ఎనిమిదో తరగతికే పుస్తకం రాసేసింది!

హలో ఫ్రెండ్స్‌.. బడి నుంచి ఇంటికొచ్చాక కూడా పుస్తకాలు తీసి.. చదవమంటేనే ‘అబ్బా’ అనుకుంటాం. పరీక్షల ముందు తప్ప.. వేరే రోజుల్లో బుక్‌ అంటేనే భయమేస్తుంది మనకు! కానీ, ఓ నేస్తం మాత్రం...

Updated : 15 Mar 2022 00:30 IST

హలో ఫ్రెండ్స్‌.. బడి నుంచి ఇంటికొచ్చాక కూడా పుస్తకాలు తీసి.. చదవమంటేనే ‘అబ్బా’ అనుకుంటాం. పరీక్షల ముందు తప్ప.. వేరే రోజుల్లో బుక్‌ అంటేనే భయమేస్తుంది మనకు! కానీ, ఓ నేస్తం మాత్రం స్కూలుకెళ్లే వయసులోనే ఏకంగా ఓ పుస్తకం రాసేసింది తెలుసా? నిజమే.. ఇంతకీ ఆ నేస్తం ఎవరో, ఆ పుస్తకమేంటో తెలుసుకుందాం రండి.

కర్ణాటక రాష్ట్రంలోని మంగళూరుకు చెందిన షేనెడ్‌ ఫెర్నాండెజ్‌.. ప్రస్తుతం ఎనిమిదో తరగతి చదువుతోంది. హ్యారీపోటర్‌ అంటే ఎవరికి ఇష్టం  ఉండదు చెప్పండి! షేనెడ్‌కు కూడా చిన్నప్పటి నుంచి హ్యారీపోటర్‌ సినిమాలన్నా పుస్తకాలన్నా బోలెడు ఇష్టమట.

కల్పిత పాత్రలతో..

అలా హ్యారీపోటర్‌ సినిమాలు చూస్తూ.. పుస్తకాలు చదువుతూ.. అలాంటి కల్పిత కథతో షేనెడ్‌ కూడా ‘ది ఇన్సిడెంట్‌’ పేరిట ఒక పుస్తకం రాసేసింది. ఇదొక్కటే కాదు ఫ్రెండ్స్‌.. ‘సెలస్టియం’ సిరీస్‌ పేరిట తాను రాయబోయే ఆరు పుస్తకాల్లో ఇది మొదటిదట. ఇందులో అయిడెన్‌, అలెన్‌ అనే ఇద్దరు కవలలు ఓ అద్భుత ప్రపంచంలోకి వెళ్లాలనుకుంటారు. అనుకోని పరిస్థితుల్లో వారిద్దరూ విడిపోవడం, ఆ మాయాలోకంలోకి వెళ్లేందుకు వారిద్దరూ వేర్వేరుగా చేసిన సాహసాలు, ఎదురైన పరిస్థితులతో అల్లిన సంఘటనలు.. ప్రతి ఒక్కరికీ ఆసక్తిని రేకెత్తిస్తాయట. 

ఆసక్తి ఎలా మొదలైందంటే..

షేనెడ్‌కు ఎనిమిదేళ్ల నుంచే నవలలు చదవడం అలవాటు అయింది. అలా ఒకసారి ‘బ్లాక్‌ బ్యూటీ’ అనే పుస్తకాన్ని చదివాక.. తానూ రచయితగా మారాలని అనుకుంది. దాంతో 2019లో నవలను రాయడం ప్రారంభించి.. ఇటీవలే పూర్తి చేసింది. అంటే, లాక్‌డౌన్‌ సమయాన్ని తన లక్ష్యం కోసం చక్కగా వినియోగించుకుందన్నమాట. ఓ సంస్థ ఆ పుస్తకాన్ని ముద్రించడంతో.. ఇటీవల పాఠశాలలో ఆ బుక్‌ విడుదల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్కూల్‌ ప్రిన్సిపల్‌ మాట్లాడుతూ.. చిన్న వయసులోనే అద్భుత ఉహాశక్తితో పుస్తకం రాయడం మామూలు విషయం కాదనీ షేనెడ్‌ను అభినందించారాయన. ‘తల్లిదండ్రుల సహకారంతోనే ఇదంతా సాధ్యమైంది. భవిష్యత్తులో రచయితను కావాలనుకున్నా కానీ ఇంత త్వరగా అవుతానని అస్సలు ఊహించలేదు’ అని సంతోషంగా చెబుతోంది షేనెడ్‌. తనలోని ఊహలకు పుస్తక రూపమిచ్చిన ఈ నేస్తం నిజంగా గ్రేట్‌ కదూ!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు