పాములతో ఆట.. బల్లులతో పాట!

హాయ్‌ నేస్తాలూ.. మీరు పెట్‌ కెఫెల గురించి వినే ఉంటారు కదా.. అదేనండీ.. కుక్కలు, పిల్లులలాంటి పెంపుడు జంతువులతో సహా వెళ్లేందుకు అనువైనవన్నమాట. అలాంటివి పెద్ద పెద్ద నగరాల్లోనే ఎక్కువగా కనిపిస్తుంటాయి.

Published : 09 Mar 2023 00:14 IST

హాయ్‌ నేస్తాలూ.. మీరు పెట్‌ కెఫెల గురించి వినే ఉంటారు కదా.. అదేనండీ.. కుక్కలు, పిల్లులలాంటి పెంపుడు జంతువులతో సహా వెళ్లేందుకు అనువైనవన్నమాట. అలాంటివి పెద్ద పెద్ద నగరాల్లోనే ఎక్కువగా కనిపిస్తుంటాయి. కానీ.. ‘రెప్టైల్స్‌ కెఫె’ గురించి ఎప్పుడైనా విన్నారా.. మన దగ్గర అటువంటివి లేవు కాబట్టి దాదాపు విని ఉండరు. అయితే, చకచకా ఇది చదివేయండి మరి..

లేషియాలోని యప్‌ మింగ్‌ యాంగ్‌ అనే అంకుల్‌ ఇటీవల మొట్టమొదటి ‘రెప్టైల్‌ కెఫె’ను ప్రారంభించారు. అంటే.. అక్కడి గాజు సీసాల్లో పాములు, బల్లులు, ఊసరవెల్లులు ఉంటాయన్నమాట. జంతు ప్రేమికులు ఎంచక్కా వాటితో ఆడుకుంటూ, ఈ కెఫెలో ఇష్టమైన ఆహారాన్ని తినొచ్చు.

వాటినీ ఆదరించాలని..

ఈ సరీసృపాల కెఫె.. అదేనండీ.. ‘రెప్టైల్‌ కెఫె’ కౌలాలంపూర్‌లో ఉంది. చాలామంది తమ ఇళ్లలో పిల్లులు, కుక్కలు, చిలుకలను పెంచుకుంటుంటారు. కానీ, పాములు, బల్లుల జాతికి చెందిన జీవులను ఎవ్వరూ పట్టించుకోరు. అవంటే చాలామందికి భయం కూడా. ఇంకొందరు వాటిని చూడగానే అసహ్యించుకుంటారు. దాంతో ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌లో డిగ్రీ చదివి, రెప్టైల్స్‌ సొసైటీలో సభ్యుడిగా ఉన్న యాంగ్‌ అంకుల్‌కు ఓ సరికొత్త ఆలోచన వచ్చింది. ఇతర పెంపుడు జంతువుల్లాగానే రెప్టైల్స్‌ థీమ్‌తో ఓ కెఫెను ప్రారంభించాలని అనుకున్నాడు. కొందరు స్నేహితులతో కలిసి నగర శివారు ప్రాంతంలో ఈ కెఫెను అందుబాటులోకి తీసుకొచ్చాడు. అక్కడ పదుల సంఖ్యలో గాజు సీసాలను అమర్చి.. వాటిలో పాములు, బల్లులు, ఊసరవెల్లులను ఉంచాడు. ఈ జీవులనూ మిగతా వాటితో సమానంగా చూడాలనీ, అవీ పెంపుడు జంతువులేనని అందరికీ చెప్పదలుచుకున్నాడా అంకుల్‌.

పిల్లలకు సరదా..

సాధారణంగా సరీసృపాలంటే పిల్లలు చాలా భయపడతారు. కానీ, ఈ కెఫెకు మాత్రం చిన్నారులు వరస కడుతున్నారట. తల్లిదండ్రులతో కలిసి వచ్చి.. ఇక్కడి పాములు, బల్లులతో ఎటువంటి భయం లేకుండా ఆడుకుంటున్నారట. ఇతర ప్రాంతాల్లో ఇలాంటివి నెలకొల్పాలనే ఆసక్తి ఉన్న వారికి ఫ్రాంఛైజీ ఏర్పాటు చేసే అవకాశం కూడా ఇస్తున్నాడీ అంకుల్‌. ఇదొక్కటే కాదు నేస్తాలూ.. ప్రపంచంలో ఇలాంటి వింత కెఫెలు చాలానే ఉన్నాయి. జపాన్‌లో హారర్‌ థీమ్డ్‌ రెస్టరంట్‌ ఒకటుంది. ఇందులో అసలు లైట్లే ఉండవట. కేవలం కొవ్వొత్తుల వెలుగులోనే ఆహారం తినాలి. గోడలు కూడా రక్తంలో ముంచి తీసినట్లు ఉంటాయి. అంతేకాదు.. ఇక్కడ మనకు వడ్డించేవారు రాక్షసుల వేషధారణలో ఉంటారట. నేస్తాలూ.. ఈ కెఫెలను తలుచుకుంటుంటేనే వణుకు పుడుతోంది కదూ..!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని