదు.

 న్యూస్‌టుడే, గార


8 పంచాయతీలపై చిన్నచూపు

కొత్తూరు: రాళ్లుతేలిన గొట్టిపల్లి- పెద్దరాజపురం రహదారి

కొత్తూరు మండలం అడ్డంగి, గొట్టిపల్లి, అల్తి, రాయల, కౌసల్యాపురం, సోమరాజపురం, ఇరపాడుగూడ, ఎంజేపురం పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. ఇప్పటి వరకు వాటిల్లో ఒక్కదానికి కూడా నిధులు మంజూరు కాలేదు. అవి వస్తే పారిశుద్ధ్యం, తాగునీటి సదుపాయం, అంతర్గత రహదారులను మెరుగుపరుచుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినా ప్రభుత్వం డబ్బులివ్వకపోవడంతో ప్రజల కష్టాలు తీరలేదు. ఇది అన్యాయమంటూ సర్పంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వ్యవస్థ నిర్వీర్యం.. మౌలిక వసతులు దూరం

వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గ్రామ సచివాలయ వ్యవస్థను ప్రవేశపెట్టింది. నిధులు కేటాయించకుండా.. సర్పంచులకు అధికారాల్లేకుండా చేసి పంచాయతీలను పూర్తిగా నిర్వీర్యం చేసింది. గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి నోచుకోవట్లేదు. జిల్లాలోని అనేక పల్లెలు సీసీ కాలువలు, రహదారులు ఇతర కనీస మౌలిక వసతులు కల్పనకు దూరమయ్యాయి. చాలా చోట్ల కనీసం వీధి దీపాల మరమ్మతులు కూడా చేసుకోలేని దుస్థితి నెలకొంది. సురక్షిత తాగునీరందేందుకు సైతం ఆస్కారం లేక ప్రజలు రోగాల బారిన పడుతున్నారు.

పైసల్లేక.. పాలకులు పట్టించుకోక

పాతపట్నం మండలంలో ఏకగ్రీవ పంచాయతీ సీతారాంపల్లిలో కాలువల్లేక పోవడంతో మురుగునీరు రహదారిపై నిలిచిపోతుంది. పంచాయతీలో నిధుల్లేకపోవడం, పాలకులు పట్టించుకోకపోవడంతో ఇటీవల స్థానిక యువకులే రహదారిపై మురుగును ఇలా తొలగించుకున్నారు. ఇదే మండలంలో సరాళి, దశరథపురం, చాకిపల్లి పంచాయతీలకు నిధుల మంజూరుకాకపోవడంతో వివిధ సమస్యలతో ఆయా గ్రామస్థులు ఇబ్బందులు పడుతున్నారు.

ఇచ్చినట్లే ఇచ్చి.. లాగేసుకుని..

పంచాయతీ ఎన్నికల్లో తమ మద్దతుదారులకే జనం పట్టం కట్టారని గొప్పలు చెప్పుకొనేందుకు వైకాపా ప్రభుత్వం అప్పట్లో ఎత్తులు వేసింది. అందులో భాగంగా మాయ మాటలు చెప్పి చాలా పంచాయతీలను ఏకగ్రీవం చేసుకుంది. సాధారణంగా ఎన్నికలు జరిగిన వెంటనే వాటికి ప్రోత్సాహకం నిధులు మంజూరు చేయాలి. నిధుల్లేమి కారణంగా వైకాపా ప్రభుత్వం అలా చేయలేదు. 2022 జనవరిలో కొంత సర్దుబాటు చేసింది. నెల తిరగకముందే వాటిని పంచాయతీ ఖాతాల నుంచి లాగేసుకుంది. ఇప్పటి వరకు మళ్లీ వాటి ఊసెత్తలేదు. స్థానిక సర్పంచులు సమస్యను అధికారులు, పాలకుల దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేకుండాపోయింది.

పార్టీ రహితంగా జరిగే పంచాయతీ ఎన్నికల్లో పాలకమండలిని ఏకగ్రీవంగా ఎన్నుకుంటే ప్రభుత్వం తరఫున ప్రోత్సాహకాలిస్తామని 2021లో జరిగిన ఎన్నికల సమయంలో వైకాపా ప్రభుత్వం ప్రకటించింది. అప్పటికి ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో 1,190 పంచాయతీలు ఉండేవి. జగన్‌ సర్కారు మాటలు నమ్మి 137 పంచాయతీల ప్రజలు ఏకతాటిపైకి వచ్చి.. ఏకగ్రీవంగా సర్పంచితో పాలక మండలిని ఎన్నుకున్నారు. అనంతరం జిల్లా పునర్విభజన జరిగి కొన్ని పంచాయతీలు పొరుగు జిల్లాలోకి వెళ్లిపోయాయి. జిల్లాలో మిగిలిన వాటిల్లో కొన్నింటికి మాత్రమే ప్రోత్సాహకం అందించింది. ఇంకా 52 పంచాయతీలకు రూ.5 లక్షల చొప్పున నిధులు మంజూరు చేయకుండా ప్రభుత్వం చేతులెత్తేసింది.


కుంటుపడిన అభివృద్ధి

మా పంచాయతీలో తిష్ఠ వేసి ఒక్క సమస్యకు కూడా ఈ అయిదేళ్లలో పరిష్కారానికి నోచుకోలేదు. ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా రాలేదు. ఏకగ్రీవ పంచాయతీ కావడంతో ఆ డబ్బులు వస్తాయనుకుంటే అవీ ఇవ్వలేదు. ఫలితంగా గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడింది.

 మన్మథరావు, కేసరిపడ, కంచిలి మండలం


ఎలాంటి మార్పులేదు

ప్రోత్సాహక నిధులు విడుదలైతే గ్రామంలో శ్మశానవాటిక, తాగునీటి కోనేరుకు వెళ్లే రహదారులతో పాటు మురుగు కాలువల నిర్మాణం చేపట్టాలని అనుకున్నాం. తాగునీటి సమస్యకు పరిష్కారం దొరుకుతుందని భావించాం. పైసా ఇవ్వకుండా వదిలేశారు. అయిదేళ్ల ముందు ఎలా ఉందో.. మా ఊరు ఇప్పటికీ అలాగే ఉంది. ఎలాంటి మార్పులేదు.

అంపిలి గణపతిరావు, గ్రామస్థుడు, తుడ్డలి, బూర్జ మండలం

  •  పలాస మండలం మాకన్నపల్లి, మామిడిమెట్టు, నీలావతి, అమలకుడియా పంచాయతీలు ప్రోత్సాహక నిధులకు నోచుకోలేదు. ఆయా చోట్ల సీసీ రహదారులు, కాలువ నిర్మించలేకపోయారు. నిధుల కోసం అధికారులు చుట్టూ ఎన్నోసార్లు తిరిగినా ఫలితం లేదని సర్పంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
  •  జి.సిగడాం మండలం        సంతవురిటి, కొత్తపేట, ఎస్‌.పి.ఆర్‌.పురం, కప్పరాం పంచాయతీలకు ఇంతవరకు ప్రోత్సాహకాలు అందలేదు. ఆయా గ్రామాలను పారిశుద్ధ్య లోపంతో పాటు రహదారుల సమస్యలు వెంటాడుతున్నాయి.
  •  మందస మండలం  సిరిపురం పంచాయతీ ఎన్నిక ఏకగ్రీవమైంది. మూడేళ్ల నుంచి గ్రామస్థులు ప్రభుత్వం ప్రకటించిన రూ.5 లక్షల కోసం నిరీక్షిస్తున్నారు. అవి రాకపోవడంతో కనీసం కాలువలు శుభ్రం చేసుకోలేని పరిస్థితి నెలకొంది.

నిధులు రాని ఏకగ్రీవ పంచాయతీలు: 52
రావాల్సిన మొత్తం: రూ. 2.60 కోట్లు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని