చదరంగంలో అశ్వత్‌ ఘనత..!

హాయ్‌ నేస్తాలూ..! మనందరికీ ఆటలు అంటే చాలా ఇష్టం.. కానీ స్నేహితులతో కలిసి ఆడుకోవడం కంటే ఫోన్‌లో గేమ్స్‌ ఆడటానికే ఎక్కువ ఆసక్తి చూపుతున్నాం.

Updated : 09 Mar 2024 04:34 IST

హాయ్‌ నేస్తాలూ..! మనందరికీ ఆటలు అంటే చాలా ఇష్టం.. కానీ స్నేహితులతో కలిసి ఆడుకోవడం కంటే ఫోన్‌లో గేమ్స్‌ ఆడటానికే ఎక్కువ ఆసక్తి చూపుతున్నాం. ఇంకా క్యారమ్స్‌, చెస్‌ లాంటి ఆటలు ఆడటానికి అస్సలు ఇష్టపడటం లేదు అంతే కదా! ఇదంతా బాగానే చెప్పారు కానీ.. ఇప్పుడెందుకూ అనుకుంటున్నారా..! మనలాంటి ఓ చిన్నారి చదరంగం ఆటలో ఒక చరిత్ర సృష్టించాడు. మరి తనెవరో ఆ వివరాలంటో తెలుసుకుందామా..!

శ్వత్‌ కౌషిక్‌కి ప్రస్తుతం ఎనిమిది సంవత్సరాలు. అమ్మానాన్నల ఉద్యోగరిత్యా.. సింగపూర్‌లో ఉంటున్నా.. తను మన భారతదేశానికి చెందిన చిన్నారే..! తనకు నాలుగేళ్ల వయసు ఉన్నప్పటి నుంచే.. చదరంగం ఆట ఆడటం ప్రారంభించాడట. మొదటి నుంచి చాలా ఆసక్తితో ఈ ఆట ఆడేవాడట. చెస్‌ నేర్చుకోవడం కోసం ఎంత సమయమైనా వెచ్చించేవాడట. తను చదరంగం ఆడటం ప్రారంభించిన కొద్ది నెలల్లోనే.. పోటీల్లో పాల్గొనడం మొదలుపెట్టాడట. వాటిల్లో బహుమతులు కూడా అందుకున్నాడట.

అద్భుత విజయం..!

సాధారణంగా ఏదైనా పోటీలో మన తోటి వారి మీద గెలిస్తేనే చాలా సంతోషిస్తాం. అందరి నుంచి అభినందనలూ అందుకుంటాం.. కానీ మన అశ్వత్‌.. స్విట్జర్లాండ్‌లో జరిగిన ఓ ఛాంపియన్‌షిప్‌లో జాక్‌స్టోప్‌ అనే గ్రాండ్‌ మాస్టర్‌నే ఓడించాడు. తన ప్రతిభతో రికార్డు సృష్టించాడు. ఒక గ్రాండ్‌ మాస్టర్‌ని ఓడించిన అతిచిన్న వయస్కుడిగా నిలిచాడు. గతంలో ఈ రికార్డు సెర్బియాకు చెందిన లియోనిడ్‌ ఇవనోవిచ్‌ పేరున ఉండేది. ఇంకో విషయం ఏంటంటే.. తనకు ఆరేళ్ల వయసు ఉన్నప్పుడే అండర్‌-8 రాపిడ్‌ ఛాంపియన్‌గా నిలిచాడు.

నిత్య సాధన..

‘ఎన్ని పోటీల్లో గెలిచినా, ఎన్ని బహుమతులు పొందినా కూడా అశ్వత్‌ మాత్రం ప్రతిరోజు చెస్‌ ప్రాక్టీస్‌ చేయడం అస్సలు ఆపేయడు. ఎప్పుడూ ఇంకా కొత్త ఎత్తులు వేయడానికే ప్రయత్నిస్తాడు’ అని వాళ్ల నాన్న శ్రీరామ్‌ చెబుతున్నారు. భవిష్యత్తులో మన అశ్వత్‌ చదరంగం ఆటలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని మనమూ ‘ఆల్‌ ది బెస్ట్‌’ చెప్పేద్దామా!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని