బంతి వదలని విక్రమార్కుడు!

హాయ్‌ నేస్తాలూ..! మనకు బంతులతో ఆడుకోవడం చిన్నప్పటి నుంచి అలవాటే.. అవంటే చాలా ఇష్టం కూడా. మనం మొదటిసారి కొనుక్కున్న బొమ్మల్లో ఇది కూడా ఉండే ఉంటుంది.. అంతే కదా! ఇదంతా ఇప్పుడు ఎందుకు అనుకుంటున్నారా?

Updated : 22 Mar 2024 04:50 IST

హాయ్‌ నేస్తాలూ..! మనకు బంతులతో ఆడుకోవడం చిన్నప్పటి నుంచి అలవాటే.. అవంటే చాలా ఇష్టం కూడా. మనం మొదటిసారి కొనుక్కున్న బొమ్మల్లో ఇది కూడా ఉండే ఉంటుంది.. అంతే కదా! ఇదంతా ఇప్పుడు ఎందుకు అనుకుంటున్నారా? ఒక అన్న ఆ బంతులతో రికార్డు సృష్టించాడు. మరి తనెవరో ఆ వివరాలేంటో తెలుసుకుందామా..!

ర్ణాటకలోని బెంగళూరుకు చెందిన శ్రేయాంక్‌కు 12 సంవత్సరాలు. ప్రస్తుతం ఏడో తరగతి చదువుతున్నాడు. తనకు కూడా మనందరిలాగే చిన్నప్పటి నుంచే.. బంతులతో ఆడుకోవడం అంటే చాలా ఇష్టమట. ఖాళీ సమయం దొరికిన ప్రతిసారీ బంతితో ఆడటానికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవాడట. అలా తను సొంతంగానే జగ్లింగ్‌ ఆట నేర్చుకున్నాడట. అదే నేస్తాలూ.. ఒక బంతి తర్వాత మరో బంతిని వెంటనే గాల్లోకి విసిరేస్తూ పట్టుకోవడం. మీకు తెలిసే ఉంటుంది కదా!

రికార్డూ సాధించాడు..!

మన శ్రేయాంక్‌ ఒకేసారి మూడు బంతులను జగిల్‌ చేయగలడు తెలుసా! ఇంకో విషయం ఏంటంటే.. తను ఒంటి కాలు మీద నిలబడి.. 2 నిమిషాల 25 సెకన్లు ఆపకుండా, మూడు బంతులు జగిల్‌ చేశాడు. ‘అసలు జగ్లింగే.. చాలా కష్టం అనుకుంటే.. అలా ఒంటి కాలు మీద నిలబడి చేయడమేంటి?’ అని ఆశ్చర్యపోతున్నారు కదూ! కానీ ఇది నిజమే నేస్తాలూ. తన ప్రతిభతో ‘ఇంటర్నేషనల్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’లో కూడా స్థానం సంపాదించి  రికార్డు సృష్టించాడు. ‘చూడటానికి మనకు భలేగా అనిపిస్తుంది కానీ.. చాలా కష్టంగా ఉంటుంది. శ్రేయాంక్‌ మొదట్లో సాధన చేసేటప్పుడు బంతులు కిందపడిపోతూనే ఉండేవి. కానీ పట్టు వదలకుండా.. ప్రాక్టీస్‌ చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు తను ఈ రికార్డు సాధించినందుకు మాకు చాలా గర్వంగా ఉంది’ అని వాళ్ల అమ్మానాన్నలు చెబుతున్నారు. ఎంతైనా మన శ్రేయాంక్‌ చాలా గ్రేట్‌ కదూ.. ఇలాంటి రికార్డులు భవిష్యత్తులో మరిన్ని సాధించాలని మనమూ ‘ఆల్‌ ది బెస్ట్‌’ చెప్పేద్దామా!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని