అర్షియా అదరహో..!

హాయ్‌ నేస్తాలూ..! ఇంట్లో అమ్మ ఏదైనా పని చెబితే చాలు ఎలా తప్పించుకోవాలా అని చూస్తాం. ఏవైనా చిన్నచిన్న బరువులు ఎత్తే పని చెప్పినా.. చేయడానికి అస్సలు ముందుకు వెళ్లకుండా.. చాలా బద్ధకిస్తాం.. అంతే కదా!

Updated : 05 Mar 2024 04:47 IST

హాయ్‌ నేస్తాలూ..! ఇంట్లో అమ్మ ఏదైనా పని చెబితే చాలు ఎలా తప్పించుకోవాలా అని చూస్తాం. ఏవైనా చిన్నచిన్న బరువులు ఎత్తే పని చెప్పినా.. చేయడానికి అస్సలు ముందుకు వెళ్లకుండా.. చాలా బద్ధకిస్తాం.. అంతే కదా! కానీ మనలాంటి ఓ చిన్నారి..  బరువులు ఎత్తుతూనే.. రికార్డులు సాధించింది. మరి తనెవరో.. ఆ వివరాలేంటో తెలుసుకుందామా..!

రియాణాలోని పంచకులకు చెందిన అర్షియా గోస్వామికి ఎనిమిది సంవత్సరాలు. ప్రస్తుతం మూడో తరగతి చదువుతోంది. ‘తనేమో చాలా చిన్న అమ్మాయి.. కానీ ముందేమో బరువులు ఎత్తుతూ రికార్డులు సాధించిందని చెప్పారు’ అసలేంటి? అని ఆలోచిస్తున్నారా.. ముందుగా చెప్పింది కూడా ఈ చిన్నారి గురించే.. తన శరీర బరువు కంటే రెట్టింపు బరువులు ఎత్తి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది మన అర్షియా.

నాన్న ప్రోత్సాహమే..

ఈ చిన్నారి వాళ్ల నాన్న జిమ్‌ నడుపుతుంటారట. అలా తను చిన్నప్పటి నుంచి సరాదాగా అక్కడికి వెళ్లి ఆడుకునేదట. అప్పుడప్పుడు అక్కడుండే వస్తువులు ఎత్తడానికి ప్రయత్నించేదట. ఆమె ఆసక్తిని గమనించిన వాళ్ల నాన్న.. మెల్లమెల్లగా వెయిట్‌ లిఫ్టింగ్‌ నేర్పించారట. కొన్ని నెలలు నేర్చుకున్న తర్వాత 25 కిలోల బరువులు అమాంతంగా పైకి ఎత్తిందట. తనకు ఆరేళ్ల వయసున్నప్పుడే 45 కిలోలు లిఫ్ట్‌ చేసి ‘గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌’, ‘ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’లలో స్థానం సంపాదించుకుంది. ఇప్పుడు ఏకంగా 60 కిలోల బరువు ఎత్తి మరో రికార్డు సృష్టించింది.

జాగ్రత్త సుమీ!

ఎలా పడితే అలా బరువులు ఎత్తితే ప్రమాదం కదా నేస్తాలూ..! దాని కోసం కొన్ని నియమాలు కూడా పాటించాల్సి ఉంటుందట. తనకు వెయిట్‌ లిఫ్టింగ్‌తో పాటుగా.. వ్యాయామం చేయడం, డాన్స్‌ చేయడం, పాటలు పాడటం అంటే చాలా ఇష్టమట. తన ప్రాక్టీస్‌కి సంబంధించిన వీడియోలను ఇన్‌స్టాలో కూడా పంచుకుంటుందీ చిన్నారి. ఎక్కువ బరువులు ఎత్తి అత్యుత్తమ రికార్డు సాధించడమే తన లక్ష్యమట. ఎంతైనా మన అర్షియా చాలా గ్రేట్‌ కదూ..! మరి మనమూ తనకి ‘ఆల్‌ ది బెస్ట్‌’ చెప్పేద్దామా..! మీరు మాత్రం అస్సలు ప్రయత్నించకండి సరేనా!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని