ICICI Credit Cards: 17 వేల ఐసీఐసీఐ క్రెడిట్‌ కార్డులు బ్లాక్‌.. కారణమిదే!

ICICI Credit Cards: కొత్తగా జారీ చేసిన దాదాపు 17 వేల క్రెడిట్‌ కార్డుల వివరాలు పొరపాటున ఇతరుల ఖాతాలకు అనుసంధానమైనట్లు ఐసీఐసీఐ బ్యాంక్‌ తెలిపింది.

Updated : 26 Apr 2024 11:21 IST

ICICI Credit Cards | బెంగళూరు: సాంకేతికత లోపం వల్ల దాదాపు 17 వేల క్రెడిట్‌ కార్డులు ప్రభావితమైనట్లు ఐసీఐసీఐ బ్యాంక్‌ (ICICI Bank) గురువారం అంగీకరించింది. ఈ కార్డులు డిజిటల్‌ మాధ్యమాల్లో పొరపాటున ఇతరుల ఖాతాలకు అనుసంధానమైనట్లు తెలిపింది. అయితే, దీన్ని వెంటనే సవరించినట్లు బ్యాంకు తెలిపింది. అలాగే ఇప్పటి వరకు డేటాను దుర్వినియోగపర్చినట్లు తమకు సమాచారం అందలేదని తెలిపింది. ఎవరైనా ఆర్థికంగా నష్టపోతే.. పరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చింది.

అసలు ఏమైంది..

బ్యాంకు అధికార ప్రతినిధి తెలిపిన వివరాల ప్రకారం.. ఆన్‌లైన్‌లో చూసినప్పుడు ఇప్పటికే ఉన్న కస్టమర్ ఖాతాలకు కొత్త క్రెడిట్ కార్డ్‌లు (Credit Cards) తప్పుగా అనుసంధానమయ్యాయి. అంటే ఇప్పటికే ఉన్న కస్టమర్లు.. మరొకరి కోసం ఉద్దేశించిన కొత్త కార్డ్ వివరాలను చూడగలిగారు. ఆన్‌లైన్ బ్యాంకింగ్ పోర్టల్‌లోకి లాగిన్ అవ్వగానే.. తాము అసలు దరఖాస్తు చేయకున్నా.. కొత్త కార్డ్ వివరాలు కనిపించాయని పలువురు సోషల్ మీడియాలో వెల్లడించారు. బుధవారం సాయంత్రం నుంచే ఈ సమస్య సామాజిక మాధ్యమాల్లో వెలుగులోకి వచ్చింది. బ్యాంకు దీన్ని గురువారం ధ్రువీకరించింది.

ఓటీపీ ఉండగా..

తాజా పరిణామంలో క్రెడిట్‌ కార్డు (Credit Cards) పూర్తి సంఖ్య, సీవీవీ వంటి వివరాలు బహిర్గతమయ్యాయి. వీటిని దుర్వినియోగపర్చి మోసపూరిత లావాదేవీలు చేసే అవకాశం ఉంటుంది! అయితే, ఓటీపీ లేకుండా ట్రాన్సాక్షన్‌ చేయడం కుదరదని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా బహిర్గతమైన వివరాల ద్వారా ఎలాంటి మోసం జరిగి ఉండకపోవచ్చునని అంచనా వేస్తున్నారు.

పన్ను విధానం ఎంచుకుందామిలా...

కార్డులన్నీ బ్లాక్‌..

మరోవైపు ప్రభావితమైన కార్డులన్నింటినీ బ్లాక్‌ చేసినట్లు ఐసీఐసీఐ బ్యాంక్‌ (ICICI Bank) వెల్లడించింది. కొత్తవారికి మరోసారి కార్డులు జారీ చేస్తామని హామీ ఇచ్చింది. ఇప్పటి వరకు సమాచారం దుర్వినియోగమైన ఘటనలు తమ దృష్టికి రాలేదని తెలిపింది. కస్టమర్లు చింతించాల్సిన అవసరం లేదని.. ఎలాంటి నష్టం జరిగినా పరిహారం చెల్లించే బాధ్యత తమదేనని హామీ ఇచ్చింది.

ఆర్‌బీఐ ఆంక్షల తరుణంలో..

బ్యాంకుల డేటా సెక్యూరిటీ అంశాల్లో లోపాలపై ఆర్‌బీఐ కఠినంగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే కోటక్‌ మహీంద్రా బ్యాంకుపై ఆంక్షలు విధించింది. కొత్త కస్టమర్ల చేరికలు, క్రెడిట్‌ కార్డుల జారీని నిలిపివేయాలని ఆదేశించింది. ఈ తరుణంలో ఐసీఐసీఐ ఉదంతం వెలుగులోకి రావడం చర్చనీయాంశంగా మారింది. అయితే, సదరు బ్యాంకు మాత్రం ఈ ఆందోళనలను కొట్టిపారేసింది. తాము జారీ చేసిన మొత్తం కార్డుల్లో తాజాగా ప్రభావితమైన వాటి వాటా కేవలం 0.1 శాతం మాత్రమేనని తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని