స్టోట్‌.. కుందేళ్ల పాలిట యమరాజు!

చూస్తే చిన్న ఉడతలాంటి రూపం! కానీ.. వేటలో చూపిస్తుంది అసలు ప్రతాపం! అలా అని.. చిరుతలా దూసుకుపోదు.. పెద్దపులిలా పంజా కూడా విసరదు! పిచ్చి పిచ్చి చేష్టలతో ఏమారుస్తుంది.. అదును చూసి.. హాం ఫట్‌ చేస్తుంది!

Published : 17 Jan 2022 01:17 IST

చూస్తే చిన్న ఉడతలాంటి రూపం! కానీ.. వేటలో చూపిస్తుంది అసలు ప్రతాపం! అలా అని.. చిరుతలా దూసుకుపోదు.. పెద్దపులిలా పంజా కూడా విసరదు! పిచ్చి పిచ్చి చేష్టలతో ఏమారుస్తుంది.. అదును చూసి.. హాం ఫట్‌ చేస్తుంది!

ఇంతకీ ఈ వింత జీవి పేరు ఏంటో తెలుసా.. స్టోట్‌. ఇది ఎక్కువగా ఉత్తరఅమెరికాలో కనిపిస్తుంది. యూరప్‌, ఆసియాలోనూ ఉంటాయి. ఇవి నిజానికి చాలా చిన్న జీవులు. కానీ తమకంటే దాదాపు అయిదారు  రెట్లు పెద్దగా ఉండే కుందేళ్లనూ వేటాడతాయి. బరువేమో మగవి దాదాపు 250 గ్రాములుంటే ఆడవి  180 గ్రాములుంటాయి. కానీ ఇవంటేనే కుందేళ్లు హడలి పోతాయి! ఒక్క కుందేళ్లు ఏంటి.. పక్షులనూ ఇవి పీక్కుతింటాయి. ఎలుకలు, బల్లులు, పురుగుల్నీ కరకరలాడిస్తాయి.

రంగు మారుస్తాయి!

ఈ స్టోట్లు కూడా రంగు మారుస్తాయి. కానీ ఊసరవెల్లుల్లా కాదు. వేసవి కాలంలో ఎరుపు, గోధుమ రంగులో ఉంటాయి. చలికాలంలో మాత్రం పూర్తి తెలుపు రంగులోకి మారతాయి. కానీ తోక చివర నలుపురంగు అలాగే ఉంటుంది. చలి నుంచి తనను తాను రక్షించుకోవడానికే ఈ ఏర్పాటు అన్నమాట.

ఏ మారుస్తాయి!

చిన్న చిన్న పక్షులు, ఎలుకల్ని ఇవి వేటాడినా.. వీటికి కుందేలు మాంసం అంటేనే చాలా ఇష్టం. కానీ అవేమో వీటికన్నా పెద్దగా ఉంటాయి. అందుకే ఇవి వాటిని ఏమార్చి హతమారుస్తాయి. కుందేళ్లను వేటాడేటప్పుడు ఇవి స్మార్ట్‌ వర్క్‌ చేస్తాయి. పిచ్చి పిచ్చిగా గెంతుతూ.. అల్లరి చేస్తూ కుందేళ్ల దృష్టిని ఆకర్షిస్తాయి. వీటితో తమకు హాని లేదు.. అని కుందేళ్లు భ్రమ పడేలా చేస్తాయి. అలా.. అలా.. ఈ స్టోట్లు కుందేళ్లకు సమీపానికి వెళ్లి.. ఒక్కసారిగా దాడికి ప్రయత్నిస్తాయి. అప్పుడు అవి పారిపోవాలని ఎంత ప్రయత్నించినా వదిలి పెట్టక వెంటాడతాయి. తర్వాత అమాంతం కుందేళ్ల గొంతు కొరికి చంపేస్తాయి.

స్టోట్‌ కొంచెం.. ఘోరాలు ఘనం!

చూస్తే బుజ్జిబుజ్జిగా, అమాయకంగా కనిపించే ఈ స్టోట్లు.. నిజానికి వినాశకారులు. ఇవి ఇష్టమొచ్చినట్లు వేటాడతాయి. వీటివల్ల కుందేళ్లు, అరుదైన పక్షుల సంఖ్య తగ్గిపోతోంది. 19వ శతాబ్దం ప్రారంభంలో వీటిని న్యూజిలాండ్‌లో వదిలారు. అక్కడ ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతున్న కుందేళ్ల సంతతిని క్రమబద్ధీకరించడానికి ఇలా చేశారు. కానీ ఇవి అక్కడ కొత్త సమస్యను సృష్టించాయి. పెద్ద మొత్తంలో పక్షులను వేటాడాయి. కేవలం ఆరేళ్లలోనే పక్షుల సంఖ్య సగం వరకు తగ్గేలా చేశాయి. ఇవి అంత విధ్వంసం సృష్టిస్తాయన్న విషయం అప్పుడే ప్రపంచానికి తెలిసింది. ఎంత గొప్పవేటగాళ్లైనా ఇవీ నక్కల్లాంటి జీవుల చేతుల్లో తమ ప్రాణాలు కోల్పోతుంటాయి. నేస్తాలూ... మొత్తానికి ఇవీ స్టోట్‌ సంగతులు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని