Faf du Plessis: అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్‌

Faf du Plessis: విజయంతోనే జట్టులో విశ్వాసం వస్తుందన్నాడు బెంగళూరు సారథి ఫాఫ్‌ డుప్లెసిస్‌. తమ జట్టులో విరాట్‌ కోహ్లీ టాప్‌ స్కోరర్‌గా ఉండటం ఆనందంగా ఉందన్నాడు.

Updated : 26 Apr 2024 14:42 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వరుసగా ఆరు ఓటములతో సతమతమైన బెంగళూరుకు ఎట్టకేలకు విజయం లభించింది. సరిగ్గా నెల తర్వాత బెంగళూరుకు రెండో గెలుపు కావడం గమనార్హం. మార్చి 25న పంజాబ్‌పై ఆర్సీబీ గెలిచింది. తాజాగా హైదరాబాద్‌ను (ఏప్రిల్ 25) వారి సొంతగడ్డపై 35 పరుగుల తేడాతో ఓడించింది. దీంతో టోర్నీ నుంచి ఇంటిబాట పట్టే ప్రమాదం నుంచి ఆ జట్టుకు కాస్త ఉపశమనం లభించింది. మ్యాచ్‌ అనంతరం బెంగళూరు కెప్టెన్‌ ఫాఫ్‌ డుప్లెసిస్‌ (Faf du Plessis) దీనిపై మాట్లాడుతూ.. విజయమే జట్టులో విశ్వాసం నింపగలదని అన్నాడు.

‘‘అంతకుముందు రెండు మ్యాచ్‌ల్లోనూ మేం గొప్పగా పోరాడాం. హైదరాబాద్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో లక్ష్యం 270కి పైగా ఉంటే 260 పరుగులు చేశాం. ఇక కోల్‌కతాతో కేవలం ఒక్క పరుగు తేడాతో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఆ రెండు మ్యాచ్‌ల్లో మేం విజయానికి దగ్గరగా వచ్చాం. కానీ, జట్టులో విశ్వాసం నిండాలంటే మాత్రం గెలవాల్సిందే..! మాటలతో ఎవరిలోనూ విశ్వాసం పెంచలేం. కేవలం మనమిచ్చే ప్రదర్శనే మనలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది’’ అని డుప్లెసిస్‌ తెలిపాడు.

ప్రతి మ్యాచ్‌లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్‌

తమ జట్టులో విరాట్‌ కోహ్లీ (Virat Kohli) టాప్‌ స్కోరర్‌గా ఉన్నాడని, ఇతర ఆటగాళ్లు కూడా ఇప్పుడు తిరిగి ఫామ్‌లోకి వస్తున్నారని అన్నాడు. ‘‘పోటీ చాలా తీవ్రంగా ఉంది. ఇతర జట్లు చాలా బలంగా ఉన్నాయి. అలాంటప్పుడు మనం 100శాతం ప్రదర్శన ఇవ్వకపోతే బాధపడాల్సి వస్తుంది. టోర్నీ తొలి అర్ధభాగంలో మా జట్టులో విరాట్‌ ఒక్కడే పరుగులు చేశాడు. ఇప్పుడు మిగతా వాళ్లూ రాణిస్తున్నారు. గ్రీన్‌ ఫామ్‌లోకి రావడం జట్టుకు అదనపు బలం’’ అని బెంగళూరు కెప్టెన్‌ చెప్పాడు.

తాజా ఐపీఎల్‌ టోర్నీలో బెంగళూరు తరఫున అత్యధిక పరుగులు చేసిన కోహ్లీ.. ఆరెంజ్‌ క్యాప్‌ రేసులో ఉన్నాడు. గత మ్యాచ్‌లో అర్ధశతకం చేయగా.. ఈ సీజన్‌లో 400 పరుగుల మార్క్‌ దాటేశాడు. ఐపీఎల్‌ కెరీర్‌లో విరాట్‌ ఈ మార్క్‌ దాటడం ఇది పదోసారి కావడం విశేషం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని