చందమామ తమ్ముడంట! అల్లరి పిల్లాడంట!!

‘చందమామ రావే... జాబిల్లి రావే పాట తెలుసుగా? అయితే ఈ సారి ‘చందమామ రావే... అతడి తమ్ముడు రావే’ అని పాడండి... ఎందుకంటే మన చందమామకొక తమ్ముడున్నాడని కొత్తగా తెలిసింది! అంతరిక్ష పరిశోధకులు కనిపెట్టారు!

Published : 25 Jun 2016 01:10 IST

చందమామ తమ్ముడంట! అల్లరి పిల్లాడంట!!

‘చందమామ రావే... జాబిల్లి రావే పాట తెలుసుగా? అయితే ఈ సారి ‘చందమామ రావే... అతడి తమ్ముడు రావే’ అని పాడండి... ఎందుకంటే మన చందమామకొక తమ్ముడున్నాడని కొత్తగా తెలిసింది! అంతరిక్ష పరిశోధకులు కనిపెట్టారు!

‘మనకు చందమామలు ఎన్ని?’ అని అడిగితే, వెంటనే ‘ఒకటేగా?’ అంటారు. కానీ ఈసారి ఎవరైనా ఇదే ప్రశ్న అడిగితే ‘రెండు’ అని చెప్పేయండి. ఎందుకంటే మనం చూసే చంద్రుడితో పాటు మరో బుల్లి జాబిల్లి కూడా ఉన్నాడట. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) వాళ్లు దీన్ని కనిపెట్టారు.

అలాగని బయటకి పరిగెట్టి ఆకాశంలోకి చూసేయకండి. మన కంటికి కనిపించడు. అంటే టెలిస్కోపుతో కానీ చూడలేని బుల్లి జాబిల్లి అన్నమాట.

*ఈ బుల్లి చందమామకి ‘2016 Ho3’ అని పేరు పెట్టారు. ఈ ఏడాది కనిపెట్టారనే ఆపేరు.

* నిజానికి ఇదో పెద్ద బండరాయిలాంటి గ్రహ శకలం. ఇప్పుడంటే కనిపెట్టారు కానీ ఇతగాడు దాదాపు వంద ఏళ్ల నుంచి భూమి చుట్టూ తిరుగుతూ, భూమితో పాటే సూర్యుని చుట్టూ తిరుగుతున్నాడని తేలింది. అందుకనే పాక్షిక గ్రహం అంటున్నారు. ఎవరైతేనేం మన చందమామకు తోడుగా తిరుగుతున్నాడన్నమాటేగా?

* అన్నట్టు... ఈ బుల్లి జాబిల్లి అల్లరి పిల్లాడు కూడా. చిన్న పిల్లలు కుదురుగా ఉండనట్టే, ఇతడు కూడా ఓసారి భూమికి దగ్గరగాను, మరోసారి భూమికి చాలా దూరంగాను తిరుగుతున్నాడు.

* భూమి నుంచి చంద్రుడు సుమారు 3,84,400 కిలోమీటర్ల దూరంలో ఉంటాడు. ఈ కొత్త చందమామ భూమికి దగ్గరగా ఉన్నప్పుడు మన చంద్రుడు ఉన్న దూరం కన్నా 38 రెట్లు ఎక్కువ దూరంలో తిరిగితే, దూరంగా ఉన్నపుడు చంద్రుడి కన్నా 100 రెట్లు ఎక్కువ దూరంలో తిరుగుతుంటాడు.

* 2003లో YN17అనే ఇలాంటి గ్రహ శకలాన్ని ఇది వరకే శాస్త్రవేత్తలు గుర్తించారు. కానీ పదేళ్లపాటే భూమి చుట్టూ తిరిగి ఆపై ఎటో పోయిందట అది.

మీకు తెలుసా?
* ఎక్కువ చందమామలున్న గ్రహం జ్యూపిటర్‌. దీనిచుట్టూ ఏకంగా 66 చందమామలు తిరుగుతూ ఉంటాయి. వీటిలో అతి పెద్దది గనిమేడ్‌.
* అన్ని గ్రహాల చందమామల సైజులు కొలిస్తే మన చంద్రుడు అయిదవ స్థానంలో ఉంటాడట.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని