మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్‌ ఉన్నా ఆమోదం

గతంలో జరిగిన ప్రభుత్వ ఉపాధ్యాయుల దొడ్డిదారి బదిలీలకు.. ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్న సమయంలో ఆమోదిస్తూ(ర్యాటిఫై) పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్‌, కమిషనర్‌ సురేష్‌ కుమార్‌లు విడివిడిగా మెమోలు జారీ చేశారు.

Updated : 26 Apr 2024 08:53 IST

653 సిఫార్సు బదిలీలకు ఆమోదం తెలిపిన ప్రవీణ్‌ ప్రకాశ్‌
వాట్సప్‌ల్లో జాబితాలు పంపి, డీఈఓలతో పోస్టింగులు ఇప్పించిన వైనం
ఈనాడు - అమరావతి

గతంలో జరిగిన ప్రభుత్వ ఉపాధ్యాయుల దొడ్డిదారి బదిలీలకు.. ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్న సమయంలో ఆమోదిస్తూ(ర్యాటిఫై) పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్‌, కమిషనర్‌ సురేష్‌ కుమార్‌లు విడివిడిగా మెమోలు జారీ చేశారు. వీటిని ఈ నెల 23న ఇవ్వగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. రూ.కోట్లలో డబ్బు చేతులు మారిన ఈ రాజకీయ సిఫార్సు బదిలీలకు ఎన్నికల కోడ్‌  అమలులో ఉన్నప్పుడు ర్యాటిఫికేషన్‌ ఇవ్వడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల తర్వాత ప్రభుత్వం మారితే తీసుకున్న డబ్బులకు న్యాయం జరగదనే ఉద్దేశంతో పైరవీ బదిలీలకు ఆమోద ముద్ర వేసేశారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతేడాది ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో ఉత్తరాంధ్రకు చెందిన కీలక మంత్రి, ఆయన పీఏ, పాఠశాల విద్యాశాఖలోని కొందరు అధికారులు కలిసి పైరవీల బదిలీలకు తెరతీశారు.

వైకాపా ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, నాయకుల వినతులతో 653 మంది టీచర్ల బదిలీల జాబితాలను జిల్లా విద్యాధికారులకు పంపించారు. ఉత్తరాంధ్ర మంత్రి పేషీలో డబ్బులు వసూలు చేసి, జాబితాలను జిల్లాలకు వాట్సప్‌ల్లో పంపించారు. వాట్సప్‌ బదిలీలపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ఉపాధ్యాయులు పెట్టుకున్న బదిలీ దరఖాస్తుతోపాటు అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకుల లేఖలు జత చేసి, ఉత్తరాంధ్ర మంత్రి పేషీలో సమర్పించారు. వీటిని కమిషనరేట్‌కు పంపించగా అక్కడి నుంచి వాట్సప్‌ల్లో జిల్లా విద్యాధికారులకు పంపారు. డీఈఓలు నేరుగా పోస్టింగ్‌లు ఇచ్చేశారు. వీరికి ఇప్పుడు జీతాలు ఆగిపోయాయి. ప్రభుత్వం నుంచి అనుమతి లేనందున జీతాలకు సమస్య ఏర్పడింది. గత కొన్ని నెలల నుంచి వీరికి జీతాలు రాకపోవడంతో డీఈఓలు అభ్యర్థనలు పంపారు. వీటికి ప్రవీణ్‌ ప్రకాశ్‌ ఆమోదం తెలుపుతూ మెమో జారీ చేశారు. ఈ మేరకు కమిషనర్‌ మరో మెమో ఇచ్చారు.

మంత్రి వసూళ్లకు ఆమోదం: ఉత్తరాంధ్రకు చెందిన కీలక మంత్రి ఉపాధ్యాయుల బదిలీల్లో భారీగా వసూలు చేసినట్లు ఆరోపణలున్నాయి. ఈ ఒక్క బదిలీల్లోనే మంత్రి, ఆయన పేషీలోని పీఏ కలిపి రూ.50 కోట్ల వరకు నొక్కేసినట్లు ప్రచారం సాగుతోంది. సాధారణ బదిలీలు పూర్తయిన తర్వాత సిఫార్సులు, లంచాలతో రాష్ట్ర వ్యాప్తంగా 653మందికి నేరుగా పోస్టింగ్‌లు ఇచ్చేశారంటే విద్యా వ్యవస్థలో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ జాబితాలో లేని మరో 200వరకు ఉపాధ్యాయ బదిలీలు కూడా అక్రమంగా జరిగినట్లు ఆరోపణలున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని