నీటి మీద నడక... సాధ్యమే అక్కడ!

సాంకేతిక పరిజ్ఞానంతో చైనా వాళ్లు ఎన్నో అసాధ్యాలను సుసాధ్యం చేశారు. అద్భుత కట్టడాలెన్నో నిర్మించారు. ఈమధ్యే మరో వింత నిర్మాణంతో ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు. అదే నీళ్ల మీద తేలియాడే నడక బాట (ఫ్లోటింగ్‌ పాత్‌). గిన్నిస్‌ రికార్డు సాధించిన ఈ కట్టడం వెనుక ఎన్నో విశేషాలున్నాయి.

Published : 21 Jan 2017 01:03 IST

నీటి మీద నడక... సాధ్యమే అక్కడ!

మీరెప్పుడైనా నీళ్ల మీద నడిచారా? ‘అమ్మో... అదెలా సాధ్యం? నీటి మీద అడుగేస్తే మునిగిపోమూ’ అంటారా? అయితే ఓ సారి చైనాకెళ్లి చూడండి. అక్కడ కదిలే నీటిమీద తేలుతూ ఎంచక్కా అడుగులో అడుగేసుకుంటూ నడుస్తున్నారు. అలాగని వాళ్లకేవో మాయలూ మంత్రాలూ ఉన్నాయనుకోవద్దు. అదంతా సాంకేతికత మహిమ. అదేంటో మనమూ తెలుసుకుందామా..
సాంకేతిక పరిజ్ఞానంతో చైనా వాళ్లు ఎన్నో అసాధ్యాలను సుసాధ్యం చేశారు. అద్భుత కట్టడాలెన్నో నిర్మించారు. ఈమధ్యే మరో వింత నిర్మాణంతో ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు. అదే నీళ్ల మీద తేలియాడే నడక బాట (ఫ్లోటింగ్‌ పాత్‌). గిన్నిస్‌ రికార్డు సాధించిన ఈ కట్టడం వెనుక ఎన్నో విశేషాలున్నాయి.
* చైనాలోని హాంగ్‌షుయ్‌ నది మధ్యభాగంలో నీటి ఉపరితలం మీద వలయాకారంలో ఈ బాటను నిర్మించారు. ఈ బాట పొడవు 50 కిలోమీటర్లపైనే ఉంటుంది. నేల మీద నడిచినట్లుగానే ఈ బాటపైనా నడవచ్చు. దీని ప్రత్యేకత ఏంటంటే నీటి కదలికలను బట్టి అది పైకి కిందకి కదులుతూ ఉంటుంది. దీనివల్ల ఆ బాటపైన వెళ్లేవారికి అచ్చం నీటి మీద నడుస్తున్న భావన కలుగుతుంది.
* అంతే కాదు... పిల్లలు ఈ బాట మీద నడుస్తూ మధ్యమధ్యలో చక్కగా ఆడుకోవచ్చు కూడా. వారికోసమే ఈ బాట మీద రకరకాల ఆటబొమ్మలు 2 లక్షల 22 వేల 5 వందలకు పైగా ఏర్పాటు చేశారు. బాతులు, జారుడు బల్లలు తదితర ఆకారాల్లో ఉన్న ఈ రబ్బరు బొమ్మలు నిజానికి ఆ బాటను నీళ్ల మీద తేలేలా చేయడానికి ఏర్పాటు చేసిన ఏర్పాట్లేనట.
* ఈ బాటను కాస్త ఎత్తు నుంచి చూస్తే ఓ అందమైన రంగవల్లికలా కనిపిస్తుంది. ఇక రాత్రివేళల్లో ఈ బాట సౌందర్యం చెప్పనలవి కాదు. వేల కొద్దీ ఉన్న రంగు రంగుల దీపాల వెలుగుల్లో ఈ బాట మెరిసిపోతుంటే దీపావళి రోజున తారాజువ్వలు విరజిమ్ముతున్నట్లు ఉంటుంది.
* ఈ వలయాకార బాట వైశాల్యం 54 వేల చదరపు మీటర్లు. అమెరికాలోని మాన్‌ హాట్టన్‌ నగర వైశాల్యంతో పోలిస్తే ఇది రెండు రెట్లు ఎక్కువట. అందుకే అతి పొడవైన కదిలే నడక బాటగా దీనికి గిన్నిస్‌ రికార్డు దక్కింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని