ధైర్యే.... సాహసే... రోలర్‌కోస్టర్‌!

ఒక్కసారిగాపైకి తీసుకెళుతుంది...వెంటనే కింద పడేస్తుంది...కళ్లు గిర్రున తిరిగేలా చేస్తుంది...ఏంటీ ఇదంతా అనుకుంటున్నారా? ఓ రైడ్ సంగతులు!

Published : 17 Jan 2016 11:13 IST

ధైర్యే.... సాహసే... రోలర్‌కోస్టర్‌!

ఒక్కసారిగాపైకి తీసుకెళుతుంది...వెంటనే కింద పడేస్తుంది...కళ్లు గిర్రున తిరిగేలా చేస్తుంది...ఏంటీ ఇదంతా అనుకుంటున్నారా? ఓ రైడ్‌ సంగతులు!
   రోలర్‌ కోస్టర్‌లు మీకు బాగా తెలుసు. కానీ ఇన్వర్టెడ్‌ రోలర్‌ కోస్టర్‌ తెలుసా? వంపులతో ప్రత్యేకంగా ఉంటుంది. వీటిల్లో ప్రపంచంలోనే ఎత్తయినది, వేగవంతమైనది ఎక్కాలంటే అమెరికా వెళ్లాలి. అక్కడి ఒహియో రాష్ట్రం సండస్కీ నగరంలో ఉన్న సెడార్‌ పాయింట్‌ అనే అమ్యూజ్‌మెంట్‌ పార్కులో ఉందిది.

* ఈ రైడ్‌ పేరు ఖవిక్డ్‌ ట్విస్టర్‌’ ప్రపంచంలోనే అతి భయంకరమైన రైడ్‌లో ఒకటిగా పేరు పొందింది. ఎందుకంటే ఇది అన్ని రోలర్‌ కోస్టర్‌లలా మామూలుగా ఉండదు. మెలికలు తిరిగిన పాములా భలేగా ఉంటుంది.

* 32 మంది కూర్చోవడానికి సీట్లు ఉంటాయి. అందరూ కూర్చోగానే రైడ్‌ మొదలవుతుంది. మొదట ఒక వైపు పై వరకూ వెళతారు. పైగా గొట్టాలు కూడా మెలికలు తిరిగి ఉండడంతో గిర్రున తిరుగుతూ ప్రయాణం సాగుతుంటుంది. పైకెళ్లగానే అంతకన్నా వేగంగా కిందకు దూసుకొస్తూ మరో వైపు పై వరకు 90 డిగ్రీల కోణంలో మెలికలు తిరుగుతూ రైడర్లు దూసుకుపోతారు.

* అలా గంటకు 116 కిలోమీటర్ల వేగంతో రెండు వైపులా 300 అడుగుల ఎత్తు వరకు వెళతారు. కేవలం నిమిషం లోపే అటూ ఇటూ రెండుమూడు సార్లు వేగంగా జారిపోవడం భలే తమాషాగా అనిపిస్తుంది. కాకపోతే ఎంతో గుండె ధైర్యం ఉన్నవాళ్లు మాత్రమే ఇది ఎక్కగలరు.

 * పైకి వెళ్లినపుడు చుట్టూ నగరం, పక్కనే ఉన్న సరస్సు ఎంతో అందంగా కనిపిస్తాయి.

* గంటలో 1000 మంది ఈ రైడ్‌లో ఎక్కుతుంటారట. ఈ అమ్యూజ్‌మెంట్‌ పార్కులో బోలెడు రైడ్లున్నా అన్నింటిలోకీ ఇదే ప్రత్యేక ఆకర్షణ. 2003లో ప్రారంభించారు. అయితే ఇప్పటికీ ఖటాలెస్ట్‌, ఫాస్టెస్ట్‌ ఇన్వర్టెడ్‌ రోలర్‌ కోస్టర్‌’గా దీనిదే రికార్డు కొనసాగుతోంది.

* ఈ వింతైన కోస్టర్‌ నిర్మాణానికి రూ. 60 కోట్లకుపైనే వెచ్చించారు. ఏటా దీన్ని లక్షలాది మంది ఎక్కుతుంటారు.

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని