ఈ బీచ్‌ ‘కేవ్‌’ కేక!

ఐరోపా ఖండంలో ఉండే బుల్లి దేశం పోర్చుగల్‌. దాదాపు కోటి మంది జనాభా మాత్రమే ఉండే ఇది స్పెయిన్‌, అట్లాంటిక్‌ మహా సముద్రాలతో సరిహద్దుల్ని పంచుకుంటుంది. ఇక్కడ మూడొంతుల్లో ఒక వంతు భూమిలో అడవులే ఉంటాయి...

Published : 18 Nov 2017 01:45 IST

ఈ బీచ్‌ ‘కేవ్‌’ కేక!
పోర్చుగల్‌

ఐరోపా ఖండంలో ఉండే బుల్లి దేశం పోర్చుగల్‌. దాదాపు కోటి మంది జనాభా మాత్రమే ఉండే ఇది స్పెయిన్‌, అట్లాంటిక్‌ మహా సముద్రాలతో సరిహద్దుల్ని పంచుకుంటుంది.
* ఇక్కడ మూడొంతుల్లో ఒక వంతు భూమిలో అడవులే ఉంటాయి.
* దీని అధికారిక భాష పోర్చుగీసు. ప్రపంచవ్యాప్తంగా ఈ భాషను 23కోట్లమందికి పైగా మాట్లాడుతున్నారని అంచనా. ఈ భాష ఈ దేశానికే కాదు మరో తొమ్మిది దేశాలకూ అధికారిక భాషే. ప్రపంచంలో ఇంగ్లిష్‌, స్పానిష్‌ తర్వాత ఎక్కువ మంది మాట్లాడేది ఈ భాషే.

ఐరోపా ఖండంలో ఉన్న రాతి గుహల్లో అతి అరుదైనది ‘ద బెనాగిల్‌ కేవ్‌’. ప్రపంచంలోని తొలి పది అతి చల్లని గుహల్లో ఇదీ ఒకటి. సముద్ర తీరంలో ఉండే ఈ గుహ భలే గమ్మత్తుగా ఉంటుంది. పైన ఆకాశం కనిపించేలా ఓ రంధ్రం ఉండి చుట్టూ గోడలతో మూసుకుని ఉన్నట్టు ఉంటుంది. వాటి మధ్య ఉన్న ఖాళీల నుంచి సముద్రపు అలలు లోపలికి వస్తుంటాయి. దీంతో గుహ లోపల ఉండే ఈ బీచ్‌లో సరదాగా గడిపేందుకు బోలెడు మంది వస్తుంటారు. ఇది పోర్చుగల్‌ దక్షిణ భాగంలో బెనాగిల్‌ అనే ఓ చిన్న పల్లెలో ఉంది. ఈ వూరి పేరు మీదనే ఈ గుహనూ పిలిచేస్తారు.

* తాజా లెక్కల ప్రకారం చూస్తే ఇక్కడ పురుషుల కంటే స్త్రీల ఆయుష్షు ఆరేళ్లు ఎక్కువ.
* పునరుత్పాదక(రెన్యుబుల్‌) వనరుల నుంచి ఎక్కువగా విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తుందీ దేశం. వీళ్ల అవసరాల్లో 70శాతం విద్యుత్‌ ఇలాగే ఉత్పత్తి అవుతుంది.

ప్రపంచంలోనే అతి పెద్ద ఆమ్లెట్‌ని తయారు చేసిన రికార్డు గిన్నిస్‌బుక్‌లో ఈ దేశం పేరునే ఉంది. లక్షా నలభై ఐదు వేల గుడ్లను వాడి 6,466 కేజీల ఆమ్లెట్‌ని 2012లో తయారుచేశారిక్కడ.

ప్రపంచంలో సర్ఫింగ్‌కి అతి అనువైన సముద్ర తీరం ఈ దేశానిదేనట. ఏడాది పొడవునా ఇక్కడ అలలు సర్ఫింగ్‌కి అనుకూలంగా ఉంటాయట.

* ప్రజా రవాణా కోసం స్ట్రీట్‌ కార్లను ఎప్పటి నుంచో వాడేస్తున్నారిక్కడ. ఎప్పటి నుంచంటే 1890ల నుంచే.
* ఇంటికి ఆహ్వానించిన అతిథులకి పూలు, చాక్లెట్లను బహుమతిగా ఇచ్చే సంప్రదాయం ఇక్కడివారికి ఉంది.
* పదమూడు సంఖ్యను దురదృష్టానికి ప్రతీకగా భావిస్తారు.
* ఇక్కడ తృణ ధాన్యాల్ని ఎక్కువగా పండిస్తారు.
* అవి కాకుండా బంగాళాదుంపలు, ద్రాక్ష, బాదం, టమాటాలనూ సాగుచేస్తారు. ఇతర దేశాలకు టామాటా పేస్ట్‌ని ఎక్కువగా ఎగుమతి చేసే దేశం ఇదే.


లిస్బన్‌ ప్రత్యేకతలు!

* ఈ దేశ రాజధాని లిస్బన్‌లో 1732లో ఓ పుస్తకాల దుకాణాన్ని ప్రారంభించారు. దీని పేరు లివ్రారియా బెర్ట్రండ్‌. అది ఇప్పటికీ జనాదరణ పొందుతూనే ఉంది. ప్రపంచంలోనే అతి ప్రాచీన పుస్తకాల దుకాణంగా దీన్ని చెబుతారు.
* అతి ప్రాచీన విశ్వవిద్యాలయాల్లో ఇక్కడున్న కోయింబ్రా ఒకటి. 1290వ సంవత్సరంలో దీన్ని స్థాపించారు.


* ఐరోపా ఖండంలో అతి పొడవైన వంతెన ఇక్కడే ఉంది. దాని పేరు ‘వాస్కోడీగామా బ్రిడ్జ్‌’. 17కిలోమీటర్ల పొడవుంటుంది.
* చరిత్రలో అతి పెద్ద భూకంపంగా చెప్పుకునే ‘గ్రేట్‌ లిస్బన్‌ ఎర్త్‌క్వేక్‌’ 1755లో ఇక్కడ వచ్చింది. రిక్టరుస్కేలుపై 9 తీవ్రతతో నమోదైన భూకంపం. ఆ వెంటే సునామీ వచ్చింది. ఏకంగా పది వేల మందికి పైగా ప్రాణాలొదిలారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని