ఆలోచన భేష్‌.. సమస్యలు హుష్‌!

హాయ్‌ ఫ్రెండ్స్‌.. మనకు ఏదైనా సమస్య ఉంటే అమ్మానాన్నలకో, టీచర్లకో చెబుతాం. కానీ, పల్లెల్లో చాలామంది పిల్లలు మాత్రం సమస్యలను ఎవరికి చెప్పాలో తెలియక అనేక అవస్థలు పడుతుంటారు.

Published : 10 Nov 2022 01:12 IST

హాయ్‌ ఫ్రెండ్స్‌.. మనకు ఏదైనా సమస్య ఉంటే అమ్మానాన్నలకో, టీచర్లకో చెబుతాం. కానీ, పల్లెల్లో చాలామంది పిల్లలు మాత్రం సమస్యలను ఎవరికి చెప్పాలో తెలియక అనేక అవస్థలు పడుతుంటారు. అటువంటి చిన్నారుల ఇబ్బందులు తెలుసుకోవడంతోపాటు వాటిని పరిష్కరించేందుకు ఓ రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమైంది. ఆ వివరాలే ఇవీ..

ర్ణాటకలోని అన్ని గ్రామ పంచాయతీల్లో పిల్లల కోసం ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని ఇటీవల ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఆయా సమావేశాల్లో చిన్నారులు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లవచ్చు. అంతేకాదు.. పిల్లలకు రాజ్యాంగం కల్పించిన హక్కులపైన అవగాహన కూడా కల్పించనున్నారు.

పది వారాలపాటు..

కర్ణాటక రాష్ట్ర పంచాయతీ రాజ్‌ శాఖ ఆధ్వర్యంలో నవంబర్‌ 14 నుంచి పది వారాలపాటు ‘పిల్లల పంచాయతీ’లు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాల్లో స్థానిక పాఠశాలల్లో గదులు, పుస్తకాలు, ఉపాధ్యాయుల కొరత తదితర మౌలిక వసతులతోపాటు ఇతర సమస్యలను నేరుగా పిల్లలే గ్రామ పెద్దలు, అధికారుల దృష్టికి తీసుకెళ్లొచ్చు. కేవలం బడి విద్యార్థుల కోసమే కాకుండా మిగతా చిన్నారుల ఇబ్బందులనూ ఈ సమావేశాల్లో చర్చించనున్నారట. చిన్నపిల్లల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న పథకాలు, వారి హక్కులను అందరికీ వివరించనున్నారు. వీటిలో పిల్లల కోసం పనిచేసే వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులూ పాల్గొంటారట.

గతంలో నిర్వహించినా..

రాష్ట్రవ్యాప్తంగా ‘పిల్లల పంచాయతీ’లను గతంలో నిర్వహించినా.. అవి మొక్కుబడిగానే ముగిశాయట. ఆయా సమావేశాల్లో ఎటువంటి అంశాలను చర్చించకుండా.. హాజరైన చిన్నారులకు కేవలం చాక్లెట్లు ఇచ్చేసి పంపించేశారట. ఈసారి అటువంటి పొరపాట్లు జరగకుండా.. కచ్చితంగా చిన్నారుల ఇబ్బందులను పరిష్కరించాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ప్రతి పంచాయతీలో కనీసం రెండొందల మంది పిల్లలు హాజరయ్యేలా చూస్తున్నారట. అంతేకాదు.. ప్రతి గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో సోషల్‌ మీడియాలో ఖాతాలు తెరవాలని, పిల్లలు తమ సమస్యలను ఆ వేదికగా తెలిపేలా అవగాహన కల్పించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఆయా ఖాతాలు గ్రామస్థులకు సైతం ఉపయోగకరంగా ఉంటాయన్నారు. నిజంగా ఈ ఆలోచన భలే ఉంది కదూ! మన దగ్గరా ఇలాంటి సమావేశాలు ఏర్పాటు చేస్తే ఎంత బాగుంటుందో! అలాగని, మీరు సమస్యలతో బాధపడుతూనే ఉండకండి నేస్తాలూ.. ఇంట్లో పెద్దవాళ్లకో, టీచర్లకో ధైర్యంగా చెప్పేయండి!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని