‘యంత్ర’ముగ్ధుల్ని చేస్తూ... ‘శుభ శ్రీ’కారం!

ఆ చిన్నారి.. అన్నదాతైన తన తాతయ్య కష్టాన్ని స్వయంగా చూసింది. ఆయన పంటను పండించిన తరువాత వరి కోయడం, ధాన్యం వేరు చేయడం, బస్తాల్లో నింపడం వరకు వివిధ దశల్లో పడుతున్న కష్టం, ఖర్చులను చూసి చలించిపోయింది.

Updated : 01 Mar 2024 00:28 IST

ఆ చిన్నారి.. అన్నదాతైన తన తాతయ్య కష్టాన్ని స్వయంగా చూసింది. ఆయన పంటను పండించిన తరువాత వరి కోయడం, ధాన్యం వేరు చేయడం, బస్తాల్లో నింపడం వరకు వివిధ దశల్లో పడుతున్న కష్టం, ఖర్చులను చూసి చలించిపోయింది. వీటన్నింటినీ తక్కువ వ్యయంతో చేసే ఓ యంత్రం ఉంటే బాగుండు అని కోరుకుంది. దాన్ని తానే ఎందుకు తయారు చేయకూడదనుకుంది. అనుకున్నదే తడవుగా తాను చదువుతున్న పాఠశాల ఛైర్మన్‌ సహకారంతో దాన్ని రూపొందించింది. ఆ వినూత్న ఆవిష్కరణకుగాను జాతీయ స్థాయిలో అవార్డులూ సాధిస్తోంది. మరి ఆ బుజ్జి ఆవిష్కర్త పూర్తి వివరాలు తెలుసుకుందామా!

శుభశ్రీ సాహు.. ప్రస్తుతం కరీంనగర్‌లో పదో తరగతి చదువుతోంది. తల్లి సుగ్యాని కుమారి సాహు. ఈమె గృహిణి, తండ్రి లలిత్‌ మోహన్‌ సాహు. ఈయన ఓ ప్రైవేట్‌ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. శుభశ్రీ తాను ఎనిమిదో తరగతిలో ఉన్నప్పుడు పర్యావరణ అనుకూల బహుళ కార్యాచరణ వ్యవసాయ యంత్రాన్ని పాఠశాల ఛైర్మన్‌ డాక్టర్‌ ఇ.ప్రసాదరావు ప్రోత్సాహంతో తయారు చేసింది. దానికి ‘కిసాన్‌ మిత్ర’ అనే పేరు పెట్టింది.

అన్నదాతకు ‘ఆదా’యం!

‘కిసాన్‌ మిత్ర’ యంత్రం వరి నూర్పిడి, ధాన్యాన్ని వేరు చేయడం, గడ్డిని కత్తిరించడం, విన్నోవింగ్‌, బ్యాగ్‌ కుట్టడం వంటి నాలుగు వేర్వేరు కార్యకలాపాలను సమర్థంగా నిర్వహిస్తోంది. మరో విశేషం ఏంటంటే ఈ యంత్రం సౌరశక్తితో పని చేస్తుంది. దీంతో రైతుకు భారీగా ఆదా అవుతుంది. దీన్ని ఇండియన్‌ అగ్రికల్చరల్‌ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ (ఐ.సి.ఎ.ఆర్‌.) శాస్త్రవేత్తలు కూడా ఆమోదించారు.

వరించిన అవార్డులు!

ఈ ‘కిసాన్‌ మిత్ర’ యంత్రం తయారు చేసినందుకుగాను శుభశ్రీ 2023లో వివో ఇగ్నైట్‌ టెక్నాలజీ అండ్‌ ఇన్నోవేషన్‌ అవార్డుకు ఎంపికైంది. న్యూదిల్లీలో జరిగిన కార్యక్రమంలో రూ.5 లక్షల నగదు బహుమతినీ సొంతం చేసుకుంది. ఈ మొత్తాన్ని ఇటీవల కరీంనగర్‌ జిల్లా కలెక్టర్‌ పమేలా సత్పతి చేతుల మీదుగా అందుకుంది. అలాగే.. ఓఎల్‌ఎల్‌సీ, సీఎన్‌బీసీ టి.వి-18 స్కిల్‌ టైటాన్‌ గ్రాండ్‌ ఫినాలే ముంబయిలో రూ.2 లక్షల నగదు బహుమతి అందుకుంది. ‘2023 ఇన్స్‌పైర్‌ మనక్‌’ అవార్డుకు ఎంపికై రూ.10,000 నగదు బహుమతి సొంతం చేసుకుంది. ‘2023 సీబీఎస్‌ఈ నేషనల్‌ సైన్స్‌ ఎగ్జిబిషన్‌’లోనూ విజేతగా నిలిచి, న్యూదిల్లీలో రూ.5000 నగదు బహుమతి అందుకుంది. ‘2023 యంగ్‌ అచీవర్స్‌’ అవార్డుకు ఎంపికై ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ తమిళి సై సౌందరరాజన్‌ చేతుల మీదుగా రూ.5000 నగదు బహుమతి అందుకుంది. స్పార్క్‌ ఇన్నోవేషన్స్‌ అవార్డు గెలుచుకుని హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో రూ.10,000 నగదు బహుమతి సాధించింది. న్యూ దిల్లీలో జరిగిన ‘సీబీఎస్‌ఈ నేషనల్‌ స్కిల్‌ ఎక్స్‌పో’, పుణెలో నిర్వహించిన రాష్ట్రీయ బాల వైజ్ఞానిక ప్రదర్శనలో శుభశ్రీ తయారు చేసిన ఈ యంత్రం అందరినీ మంత్రముగ్ధుల్ని చేసింది.

తాతయ్య కష్టం చూడలేకే..

శుభశ్రీ సాహు 8వ తరగతి చదువుతుండగా వేసవి సెలవులకు ఒడిశాలోని బరంపురానికి తన నానమ్మ- తాతయ్య వాళ్ల ఇంటికి వెళ్లింది. వరిసాగులో తాతయ్య కష్టాన్ని, ఆయన పెడుతున్న ఖర్చుల్ని చూసి చలించిపోయింది. వీటికి పరిష్కారంగా ఓ యంత్రాన్ని తయారు చేయాలనుకుంది. గైడ్‌ టీచర్‌తో తన ఆలోచన పంచుకుని, ఆయన సహకారంతో కిసాన్‌ మిత్ర యంత్రం తయారు చేసింది. చదువుకునే వయసులోనే ఇంత ఘనత సాధించడం నిజంగా గ్రేట్‌ కదూ! మరి మన శుభశ్రీ భవిష్యత్తులో మరిన్ని ఆవిష్కరణలు చేయాలని మనమూ మనసారా కోరుకుందామా నేస్తాలూ!

ముత్యాల మహేందర్‌రెడ్డి, న్యూస్‌టుడే, కరీంనగర్‌ కొత్తపల్లి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని