కళ్లకు గంతలతో కర్రసాము!

గంతలు కట్టుకుంటే మనకంతా చీకటిగా ఉంటుంది. ఆ అంధకారంలో మనకు అడుగు తీసి అడుగు వేయడమే కష్టం. కానీ ఓ అక్క మాత్రం ఏకంగా కర్రసాము చేసింది. అదీ మామూలుగా కాదు...

Published : 05 Feb 2023 16:07 IST

గంతలు కట్టుకుంటే మనకంతా చీకటిగా ఉంటుంది. ఆ అంధకారంలో మనకు అడుగు తీసి అడుగు వేయడమే కష్టం. కానీ ఓ అక్క మాత్రం ఏకంగా కర్రసాము చేసింది. అదీ మామూలుగా కాదు... ఏకంగా రికార్డు సృష్టించేసింది. మరి మరిన్ని వివరాలు తెలుసుకుందామా..!

తమిళనాడులోని చెన్నైకు చెందిన అర్చన పదకొండో తరగతి చదువుతోంది. ఇటీవల తను సిలంబంలో రికార్డు సృష్టించింది. కళ్లకు గంతలు కట్టుకుని దాదాపు పదకొండున్నర గంటలు కర్రసాము విన్యాసాలు చేసింది. తనకు ఆరు సంవత్సరాల వయసున్నప్పటి నుంచే అర్చన ఈ సిలంబం నేర్చుకుంటోంది.

చూసిన వెంటనే...
చిన్నప్పుడు ఒకసారి తండ్రితో కలిసి స్పోర్ట్స్‌ ఈవెంట్‌కు వెళ్లినప్పుడు ఈ సిలంబాన్ని చూసింది అర్చన. అప్పుడు తనకు ఈ కర్రసాము ఓ మ్యాజిక్‌లా అనిపించింది. అందుకే తెగ నచ్చింది. ఎలాగైనా నేర్చుకోవాలనుకుంది. ఇదే విషయాన్ని వాళ్ల నాన్నకు చెప్పింది. ఆయన అర్చనకు శిక్షణ ఇప్పించారు.

ఆరో తరగతి నుంచి...
అర్చన ఆరో తరగతికి వచ్చేనాటికల్లా రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొని తన మొదటి బంగారు పతకాన్ని సాధించేసింది. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. తన ఖాతాలో ఇంకా చాలా పతకాలు వేసుకుంది. ఎప్పటికప్పుడు  నైపుణ్యాన్ని మెరుగుపరుచుకుంది. ఫిట్‌నెస్‌ మీద సైతం ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. ప్రతిరోజూ రన్నింగ్‌, పుష్‌అప్స్‌ చేస్తోంది.

రికార్డు సాధించాలని...
ఈ క్రమంలోనే వ్యక్తిగతంగా తన పేరిట ఓ రికార్డంటూ ఉండాలనే ఆలోచన వచ్చింది. దీనికి కోచ్‌ మద్దతు తోడైంది. కళ్లకు గంతలు కట్టుకుని కర్రసాము చేయాలని నిర్ణయించుకుంది. ముందు పది గంటలే అనుకుంది. కానీ తాను దాదాపు పదకొండున్నర గంటలు ఈ ఫీట్‌ చేసి ‘ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’లో స్థానం సంపాదించింది. గతంలో కర్రసాము 12 గంటలు చేసిన రికార్డు ఓ వ్యక్తి పేరిట ఉంది. కానీ ఆ వ్యక్తి కళ్లకు గంతలు లేవు. అర్చన తన కళ్లకు గంతలు కట్టుకుని పదకొండున్నర గంటల వరకు కర్రసాము చేసి రికార్డు సృష్టించింది.

గిన్నిస్‌ రికార్డే లక్ష్యంగా..
తాను భవిష్యత్తులో కళ్లకు గంతలు కట్టుకుని 24 గంటలు కర్రసాము చేసి ‘గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌’లో స్థానం సంపాదించాలనుకుంటోంది. ప్రస్తుతానికైతే చదువు మీద దృష్టి పెట్టింది. ఈ పరిస్థితుల్లో ఇప్పటికిప్పుడైతే ఈ రికార్డు కోసం కృషి చేయలేనంటోంది. రానున్న రోజుల్లో మాత్రం తప్పకుండా తాను రికార్డు సృష్టిస్తానని ధీమాగా చెబుతోంది. మరో విషయం ఏంటంటే అర్చన బయాలజీ స్టూడెంట్‌. తాను భవిష్యత్తులో కార్డియాలజిస్టు కావాలనుకుంటోంది. మరి మనం తనకు ఆల్‌ ది బెస్ట్‌ చెప్పేద్దామా!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని