దమ్మున్న అన్నాదమ్ముళ్లు!

మనలో చాలా మంది కాస్త ఖాళీ సమయం దొరికితే చాలు స్మార్ట్‌ఫోన్‌లో మునిగిపోతూ, కాలక్షేపం చేస్తుంటారు కదూ! కానీ క్షణం కూడా వృథా చేయకుండా దూసుకెళ్తున్నారు ఈ అన్నాదమ్ముళ్లు. కళ్లకు గంతలు కట్టుకుని కేవలం కొన్ని సెకన్లలో ఆంగ్ల అక్షరాలు ‘ఎ’ నుంచి ‘జెడ్‌’ వరకు ముందు నుంచి వెనక్కి, వెనక నుంచి ముందుకూ టైప్‌ చేస్తూ రికార్డులు సృష్టిస్తున్నారు.

Published : 25 Mar 2024 00:14 IST

మనలో చాలా మంది కాస్త ఖాళీ సమయం దొరికితే చాలు స్మార్ట్‌ఫోన్‌లో మునిగిపోతూ, కాలక్షేపం చేస్తుంటారు కదూ! కానీ క్షణం కూడా వృథా చేయకుండా దూసుకెళ్తున్నారు ఈ అన్నాదమ్ముళ్లు. కళ్లకు గంతలు కట్టుకుని కేవలం కొన్ని సెకన్లలో ఆంగ్ల అక్షరాలు ‘ఎ’ నుంచి ‘జెడ్‌’ వరకు ముందు నుంచి వెనక్కి, వెనక నుంచి ముందుకూ టైప్‌ చేస్తూ రికార్డులు సృష్టిస్తున్నారు. మరి వారి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందామా!

వైయస్‌ఆర్‌ జిల్లా కడపకు చెందిన లిఖిత్‌ కుమార్‌, ప్రణీత్‌కుమార్‌ అన్నదమ్ములు. లిఖిత్‌కుమార్‌కు పదిహేను సంవత్సరాలు. ప్రస్తుతం పదో తరగతి చదువుతున్నాడు. ప్రణీత్‌కుమార్‌కు పదమూడు సంవత్సరాలు. తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. వీరిద్దరూ.. రోజూ పాఠశాల నుంచి ఇంటికి వచ్చిన వెంటనే, ఖాళీ సమయం దొరికితే చాలు కంప్యూటర్‌ కీబోర్డు మీద అక్షరాల టైపింగ్‌ సాధన చేస్తుంటారు. తండ్రి శివప్రసాద్‌ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. తల్లి శ్రీలక్ష్మీ రెడ్డమ్మ.. గృహిణి.

తండ్రి ఆశయం..

టైపింగ్‌లో రికార్డు సాధించాలని తండ్రికి ఆశగా ఉండేది. కానీ దాన్ని ఆయన సాకారం చేసుకోలేకపోయారు. తన కుమారుల ద్వారా అయినా ఆయన ఆశయాన్ని నెరవేర్చుకోవాలనుకున్నారు. అందుకే చిన్ననాటి నుంచే వారితో సాధన చేయిస్తున్నారు. లిఖిత్‌కుమార్‌ కంప్యూటర్‌ కీబోర్డు మీద 4.14 సెకన్ల వ్యవధిలోనే ‘ఎ’ నుంచి ‘జెడ్‌’ వరకూ కళ్లకు గంతలు కట్టుకుని చకచకా టైప్‌ చేయగలడు. దీంతో ఇతనికి ‘ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’ నుంచి అ¦వార్డు, ప్రశంసాపత్రాలు దక్కాయి.

అన్నను మించిన తమ్ముడు!

ప్రణీత్‌కుమార్‌ తనకు నాలుగేళ్ల వయసున్నప్పటి నుంచే వేగంగా కంపోజ్‌ చేయడం ప్రాక్టీస్‌ చేస్తున్నాడు. కళ్లకు గంతలు కట్టుకుని కేవలం 3.9 సెకన్లలోనే ‘ఎ’ నుంచి ‘జెడ్‌’ వరకూ టైప్‌ చేస్తూ ‘గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌’, ‘ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’, ‘వండర్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’లో స్థానం సంపాదించుకున్నాడు. కళ్లకు గంతలు లేకుండా.. 3.30 సెకన్లలోనే టైప్‌ చేసినందుకుగానూ మరో గిన్నిస్‌ రికార్డునూ సాధించాడు. ఈ అన్నాదమ్ముళ్లు ఉదయాన్నే నాలుగున్నరకు నిద్ర లేచి గంటపాటు టైపింగ్‌ ప్రాక్టీస్‌ చేస్తారు. చదువుల్లోనూ చక్కగా రాణిస్తూ.. పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. నిజంగా వీరిద్దరూ గ్రేట్‌ కదూ!

వేల్పూరి వీరగంగాధర శర్మ, ఈనాడు డిజిటల్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని