మునివేళ్ల మీదే బుడతడి విజయం!

హాయ్‌ నేస్తాలూ..! మనం రూబిక్‌ క్యూబ్స్‌ని కొత్తగా పరిచయం చేసుకోవాల్సిన పనేం లేదు కదా! ఎందుకంటే మన చిన్నప్పటి నుంచి వాటిని చూస్తూనే ఉన్నాం..

Published : 19 Mar 2024 00:14 IST

హాయ్‌ నేస్తాలూ..! మనం రూబిక్‌ క్యూబ్స్‌ని కొత్తగా పరిచయం చేసుకోవాల్సిన పనేం లేదు కదా! ఎందుకంటే మన చిన్నప్పటి నుంచి వాటిని చూస్తూనే ఉన్నాం.. అందులో చిన్నచిన్నవైతే కాస్త సమయం పట్టినా సాల్వ్‌ చేసేస్తాం! కానీ కొంచెం పెద్దవయితే.. ‘అమ్మో మా వల్ల కాదు!’ అనేస్తాం అంతే కదా. కానీ ఓ బుడతడు మాత్రం దాన్ని కూడా సాధ్యం చేసి రికార్డు సృష్టించాడు. మరి తనెవరో ఆ వివరాలేంటో తెలుసుకుందామా!

చైనాకు చెందిన చిన్నారి ‘నిబొరుయి’కి ప్రస్తుతం ఆరు సంవత్సరాలు. ‘అంత చిన్న వయసు పిల్లలంటే.. రంగురంగుల రూబిక్‌ క్యూబ్స్‌, బొమ్మలతో ఎంచక్కా ఆడుకుంటారు. లేదంటే పెద్దవాళ్లు ఎవరి సాయంతోనైనా అప్పుడప్పుడే.. వాటిని సాల్వ్‌ చేయడం నేర్చుకుంటారు’ అని అనుకుంటున్నారు కదూ! అది నిజమే కానీ.. మన నిబొరుయి మాత్రం ఏకంగా 15×15×15 రూబిక్‌ క్యూబ్‌నే సాల్వ్‌ చేసేశాడు. అదేంటి 2×2×2, 4×4×4 రూబిక్‌ క్యూబ్స్‌, పిరమిడ్‌ క్యూబ్స్‌ విన్నాం కానీ.. ఇదేంటి కొత్తగా అనుకుంటున్నారా..! ఇది కూడా ఒక రకమైన రూబిక్‌ క్యూబే. కాస్త పెద్ద పరిమాణంలో ఉంటుందంతే.

తక్కువ సమయంలోనే..

అంత పెద్ద క్యూబ్‌ చేతితో పట్టుకోవడమే పిల్లలకు చాలా కష్టంగా ఉంటుంది. కానీ తను కేవలం 2 గంటల 14 నిమిషాల్లో దాన్ని సాల్వ్‌ చేసి.. ప్రపంచంలోనే ‘యంగెస్ట్‌ 15×15×15 రూబిక్‌ క్యూబ్‌ సాల్వర్‌’గా నిలిచాడు. ఆశ్చర్యంగా ఉంది కదూ.. కానీ ఇది నిజంగా నిజమే నేస్తాలూ! తన ప్రతిభతో ‘ఏషియన్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’, ‘వరల్డ్‌ రికార్డ్‌ సర్టిఫికేషన్‌’లో స్థానం కూడా సంపాదించాడు. తనకి చిన్నప్పటి నుంచే రూబిక్‌ క్యూబ్స్‌తో ఆడుకోవడమంటే చాలా ఇష్టమట. అలా ఆడుకుంటూనే వాటిని సాల్వ్‌ చేయడం నేర్చుకున్నాడట. ముందు చిన్నవి సాల్వ్‌ చేయడం వచ్చాక.. పెద్దవి సాల్వ్‌ చేయడానికి ప్రయత్నించాడట. ఎంతైనా మన నిబొరుయి చాలా గ్రేట్‌ కదూ! తను ఇలాగే మరిన్ని రికార్డులు సొంతం చేసుకోవాలని మనమూ ‘ఆల్‌ ది బెస్ట్‌’ చెప్పేద్దామా!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని