Maldives: ముయిజ్జు పార్టీకి ‘సూపర్‌ మెజార్టీ’.. భారత్‌ స్పందనిదే...

ఇటీవల మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికలపై భారత్‌ స్పందించింది. ఎన్నికలు విజయవంతమైనందుకు అభినందనలు తెలిపింది.

Published : 26 Apr 2024 00:11 IST

దిల్లీ: ఇటీవల జరిగిన మాల్దీవుల (Maldives) పార్లమెంటరీ ఎన్నికల్లో అధ్యక్షుడు మహమ్మద్‌ ముయిజ్జుకు చెందిన పీపుల్స్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ (PNC) విజయం సాధించింది. ఆయనకు అగ్నిపరీక్షగా నిలిచిన ఈ ఎన్నికలను అటు చైనా, ఇటు భారత్‌లు నిశితంగా పరిశీలించాయి. ఈక్రమంలోనే ఎన్నికల ఫలితాలపై భారత్‌ స్పందించింది. ఇరుదేశాల మధ్య పార్లమెంటు స్థాయిలో అనేక సంప్రదింపులు కొనసాగుతున్నాయని.. కొత్త పార్లమెంటు (పీపుల్స్‌ మజ్లీస్‌)తోనూ ఇవి సజావుగా సాగగలవని ఆశిస్తున్నట్లు విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రణధీర్‌ జైశ్వాల్‌ తెలిపారు. ఇరుదేశాల మధ్య ఇటీవల దౌత్యపరమైన వివాదం చెలరేగిన విషయం తెలిసిందే.

చైనా అనుకూల పార్టీకి మాల్దీవుల్లో జైకొట్టారు

‘‘ఇటీవల జరిగిన పార్లమెంటరీ ఎన్నికలు విజయవంతమైనందుకు మాల్దీవులకు అభినందనలు. ఇరుదేశాల మధ్య సుదీర్ఘ, చారిత్రక సంబంధం ఉంది. ఆ దేశంతో కలిసి అనేక అభివృద్ధి సహకార కార్యక్రమాలు చేపడుతున్నాం. పార్లమెంటు స్థాయిలో సంప్రదింపులు జరుగుతున్నాయి. కొత్త పీపుల్స్‌ మజ్లిస్‌తోనూ అవి కొనసాగుతాయని భావిస్తున్నాం’’ అని మీడియా సమావేశంలో జైశ్వాల్‌ తెలిపారు. ఇదిలాఉండగా.. తాజా ఎన్నికల్లో గెలుపుతో ముయిజ్జు అనుసరిస్తున్న చైనా అనుకూల విధానానికి స్థానికంగా బలమైన మద్దతు లభించినట్లయింది. భారీ మెజార్టీ కారణంగా రాజ్యాంగాన్ని సవరించుకునే అధికారం కూడా ఆయనకు లభించింది.

‘అమెరికాలో నిరసనలను గమనిస్తున్నాం’

గాజాలో ఇజ్రాయెల్‌ దాడులను నిరసిస్తూ అమెరికాలోని కొలంబియా విశ్వవిద్యాలయంలో విద్యార్థులు పెద్దఎత్తున నిరసనలు చేపట్టారు. యేల్‌, న్యూయార్క్‌ యూనివర్సిటీ తదితర చోట్ల ప్రదర్శనలు జరిగాయి. ఈ పరిణామాలపై భారత్‌ స్పందించింది. ‘‘సంబంధిత ఘటనలను గమనిస్తున్నాం. ప్రతీ ప్రజాస్వామ్యంలో భావ ప్రకటన స్వేచ్ఛ, బాధ్యతాయుత వైఖరి, ప్రజాభద్రతకు మధ్య సరైన సమతుల్యత ఉండాలి. విదేశీ వ్యవహారాలపై ఏం చెబుతున్నామనే దానికంటే.. స్వదేశంలో ఏం చేస్తున్నామనే దాని ఆధారంగా మనల్ని అంచనా వేస్తారనే విషయం గుర్తుంచుకోవాలి’’ అని వ్యాఖ్యానించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని