2034లో మీ దగ్గరా చూడొచ్చు!

హాయ్‌... సూర్యుడు గారూ! నాపేరు కిట్టూ! హాయ్‌బుజ్జీ తరఫున మిమ్మల్ని సరదాగా పలకరిద్దామని వచ్చా. ‘నా గురించి తెలియనిదేముందబ్బా?’ అనుకుంటున్నారేమో కానీ మరేమీ లేదు.. రెండు మూడు రోజులుగా అంతా మీ సంగతులే మాట్లాడుతున్నారు... అమెరికాలో, ప్రసార మాధ్యమాల్లో సంపూర్ణ సూర్యగ్రహణం అంటూ హల్‌చల్‌ నడిచింది. అవునుగానీ ఇంతకీ మీరు మా దగ్గర ఇలా ఎప్పుడు కనిపిస్తారేంటి?

Published : 23 Aug 2017 01:06 IST

* హాయ్‌... సూర్యుడు గారూ! నాపేరు కిట్టూ! హాయ్‌బుజ్జీ తరఫున మిమ్మల్ని సరదాగా పలకరిద్దామని వచ్చా. ‘నా గురించి తెలియనిదేముందబ్బా?’ అనుకుంటున్నారేమో కానీ మరేమీ లేదు.. రెండు మూడు రోజులుగా అంతా మీ సంగతులే మాట్లాడుతున్నారు... అమెరికాలో, ప్రసార మాధ్యమాల్లో సంపూర్ణ సూర్యగ్రహణం అంటూ హల్‌చల్‌ నడిచింది. అవునుగానీ ఇంతకీ మీరు మా దగ్గర ఇలా ఎప్పుడు కనిపిస్తారేంటి?
** నన్ను కలవడానికి వచ్చినందుకు చాలా సంతోషం కిట్టూ. మీ దగ్గర నా సంపూర్ణ సూర్యగ్రహణం చూడాలంటే 2034 వరకు ఆగాల్సిందే. లేదంటే 2019లో దక్షిణ అమెరికా దేశాల దగ్గర కనిపిస్తానిలా. అప్పటిలోగా నా గ్రహణం గురించి మీ శాస్త్రవేత్తలేమైనా కొత్త విషయాలు తెలుసుకుంటారేమో చూద్దాం.

* అవును నాకూ ఉత్సాహంగానే ఉంది. అది సరే... మరి ఇప్పటి సూర్యగ్రహణం సంగతులు ఏంటి?
** ఆ విషయానికే వస్తున్నా. కానీ ఇంకాస్త దూరంగా నిలబడు! లేదంటే నా వేడిని తట్టుకోలేవు. భూమికీ, నాకూ మధ్య చంద్రుడు వచ్చినప్పుడు, మీ భూమిపై కొంత భాగంలో నేను కనిపించను. దాన్నే సూర్యగ్రహణం అంటారని వినే ఉంటావుగా. అత్యంత ప్రకాశవంతంగా వెలిగే నేను చంద్రుడి ఛాయ వల్ల ఒక సన్నటి అంచులా కనిపిస్తా. అప్పుడు ఆ ప్రదేశంలో మాత్రం సూర్యగ్రహణం కనిపిస్తుంది. ఇప్పుడు అమెరికాలో జరిగింది అచ్చంగా ఇదేనన్నమాట.

* అయితే ఈసారి వచ్చిన సంపూర్ణ గ్రహణం దాదాపు 99 ఏళ్ల తర్వాత ఏర్పడిందటగా. పసిఫిక్‌ తీర ప్రాంతం నుంచి అట్లాంటిక్‌ తీరం వరకు మీ గ్రహణం వల్ల చీకటి పడటం చాలా అరుదైన విషయమంటూ మా శాస్త్రవేత్తలూ చెబుతున్నారు. ఎప్పుడో 1918లో ఇలాంటి గ్రహణం కనిపించిందట. మళ్లీ ఇన్నాళ్లకు ఇలా. అందుకే దీనికి ‘గ్రేట్‌ అమెరికన్‌ ఎక్లిప్స్‌’ అంటూ పేరూ పెట్టేశారు.
** అవును కిట్టూ. అమెరికా ఒరెగాన్‌ నుంచి దక్షిణ కరోలినా వరకు 14 రాష్ట్రాల మీదుగా 98 కిలోమీటర్ల నుంచి 113 కిలోమీటర్ల మేర నాకు చంద్రుడు అడ్డొచ్చాడు. ఈ తతంగమంతా 2 గంటల 40 నిమిషాల పాటు జరిగింది. అందుకే ఆ ప్రాంతమంతా పట్టపగలే రెండు మూడు నిమిషాలు చీకటయ్యింది. అప్పుడు నా గ్రహణాన్ని చూడ్డానికి భారీ ఏర్పాట్లే జరిగాయనుకుంటా!

* అవునవును. సోమవారం అమెరికాలో అన్ని చోట్లా ఒకటే సందడి. అమెరికాలో కొన్ని చోట్ల పాక్షికంగా కనిపిస్తే కొన్ని రాష్ట్రాల్లో మాత్రం సంపూర్ణంగా గ్రహణం కనిపించింది. నేను నేరుగా చూడలేదు కానీ నాసా వాళ్లు అందించిన ప్రత్యేక ప్రసారాల్లో చూశా. విద్యార్థులకు అంతరిక్షం విషయాలు పుస్తకాల్లోనే తప్ప నిజంగా చూపించడానికి కుదరదు కదా. కానీ ఈ సందర్భంగా ఆరిజోనా స్టేట్‌ యూనివర్సిటీ, నేషనల్‌ ఇన్‌ఫార్మల్‌ స్టెమ్‌ ఎడ్యుకేషన్‌ నెట్‌వర్క్‌ లాంటివి పిల్లల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశాయి. కళ్లకు హాని జరగకుండా ఉండేందుకు కళ్లజోళ్లు ఇచ్చి నేరుగా సూర్యగ్రహణాన్ని దగ్గరుండి చూపించాయి. కొన్ని మ్యూజియాల్లో వారి కోసం గ్రహణంపై తరగతులు నిర్వహించాయి. టెలిస్కోపులిచ్చి, దాంట్లోంచి గ్రహణాన్ని చూపిస్తూ వివరాలు చెప్పుకొచ్చాయి. ఇదంతా భలేగా సాగిపోయింది.
** శాస్త్రవేత్తలు కూడా చాలా ఆసక్తి చూపినట్టున్నారే!

* అవును మరి. అమెరికా అంతరిక్ష పరిశోధనా కేంద్రం నాసా వారైతే మరీనూ. ఏదో రాకెట్‌ ప్రయోగానికి కౌంట్‌డౌన్‌ పెట్టినట్లు మీ గ్రహణానికీ పెట్టి ప్రత్యక్ష ప్రసారం చేశారు. ఇక చాలామంది శాస్త్రవేత్తలైతే ఆ సమయంలో మిమ్మల్నీ, చంద్రుడినీ టెలిస్కోపుల ద్వారా ఎంతో పరీక్షగా చూశారు. దాన్నుంచి వాళ్లు నేర్చుకునే విషయాలు మీపై చేసే పరిశోధ¿నల్లో ఎంతో ఉపయోగపడతాయని చెబుతున్నారు వాళ్లు.
మరో విషయం చెప్పడం మరిచా. మీ గ్రహణాన్ని నేల మీద నుంచే కాదు. విమానాల్లోంచి, సముద్రంలో ఓడల మీద నుంచి కూడా చూశారు కొంత మంది. ఇక వస్తా సూర్యుడు గారూ! ఈ కబుర్లన్నీ మా వాళ్లకీ చెప్పాలి కదా!
** సరే కిట్టూ. బైబై మరి!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని