పర్వతం పైపై... రయ్‌ రయ్‌!

పర్యాటక ప్రాంతాలకు రోడ్డుపై వెళతాం... మరి రహదారే పర్యాటక ప్రాంతమైతే... ఆ ప్రయాణం ఇంకెంతో తమాషాగా ఉంటుంది... ఈ వివరాలు చదివేస్తే అదేంటో మీకే తెలుస్తుంది! కొండ రహదారులపై ప్రయాణమంటే... గుండె చిక్కబట్టుకుని కూర్చోవలసిందే. వెంట వెంటనే వచ్చే మలుపుల్లో...

Published : 26 Apr 2018 01:26 IST

పర్వతం పైపై... రయ్‌ రయ్‌!

పర్యాటక ప్రాంతాలకు  రోడ్డుపై వెళతాం... మరి రహదారే పర్యాటక ప్రాంతమైతే... ఆ ప్రయాణం ఇంకెంతో  తమాషాగా ఉంటుంది... ఈ వివరాలు చదివేస్తే  అదేంటో మీకే తెలుస్తుంది!

కొండ రహదారులపై ప్రయాణమంటే... గుండె చిక్కబట్టుకుని కూర్చోవలసిందే. వెంట వెంటనే వచ్చే మలుపుల్లో వాహనం అంతే ఒడుపుగా తిరుగుతుంటే మనకు కళ్లు తిరిగిపోతాయి. మరేమో ఈ హైరానా ఏమీ లేకుండా పర్వత శిఖరాన, భూమికి అంతెత్తున.. ఓ చక్కని రోడ్డుంది. దాని వెనుక ఓ ఆసక్తికరమైన కథా ఉంది.

* ఈ చూడచక్కని టన్నెల్‌ రోడ్డు ఎక్కడుందంటే చైనాలోని హైనాన్‌ ప్రావిన్సులో.

* పర్వత శిఖరం బయటవైపుగా ఈ సొరంగ మార్గాన్ని తయారు చేశారు. కొంత భాగం కొండ లోపలి నుంచి, కొంత భాగం బయటవైపు కనిపిస్తూ ఉంటుందిది. కొండపై ప్రయాణిస్తున్నా.. సొరంగంలా ఉండటంతో ఎంతో భద్రంగా
అనిపిస్తుందట.

* ఇంత చిత్రంగా దీన్ని ఎందుకు కట్టారంటే... అక్కడ తైహాంగ్‌ పర్వత సానువుల్లో హుయిక్సియాన్‌ అనే చిన్న గ్రామముంది. ఒకప్పుడు దానికి బయటి ప్రపంచంతో సంబంధమే ఉండేది కాదు. ఆవలనున్న గౌలియాంగ్‌ గ్రామానికి వెళ్లాలంటే రాళ్లు, గుట్టల మీదుగా చాలా దూరం, కొన్ని రోజులపాటు కాలినడకన ప్రయాణిస్తే తప్ప చేరుకోలేకపోయేవారు.

* దీంతో ఆ గ్రామ పెద్ద షెన్‌ మింగ్సింగ్‌తో పాటు గ్రామస్థులంతా కూర్చుని ఆలోచించారు. బయట ప్రాంతాలకు దారి కోసం ఏదైనా చెయ్యాలనుకున్నారు. నిట్ట నిలువున ఉన్న పర్వతం మొత్తాన్ని తవ్వి దారి ఏర్పాటు చేసుకోవడం కష్టమనుకున్నారు. అప్పుడే వీరికి ఈ మెరుపులాంటి ఆలోచన వచ్చింది.

* దీంతో 1972లో ఈ రాతి కొండ పైన సొరంగాన్ని తొలచాలనుకున్నారు. అయితే ఆ పరికరాలు కొనేందుకు వాళ్ల దగ్గర డబ్బులు లేవు. దీంతో వారి దగ్గరున్న పశువుల్ని అమ్మేసి పరికరాలు సమకూర్చుకున్నారు.

* వాటితో 1972 నుంచి 1977 వరకూ ఈ శిఖరంలో సొరంగం తవ్వారు. పదహారు అడుగుల ఎత్తు, 13 అడుగుల వెడల్పుతో మొత్తం 1.2కిలోమీటర్ల దూరం దీన్ని తొలిచారు.

* ఆ టన్నెల్‌లో రోడ్డు వేసుకుని గౌలియాంగ్‌తో సంబంధాలు ఏర్పరుచుకున్నారు. అందుకే ఈ టన్నెల్‌కి గౌలియాంగ్‌ టన్నెల్‌ అనే పేరుంది.

* ఇప్పుడు ఈ సొరంగ రహదారిపై రయ్‌ రయ్‌ మంటూ కార్లు పరిగెడుతుంటాయి. ఎందుకంటే ఇప్పుడు ఇది అక్కడ పర్యాటక ప్రాంతంగా మారిపోయింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని