చుక్‌చుక్‌ బండి వస్తోంది...దగ్గరకెళ్లి చూడండి!

పేద్ద పేద్ద పర్వతాలు... వంపులు తిరిగిన నదులు... లక్షలాది చెట్లు... వేలాది భవంతులు.... వాటి మధ్య నుంచి పరుగులు పెట్టే రైళ్లు... అన్నీ మన ముందు చిన్నవైపోతాయి... ఎక్కడో ఏంటో? తెలుసుకుంటే పోలా!

Published : 30 Jul 2016 01:41 IST

చుక్‌చుక్‌ బండి వస్తోంది...దగ్గరకెళ్లి చూడండి!

పేద్ద పేద్ద పర్వతాలు... వంపులు తిరిగిన నదులు... లక్షలాది చెట్లు...  వేలాది భవంతులు.... వాటి మధ్య నుంచి పరుగులు పెట్టే రైళ్లు... అన్నీ మన ముందు చిన్నవైపోతాయి... ఎక్కడో ఏంటో? తెలుసుకుంటే పోలా!


రైల్లో ప్రయాణం చేసే ఉంటారుగా. వెళుతుంటే దారిలో బోలెడు చెట్లు, కొండలు కనిపిస్తాయి. గుహల్లోకీ, వంతెనలపై నుంచీ కూ... చుక్‌ చుక్‌ మంటూ అది పరుగులు పెడుతుంది. మరి ఇవన్నీ రైలు లోపల్నించి కాదు... బయటే ఉండి చూడొచ్చు. ఎలా అంటే ప్రపంచంలోని అతి పెద్ద మినియేచర్‌ నమూనా రైల్‌రోడ్‌ ‘నార్త్‌లాండ్జ్‌’కి వెళితే.
* ఇది అమెరికాలోని న్యూజెర్సీ ఫ్లెమింగ్‌టన్‌లో ఉంది.
* ఒకవైపు ఒక రైలు, పేద్దలోయ మధ్యలో ఉన్న వంతెన మీద నుంచి పరుగులు పెడుతుంది. మరో వైపు, ఇంకో రైలు కొండ అంచుదారిలో వెళుతుంది. మరోటి నదిపై ఉన్న వంతెనపై ప్రయాణం చేస్తుంది. ఇలా ఒకటి కాదు రెండు కాదు వంద రైళ్లు రక రకాల మార్గాల్లో ప్రయాణం చేస్తుంటాయి. వీటితో పాటు అయిదు లక్షల చెట్లు, నాలుగు వేల భవనాలు, నాలుగు వందల వంతెనలు, రైల్వే సిగ్నళ్లు, ఇతర వాహనాలు ఇలా అన్నీ ఉంటాయి. కానీ వీటి ప్రత్యేకత... ఇవన్నీ చాలా చిన్నగా మన చేయంత పరిమాణంలో ఉంటాయంతే.
* బుల్లి బుల్లి రైళ్లే కదా అని తేలిగ్గా తీసిపారేయకండి. ఎందుకంటే ఇక్కడున్న రైళ్ల మార్గం అంతా కలిపితే దాదాపు అయిదు లక్షల అడుగుల పొడవుంటుందిట. ఈ రైళ్లన్నీ చక్కర్లు కొడుతుంటే అచ్చుగుద్దినట్టు అవి నిజమైన పరిసరాల్లో ప్రయాణం చేస్తున్నట్టే ఉంటాయి. నిజంగా రైళ్లు ప్రయాణించడానికి ఉపయోగించే సిగ్నలింగ్‌ ఏర్పాట్లలాంటివి వీటికీ ఉంటాయి.
* ఇదంతా కలిపితే మొత్తం 52 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. మొత్తం తిరిగి రావడానికి మూడు గంటల సమయం పడుతుందట.
* అడవులు, ఎడారులు, గ్రామాలు, పట్టణాలు, పార్కులు, బుల్లి బుల్లి మనుషుల బొమ్మలూ ఇలా అన్నీ ఆశ్చర్యపరిచేలా కనిపిస్తుంటాయి.
* ఈ బుల్లి రైలుప్రపంచ నిర్మాణాన్ని విలియమ్స్‌ జాక్కగ్నినో అనే ఆయన ఎప్పుడో 1972లో మొదలుపెట్టాడు. అంటే ఇప్పటికి 44 ఏళ్లయ్యిందన్నమాట.
* ఇక్కడికి రోజూ వందలాది మంది పర్యటకులు వస్తుంటారు. సూక్ష్మ రూపంలోని ఈ రైళ్లను, పరిసరాల్ని చూసి సంబర పడిపోతుంటారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని