Puri Musings: యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్‌

మనిషి ఆలోచనల వల్లే యుద్ధాలు జరుగుతాయని పూరి జగన్నాథ్‌ అన్నారు. ‘పూరి మ్యూజింగ్స్‌’లో మరో ఆసక్తికర వీడియోను పంచుకున్నారు.

Published : 26 Apr 2024 18:48 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పక్కవారిని ఎప్పుడూ ప్రేమగా పలకరించాలని దర్శకుడు పూరి జగన్నాథ్‌ అన్నారు. ఆయన సినిమాల కోసం ప్రేక్షకులు ఎంతగా ఎదురుచూస్తున్నారో.. ‘పూరి మ్యూజింగ్స్‌’ (Puri Musings) పేరుతో ఆయన విడుదల చేసే వీడియోల కోసం నెటిజన్లు అంతకు రెట్టింపుగా వేచి చూస్తున్నారు. తాజాగా మరో ఆసక్తికర అంశంతో పలకరించారు పూరి. ‘భూమిపై శాంతి’ అనే పేరుతో ఒక వీడియోను పంచుకున్నారు.

‘ప్రపంచంలోని అన్ని దేశాలు ఆయుధాల ఉత్పత్తిని ఆపేయాలని, న్యూక్లియర్‌ బాంబులు తయారుచేయడం నిలిపివేయాలని 1965లోనే ఒక మతపెద్ద తన స్పీచ్‌లో కోరారు. అప్పట్లో ఆయన స్పీచ్‌ బాగా వైరలైంది. 1985లో జిడ్డు కృష్ణమూర్తి ఇదే టాపిక్‌పై మాట్లాడారు. ఎన్నో వేల ఏళ్ల నుంచి శాంతి గురించే అన్ని మతాలు మాట్లాడాయి. కానీ, ఇప్పటివరకు జరిగిన ప్రతీ యుద్ధం మతాల వల్లే జరిగింది. ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. మనిషి కూడా ఎప్పుడూ సంఘర్షణలోనే జీవిస్తున్నాడు. పక్కింటి వాళ్లతో, కుటుంబంతో, సమాజంతో.. ఆఖరికి తనతో తానే ఎప్పుడూ గొడవ పడుతుంటాడు. మళ్లీ అదే మనిషి తన కుటుంబం, తన భాష, దేశం కోసం యుద్ధాలు చేస్తాడు’.

‘దేశాల మధ్య, రెండు గ్రూపుల మధ్య ఎప్పుడూ గొడవలు జరుగుతూనే ఉన్నాయి. యుద్ధం లేకుండా మనకు శాంతి లేదు. వాటిని ఆపాలంటే ముందు మనమధ్య జరిగే చిన్న చిన్న గొడవలను ఆపేయాలి. ఒకరిని ఒకరు అసహ్యించుకోవడం తగ్గించాలి. ఒక ఊర్లో ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రారంభమైన గొడవ వల్ల ఒక తరం తర్వాత ఆ ఊరు రెండు ముక్కలు అవ్వొచ్చు. ఇంకో తరం తర్వాత రెండు జాతులుగా మారొచ్చు. ఇలా తరతరాలు పెరిగి అది ప్రపంచ యుద్ధానికి కూడా కారణం కావొచ్చు. ఒక చిన్న తగాదా వైరస్‌లా వ్యాపించి వెయ్యేళ్లు కొనసాగుతుంది. అందుకే దేన్నైనా ఆపాలి అనుకుంటే.. ప్రారంభంలోనే ఫుల్‌స్టాప్‌ పెట్టాలి. అలా ఆపగలిగితేనే భవిష్యత్తు బాగుంటుంది’.

‘మన మతాన్ని ప్రేమించడంతో పాటు ఎదుటి వాళ్ల మతాన్ని కూడా గౌరవించడం నేర్చుకోవాలి. ‘బాగున్నారా.. పిల్లలు ఎలా ఉన్నారు’ అని గౌరవంగా పలకరిస్తే.. మీరు ఒక యుద్ధాన్ని ఆపినట్లే. అలాకాకుండా పక్కవారితో అసభ్యంగా, పరుషంగా ఒక్కమాట మాట్లాడినా.. అది ఎక్కడికి దారితీస్తుందో చెప్పలేం. ఏదో ఒకరోజు ఆ మాటే యుద్ధంగా మారుతుంది. 2050లో జరగబోయే ప్రపంచయుద్ధానికి కారణం కూడా ఆ మాటే అని ఇప్పుడు ఎవరికీ తెలీదు. ఆటంబాంబులు తయారుచేయడం వల్ల యుద్ధాలు రావు.. వాటిని ఆపేయడం వల్ల ఆగవు. ఆటంబాంబుల వంటి ఆలోచనల వల్ల వస్తాయి. దయచేసి ప్రశాంతంగా ఉండండి.. పక్కవారిని కూడా అలాగే ఉండనివ్వండి’ అని పూరి జగన్నాథ్‌ కోరారు’.

బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని