ఈ అక్కాతమ్ముళ్లు... చిచ్చర పిడుగులు!

‘పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది’ అన్నట్లు.. ఈ అక్కాతమ్ముళ్లు తమ జ్ఞాపకశక్తితో పతకాల పంట పండిస్తున్నారు. అక్క.. రెండేళ్ల వయసులోనే పండ్లు, కూరగాయలు, జంతువులు, వివిధ రకాల చిత్రపటాలనూ గుర్తు పట్టేసింది.

Published : 10 Mar 2024 00:16 IST

‘పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది’ అన్నట్లు.. ఈ అక్కాతమ్ముళ్లు తమ జ్ఞాపకశక్తితో పతకాల పంట పండిస్తున్నారు. అక్క.. రెండేళ్ల వయసులోనే పండ్లు, కూరగాయలు, జంతువులు, వివిధ రకాల చిత్రపటాలనూ గుర్తు పట్టేసింది. ప్రస్తుతం ప్రపంచ పటాన్ని అవపోశన పట్టేసి.. వివిధ దేశాల రాజధానులు, జాతీయ చిహ్నాలను చకచకా చెప్పేస్తోంది. తమ్ముడు సైతం తన అక్క బాటలోనే నడుస్తూ.. ఔరా అనిపిస్తున్నాడు. మరి ఆ చిచ్చర పిడుగుల గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందామా!

డప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన ఈ చిన్నారి పేరు విశ్వనాథుల వినీశ. నాలుగేళ్ల ఈ చిన్నారి ప్రస్తుతం యూకేజీ చదువుతోంది. నాన్న పవన్‌ వస్త్ర వ్యాపారి, అమ్మ సౌమ్య గృహిణి. చాలామంది బాల్యం నుంచే స్మార్ట్‌ఫోన్‌కు బానిసలవుతున్నారు. వినీశ వాళ్ల అమ్మ మాత్రం తమ పిల్లలు అలా కాకూడదనుకున్నారు. చిన్ననాటి నుంచే జ్ఞానం పెంచుకునేలా తోడ్పాటునందించారు. జాతీయ చిహ్నాలు, ట్రాఫిక్‌ సిగ్నళ్ల రంగులు, పక్షులు, పండ్లు, కూరగాయలను గుర్తు పట్టడం, ఆంగ్లంలోని వ్యతిరేక పదాలు, జంతువుల చిత్రాలను చూపించి వాటి పేర్లు చెప్పించారు. చిన్నారి వినీశ వాటిని శ్రద్ధగా విని గుర్తు పెట్టుకునేది. మళ్లీ అడిగిన వెంటనే చెప్పేది. దీంతో తల్లి, చిన్నారికి మరిన్ని విషయాలపై అవగాహన కల్పించారు.

చాక్లెట్‌ తిన్నంత తేలిగ్గా..

వినీశ ప్రస్తుతం ప్రపంచ పటంలోని వివిధ దేశాలు, ప్రముఖ నగరాల పేర్లను చాక్లెట్‌ తిన్నంత తేలిగ్గా చెప్పేస్తోంది. అతి కష్టమైన పిరియాడిక్‌ టేబుల్‌లోని 118 సైన్స్‌ ఎలిమెంట్స్‌ను కేవలం 52 సెకన్లలోనే చూడకుండా చెప్పే నైపుణ్యమూ సాధించింది. దీంతో ఈ చిన్నారి ప్రతిభను గుర్తించి ‘ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’, ‘ఇంటర్నేషనల్‌ వండర్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’, ‘కలాం వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’, ‘నోబెల్‌ వరల్డ్‌ రికార్డ్స్‌’, ‘జీనియస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’ వారు అవార్డులు, ప్రశంసాపత్రాలు అందించారు. చిరుప్రాయంలోనే ఈ చిన్నారి ఇవన్నీ సాధించి అందరూ అవాక్కయ్యేలా చేస్తోంది.

అక్క బాటలోనే తమ్ముడూ!

వినీశ సోదరుడు ప్రజ్వల్‌ వయసు ప్రస్తుతం ఏడాది. వివిధ రకాల పండ్లు, పక్షులు, అంకెలు, కూరగాయల చిత్రాలను చూసి గుర్తించేలా అమ్మానాన్న ఈ పిల్లాడితో సాధన చేయించారు. ప్రజ్వల్‌ ప్రతిభను గుర్తించిన ‘నోబెల్‌ వరల్డ్‌ రికార్డ్స్‌’ వారు ప్రశంసాపత్రం అందించారు. అంత చిన్న వయసులో ఇంత సాధించిన ఈ అక్కాతమ్ముళ్లు నిజంగా గ్రేట్‌ కదూ!

వేల్పూరి వీరగంగాధర శర్మ, ఈనాడు డిజిటల్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని