కదిలే ఇసుక దిబ్బ... భలేగుందబ్బా!

ఎడారి ఎక్కడైనా కదులుతుందా? అస్సలు కదలదు అనేస్తారు వెంటనే... కానీ ఓ దగ్గర అలాంటి ఎడారి ఒకటి ఉంది... ఆశ్చర్యం దేనికి? చదివేస్తే మీకే తెలుస్తుంది! ఇళ్లు కదలడం తెలుసు... అదేనండీ మొబైల్‌ ఇళ్లు. తేలియాడే వూళ్ల గురించి విన్నాం. నడిచే రాళ్ల సంగతులూ చదివాం. కానీ ఎడారి కదలడమేంటీ అనిపిస్తోంది కదూ.....

Published : 05 Dec 2017 01:57 IST

కదిలే ఇసుక దిబ్బ... భలేగుందబ్బా!

ఎడారి ఎక్కడైనా కదులుతుందా?
అస్సలు కదలదు అనేస్తారు వెంటనే...
కానీ ఓ దగ్గర అలాంటి ఎడారి ఒకటి ఉంది...
ఆశ్చర్యం దేనికి? చదివేస్తే మీకే తెలుస్తుంది!
ళ్లు కదలడం తెలుసు... అదేనండీ మొబైల్‌ ఇళ్లు. తేలియాడే వూళ్ల గురించి విన్నాం. నడిచే రాళ్ల సంగతులూ చదివాం. కానీ ఎడారి కదలడమేంటీ అనిపిస్తోంది కదూ. ఫ్రాన్స్‌లో అట్లాంటిక్‌ మహా సముద్రపు ఆర్కచూన్‌ తీరంలో ఉన్న ఓ చిత్రమైన ఎడారి కదులుతుంది. దీని పేరు ‘గ్రేట్‌ డ్యూన్‌ ఆఫ్‌ పైలా’.
* ఎడారి అంటే చాలా పెద్దగా ఉంటుందేమో అనుకోకండి. 500 మీటర్ల వెడల్పు, 3 కిలోమీటర్ల పొడవుతో ఉండే ఇదో పేద్ద ఇసుక దిబ్బ. చూస్తుంటే ఇదే ఓ చిన్న ఎడారిని తలపిస్తుంది. అందుకే ఎడారి అంటూ పిలిచేస్తారు.

* ఇది సముద్రమట్టానికి 107 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఐరోపా మొత్తంలో అత్యంత ఎత్తయిన ఇసుక దిబ్బ ఇదేనట. అలల తీరంలో ఆకట్టుకునే ఈ ప్రాంతాన్ని చూడ్డానికి ఏటా ఇరవై లక్షలకుపైగా సందర్శకులు ఎక్కడెక్కడి నుంచో వస్తారు. దీనికే ‘డ్యూన్‌ ఆఫ్‌ పైలట్‌’ అనే పేరూ ఉంది.
* ఇక ఈ ఎడారి అసలు విశేషానికి వస్తే... ఇది నిదానంగా పక్కకు కదులుతోందట. దీని ఈ కదలికలు ఒక్కోసారి సంవత్సరానికి 10 మీటర్ల వరకు ఉంటున్నాయి.
* 57 సంవత్సరాల్లో ఏడాదికి దాదాపు 5 మీటర్లు కదులుతూ మొత్తం 280 మీటర్లు ముందుకు వచ్చింది. ఇలా ముందుకు రావడంలో కొన్ని ఇళ్లు, చెట్లు కూడా కప్పబడిపోయాయి. అంతేకాదూ..ఈ దిబ్బకు ఓ వైపు పైన్‌ చెట్ల అడవి ఉంది. అటు వైపు కూడా ఇది జరిగిపోతుంది. అలా ఆ చెట్లవైపు ఏటా 8000 చదరపు మీటర్ల వరకు విస్తరిస్తోంది.

* మొదటిసారిగా 1987లో ఈ ఇసుక దిబ్బ ఈశాన్యం మూల భాగం కదలడం మొదలెట్టింది. 1991కి వచ్చేసరికి ఓ రహదారి మొత్తాన్ని కప్పేసింది. అప్పడిది వార్తల్లో తెగ హల్‌చల్‌ చేసింది.
* అసలీ కదలికలు ఎలా వస్తున్నాయంటే... దీనికి కారణం వేగంగా వీచే సముద్ర గాలులే. ఆ గాలుల వల్లే ఈ ఎడారిలో చలనం, ఆకారం మారుతూ వస్తోందట. దీంతో సముద్రం వైపు ఈ ఇసుక ఎడారి వాలులు భలే గమ్మత్తుగా కనిపిస్తాయి. అందుకే ఆ వాలు పైకి ఎక్కుతూ తమ సరదా తీర్చుకుంటారు. సందర్శకుల కోసం ఈ ఎత్తయిన ఇసుక దిబ్బ ఎక్కడానికి మెట్ల దారి కూడా ఉంటుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని