బంతులు పట్టాడు.. రికార్డూ పట్టాడు!

హాయ్‌ నేస్తాలూ..! మనం ఎక్కడికైనా బయటికి వెళ్తే చాలు బంతి కొనివ్వమని మారాం చేస్తాం.. ఇంటికి తెచ్చుకొని ఎంచక్కా దాంతో క్యాచ్‌లు పట్టుకుంటూ ఆడుకుంటాం.

Updated : 12 Mar 2024 00:15 IST

హాయ్‌ నేస్తాలూ..! మనం ఎక్కడికైనా బయటికి వెళ్తే చాలు బంతి కొనివ్వమని మారాం చేస్తాం.. ఇంటికి తెచ్చుకొని ఎంచక్కా దాంతో క్యాచ్‌లు పట్టుకుంటూ ఆడుకుంటాం. ఒక బంతి అయితే.. పర్లేదు వెంట వెంటనే క్యాచ్‌ పట్టుకోవచ్చు. రెండు అయితే కాస్త కష్టమే అయినా.. ఆడుకోవచ్చు. కానీ అయిదు, ఆరు బంతులైతే కింద పడకుండా పట్టుకోగలమా..? అస్సలు పట్టుకోలేం కదా! కానీ ఓ అన్నయ్య మాత్రం పట్టుకోవచ్చని నిరూపించాడు. మరి తనెవరో ఆ వివరాలేంటో తెలుసుకుందామా..!

ఇంగ్లాండ్‌కు చెందిన సిమెన్‌ గ్రహమ్‌కు ప్రస్తుతం 15 సంవత్సరాలు. తను జగ్లింగ్‌ ఆటలో ఆరితేరినవాడు. ఇంతకీ జగ్లింగ్‌ ఆట అంటే ఏంటి అనుకుంటున్నారా? ఒకటి కంటే ఎక్కువ బంతులను పైకి వేస్తూ.. వాటిని కింద పడకుండా పట్టుకోవాలి. అలా ఒకదాని తర్వాత మరొకటి వేసి పట్టుకుంటూ ఉండాలి. దీన్నే జగ్లింగ్‌ ఆట అంటారు. మన సిమెన్‌ ఒక నిమిషంలో 5 బంతులతో 426, 6 బంతులతో 396, 7 బంతులతో 378 క్యాచ్‌లు పట్టి మూడు ‘గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డులు’ సాధించాడు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. ఇది నిజమే నేస్తాలూ!

ఇలా మొదలైంది..!

‘నాకు ఏడేళ్ల వయసు ఉన్నప్పుడు ఒకసారి.. బాగా జ్వరం రావడంతో ఇంట్లోనే ఉండిపోయాను. ఖాళీగా ఉండటం ఇష్టంలేక.. యూట్యూబ్‌లో వీడియోలు చూస్తూ.. మూడు బంతులతో జగ్లింగ్‌ చేయడం నేర్చుకున్నాను. దాని మీద మరింత ఆసక్తి పెరగడంతో సొంతంగా కొన్ని మెలకువలు కూడా నేర్చుకున్నా. జగ్లింగ్‌పైన నా ఇష్టాన్ని గమనించిన మా అమ్మానాన్న నన్ను ఒక ట్రైనింగ్‌ స్కూల్లో చేర్పించారు. చదువుని ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా.. జగ్లింగ్‌ని నేర్చుకుంటూ వచ్చాను. తర్వాత కొన్ని రోజులకు వేదికల మీద ప్రదర్శనలు ఇవ్వడం ప్రారంభించాను’ అని చెబుతున్నాడు మన సిమెన్‌.

శిక్షణ కూడా..!

తను నేర్చుకోవడమే కాకుండా.. జగ్లింగ్‌ మీద ఆసక్తి ఉన్న వాళ్లకు శిక్షణ ఇవ్వడం కూడా ప్రారంభించాడట మన సిమెన్‌. యూట్యూబ్‌లో కూడా తన తరగతులు పోస్ట్‌ చేస్తాడట. ప్రతిరోజు కనీసం ఒక గంటసేపయినా.. ప్రాక్టీస్‌ చేస్తాడట. ఇప్పటి వరకు వందల సంఖ్యలో ప్రదర్శనలు కూడా ఇచ్చాడట. తను 11 బంతుల వరకు జగ్లింగ్‌ చేయగలడట. 15 బంతులు జగ్లింగ్‌ చేయడమే తన ప్రధాన లక్ష్యమట. దీనితో పాటుగా వీడియో గేమ్స్‌ ఆడటమంటే సిమెన్‌కు చాలా ఇష్టమట. ఎంతైనా తను చాలా గ్రేట్‌ కదూ!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని