వెనక్కి వెళ్లి.. విజయం సాధించాడు!

హాయ్‌ నేస్తాలూ..! ఇంతకీ మీకు స్కేటింగ్‌ తెలుసా? ‘అదెందుకు తెలియదు, బాగా తెలుసు. ఈ మధ్య చాలామంది నేర్చుకుంటున్నారు కదా! స్కూల్‌ నుంచి వచ్చాక..

Updated : 20 Feb 2024 05:14 IST

హాయ్‌ నేస్తాలూ..! ఇంతకీ మీకు స్కేటింగ్‌ తెలుసా? ‘అదెందుకు తెలియదు, బాగా తెలుసు. ఈ మధ్య చాలామంది నేర్చుకుంటున్నారు కదా! స్కూల్‌ నుంచి వచ్చాక.. అప్పుడప్పుడు మేము కూడా ప్రయత్నిస్తాం. అయినా ఇప్పుడు దాని గురించి ఎందుకు?’ అంటారా. అది అందరికి తెలిసిన ఆటే అయినా.. ఓ చిన్నారి అందులో వినూత్నమైన రికార్డు సాధించాడు. తనెవరో ఆ రికార్డు ఏంటో వివరాలు తెలుసుకోవాలని ఉంది కదూ. అయితే వెంటనే ఈ కథనం చదివేయండి..!

హ్మదాబాద్‌కు చెందిన భగత్‌ కథన్‌ సంకేత్‌ కుమార్‌కు తొమ్మిది సంవత్సరాలు. ప్రస్తుతం నాలుగో తరగతి చదువుతున్నాడు. పిల్లలకు ఎవరికైనా.. రకరకాల ఆటల మీద ఆసక్తి ఉండటం సహజం. అలాగే మన భగత్‌కు కూడా స్కేటింగ్‌ అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచే స్కేటింగ్‌ నేర్చుకోవడం ప్రారంభించాడట. స్కూల్‌ నుంచి వచ్చాక, సెలవు రోజుల్లో, ఇలా.. కాస్త ఖాళీ సమయం దొరికినా చాలు ప్రాక్టీస్‌ చేస్తూనే ఉంటాడు.

కొత్త రికార్డు..!

సాధారణంగా స్కేటింగ్‌లో చాలా మంది రికార్డులు సాధిస్తారు. కానీ మన భగత్‌ అందులోనే కొత్తగా ప్రయత్నించాలనుకున్నాడు. అందుకే ముందుకు కాకుండా వెనక్కి స్కేటింగ్‌ చేయడం ప్రారంభించాడు. అతి తక్కువ సమయంలో ఎక్కువ దూరం వెనక్కి స్కేటింగ్‌ చేసి రికార్డు సాధించాడు. ఆగకుండా 5.1 కిలో మీటర్లు స్కేటింగ్‌ చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. ప్రాక్టీస్‌ చేసే సమయంలో ఎన్ని గాయాలయినా లెక్క చేయకుండా.. మళ్లీ మళ్లీ సాధన చేస్తూనే ఉన్నాడట. దీనికి సంబంధించిన జిల్లా, రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొని బంగారు, వెండి పతకాలు కూడా సాధించాడు. ఇంతటి ప్రతిభ కనబర్చిన భగత్‌ను గుర్తించిన ‘ఇంటర్నేషనల్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’ వారు అందులో స్థానం కూడా కల్పించారు. తను స్కేటింగ్‌లోనే కాదు నేస్తాలూ.. చదువులోనూ ముందే ఉంటాడట. మరి తను ఇలాగే మరిన్ని రికార్డులు సాధించి, అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలని మనమూ ‘ఆల్‌ ది బెస్ట్‌’ చెప్పేద్దామా..!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని