‘రాకెట్‌’లా దూసుకుపోతున్న హృతిక్‌!

హాయ్‌ నేస్తాలూ..! మనకు చిన్నప్పటి నుంచి ఆటల మీద ఆసక్తి ఉంటుంది. కానీ ఏదో సరదాగా ఆడటం కాకుండా, నచ్చిన ఆటను ఎంచుకొని, దానిలో ఉన్నతస్థానానికి వెళ్లేది మాత్రం చాలా కొద్దిమందే.

Updated : 07 Mar 2024 04:49 IST

హాయ్‌ నేస్తాలూ..! మనకు చిన్నప్పటి నుంచి ఆటల మీద ఆసక్తి ఉంటుంది. కానీ ఏదో సరదాగా ఆడటం కాకుండా, నచ్చిన ఆటను ఎంచుకొని, దానిలో ఉన్నతస్థానానికి వెళ్లేది మాత్రం చాలా కొద్దిమందే. అయినా ఇప్పుడు ఇదంతా ఎందుకు అనుకుంటున్నారా..! అలాంటి కోవకు చెందిన ఓ అబ్బాయి గురించే మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం కాబట్టి. మరి ఆలస్యం చేయకుండా.. ఈ కథనం చదివేయండి. తన పూర్తి వివరాలేంటో మీకే తెలిసిపోతాయి..!

తెలంగాణలోని యాదాద్రి జిల్లా సాదువెల్లి గ్రామానికి చెందిన కటకం హృతిక్‌కు పదమూడు సంవత్సరాలు. ప్రస్తుతం ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. వాళ్ల నాన్న సుధాకర్‌ బిజినెస్‌ చేస్తారు. అమ్మ సౌజన్య ప్రైవేటు ఉద్యోగి. మనందరిలానే.. ఈ చిన్నారికి కూడా ఆటలు అంటే చాలా ఇష్టమట. అన్నింట్లో టెన్నిస్‌ ఆటడటమంటే ఇంకా నచ్చుతుందట. తనకు ఆరేళ్ల వయసు ఉన్నప్పటి నుంచే.. టెన్నిస్‌ రాకెట్‌తో తన ప్రయాణం ప్రారంభించాడు ఈ అబ్బాయి. ప్రస్తుతం తన ఆటతో అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ.. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధిస్తున్నాడు.

 పతకాల పంట..

మనం ఎంత ప్రయత్నించినా.. కొన్నిసార్లు ఓడిపోతూనే ఉంటాం.. వాటన్నింటినీ ఎదుర్కొంటేనే ఉన్నత లక్ష్యాలను చేరుకోగలం. అలాగే మన హృతిక్‌ కూడా మొదట్లో చాలా కష్టపడ్డాడు. ఆ తర్వాత అండర్‌-10, అండర్‌-12, అండర్‌-14 పోటీల్లో పాల్గొని 16 టైటిల్స్‌ సొంతం చేసుకున్నాడు. ఆశ్చర్యంగా ఉంది కదూ! కానీ ఇది నిజమే నేస్తాలూ.. ముంబయిలో జరిగిన సిరీస్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చి.. రెండో స్థానంలో నిలిచాడు. సింగిల్స్‌, డబుల్స్‌ విభాగంలో నేషనల్‌ సిరీస్‌ టైటిల్‌ కూడా సాధించాడు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఓ టెన్నిస్‌ అకాడమీలో శిక్షణ తీసుకుంటున్నాడు. ‘ఆల్‌ ఇండియా టెన్నిస్‌ అకాడమీ’ అండర్‌-14 బాలుర విభాగంలో మన దేశంలోనే నంబర్‌ వన్‌ ఆటగాడిగా మన హృతిక్‌ని ఎంపిక చేసింది. ఇటీవల శ్రీలంకలో జరిగిన ఏషియా ఓస్నియా ఛాంపియన్‌షిప్‌ ప్రీ క్వాలిఫైయింగ్‌ అండర్‌-14 పోటీల్లో పాల్గొని, మొదటి స్థానంలో నిలిచి.. బంగారు పతకం సాధించాడు. మలేషియాలో జరగనున్న టెన్నిస్‌ ఫైనల్స్‌కు అర్హత సాధించాడు. డేవిస్‌ కప్పు సాధించడమే తన లక్ష్యమట. తను ఇలాగే భవిష్యత్తులో మరిన్ని పతకాలు సాధించి.. తన తల్లిదండ్రులకు, మన దేశానికి మంచి పేరు తీసుకురావాలని మనమూ ‘ఆల్‌ ది బెస్ట్‌’ చెప్పేద్దామా..!
  - జి. లోషిత, ఈనాడు జర్నలిజం స్కూల్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని