వూరంతా బొమ్మలే! చూడ భలే వింతలే!!

బొమ్మలు ఎక్కడ వేస్తాం? పలకపైనో, కాగితంపైనో. కానీ ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఏకంగా ఇంటిగోడలపై వేశారు. అలా ఇలా కాదు. ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు. దీంతో ఏం జరిగిందో తెలుసా? ఆ వూరే ‘కాయ్‌ హుయ్‌ కాన్‌’గా మారిపోయింది.

Published : 28 Sep 2016 01:57 IST

వూరంతా బొమ్మలే! చూడ భలే వింతలే!!

కోపంగా చూసే యాంగ్రీ బర్డ్స్‌... అవతారాలెత్తే ట్రాన్స్‌ఫార్మర్లు... మనకెంతో నచ్చే డోరెమాన్‌... ఆకట్టుకునే పవర్‌ పగర్ల్స్‌... వీటన్నింటినీ ఒక వూళ్లొనే చూడొచ్చు!

బొమ్మలు ఎక్కడ వేస్తాం? పలకపైనో, కాగితంపైనో. కానీ ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఏకంగా ఇంటిగోడలపై వేశారు. అలా ఇలా కాదు. ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు. దీంతో ఏం జరిగిందో తెలుసా? ఆ వూరే ‘కాయ్‌ హుయ్‌ కాన్‌’గా మారిపోయింది. అంటే ఏంటో అనుకుంటున్నారా? ఇక్కడి భాషలో ‘పెయింటెడ్‌ విలేజ్‌’ అన్నమాట. మరి ఈ వూరు అలా ఎలా మారింది అంటే వివరాలు చదివేయాల్సిందే.

* ఇదంతా తైవాన్‌లోని హూజా అనే వూరి సంగతి. ఏదో మారుమూలన ఉన్న ఈ గ్రామం ఇప్పుడు పేరు ప్రఖ్యాతులు తెచ్చేసుకుంది. పర్యటకుల సందడితో కళకళలాడిపోతోంది.

* ఈ గ్రామంలో అడుగుపెట్టగానే త్రీడీ సినిమాల్లో ఎంతగానో ఆకట్టుకున్న స్పాంజ్‌బాబ్‌ ఎదురవుతాడు. నడుస్తున్న కొద్దీ డోరెమాన్‌, నవ్వించే టోటోరో, మనకెంతో సుపరిచితమైన మిక్కీమౌస్‌, బగ్స్‌ బన్నీ, పండ్ల కార్టూన్లు, సరదాల మినియన్స్‌, రకరకాల జంతువుల చిత్రాలు ఇలా ఒక్కటేంటీ వూరంతా వందలాది కార్టూన్‌ పాత్రలే.

* ఇంటి బయటా లోపలా, గోడలపై ఇలా ఎక్కడ చూసినా కార్టూన్‌ హీరోలే దర్శనమిస్తారు. అంతేకాదు గుడీ, బడీ ఇలా ఎక్కడైనా ఇవే కనిపిస్తాయి.

* కార్టూన్‌ పాత్రలతో పాటు జపాన్‌ సంప్రదాయం ప్రకారం అదృష్ట చిహ్నంగా భావించే ‘డరుమా బొమ్మల’ చిత్రాల్ని కూడా వేసుకున్నారు.

* ఇంతకీ ఈ విచిత్ర వూరు నిండా చిత్రాలు ఎలా వచ్చాయి అంటే? 2014లో అంటే రెండేళ్ల క్రితం ఈ వూరులోని తమ అమ్మమ్మని చూడ్డానికి వచ్చిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఖాళీ సమయంలో ఏదైనా చేయాలనుకున్నారు. ఇంటి నిండా రంగురంగులతో నచ్చిన కార్టూన్‌ పాత్రల బొమ్మలు గీయడం మొదలుపెట్టారు. ఇవి అందరికీ విపరీతంగా నచ్చడంతో మిగతా గ్రామస్థులు కూడా అలా రకరకాల బొమ్మలతో ఇంటి గోడల్ని అలంకరించడం ఆరంభించారు. నెమ్మదిగా ఇక్కడి కళాకారులు బృందాలుగా ఏర్పడి వూరంతా వర్ణచిత్రాల్ని వేశారు. సన్నివేశాలతో వేసిన ఈ బొమ్మల్ని చూస్తే నిజంగానే కార్టూన్‌ పాత్రలు ఇక్కడికి చేరాయా అన్నట్లు కనువిందుచేస్తాయి.

* చేయి తిరిగిన కళాకారులతో పాటు, స్కూల్‌ విద్యార్థులు వచ్చి చిత్రాలు వేస్తూ అందర్నీ ఆకట్టుకుంటున్నారు.

* కార్టూన్‌ బొమ్మలతో నిండిన ఈ వూరును చూడ్డానికి ఇప్పుడు ఎక్కడెక్కడి నుంచో సందర్శకులు వస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని